క్రీడాభూమి

కోహ్లీకి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 4: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించినప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ-20 క్రికెట్ టోర్నీలో మాత్రం ఎదురీదుతున్నాడు. నంబర్ వన్ స్థానంలో ఉండాల్సిన అతని కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేక, అభిమానులను నిరాశపరుస్తున్నది. ఈ పరిస్థితుల్లో, లీగ్ దశలో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్ కోహ్లీ సామర్థ్యానికి పరీక్షగా నిలవనుంది. ఇప్పటి వరకూ రాయల్ చాలెంజర్స్ 14 మ్యాచ్‌లు ఆడి, ఎనిమిది పరాజయాలను చవిచూసింది. ఆరు మ్యాచ్‌లు గెల్చుకొని, మొత్తం 12 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. నైట్ రైడర్స్ 14 మ్యాచ్‌లో ఆరు ఆరింటిని చేజార్చుకుంది. ఎనిమిది విజయాలతో 16 పాయింట్లు సంపాదించింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ నాయకత్వం వహిస్తున్న నైట్ రైడర్స్‌కు రాయల్ చాలెంజర్స్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందనడంలో సందేహం లేదు. అయితే, విజయావకాశాలు ఆ జట్టుకు కూడా లేకపోలేదు. కాగితంపై చూస్తే, నైట్ రైడర్స్ కంటే రాయల్ చాలెంజర్స్ బలంగా కనిపిస్తున్నది. కెప్టెన్ కోహ్లీతోపాటు ఏబీ డివిలియర్స్ రూపంలో ఆ జట్టుకు పించ్ హిట్టర్ ఉన్నాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మోయిన్ అలీ, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, యుజువేంద్ర చాహల్ తదితరులు బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నారు. వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ బ్యాటింగ్‌లో రాణించి, పరుగులు సాధించడంలో సమర్థుడు. ఇలాంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, రాయల్ చాలెంజర్స్ ఎందుకు పరాజయాలను ఎదుర్కొంటున్నదనే ప్రశ్నకు సరైన సమాధానం రావడం లేదు. టీమిండియాకు కెప్టెన్‌గా అనేకానేక విజయాలను సాధించిపెట్టిన కోహ్లీ నాయకత్వ ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సాధారణ ఆటగాడి నుంచి కూడా అత్యుత్తమ సేవలను రాబట్టుకోవడంలో సమర్థుడైన అతను జట్టుకు కొండంత అండ. కెప్టెన్సీ వైఫల్యాలు లేవన్న నిర్ధారణకు వస్తే, ఆటగాళ్లే పూర్తి అంకిత భావంతో ఆడడం లేదనే అనుకోవాలి. ఎవరికి వారు తమతమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడుతున్నందునే రాయల్ చాలెంజర్స్‌కు సమస్యలను తెచ్చిపెడుతున్నదన్న విమర్శలు లేకపోలేదు. కాగా, నైట్ రైడర్స్‌తో శుక్రవారం హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొన్న రాయల్ చాలెంజర్స్ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ చేదు అనుభవాల నుంచి బయటపడి, మళ్లీ విజయాల బాట పట్టాలంటే, నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి పోరాడక తప్పదు. నాకౌట్ దశకు చేరాలంటే, ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌ల్లోనూ జాగ్రత్త ఆడాలన్న విషయం కోహ్లీ సేనకు తెలుసుకాబట్టి, నైట్ రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలుపొంది, మళ్లీ ఫామ్‌లోకి వస్తుందని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్ నాయకత్వంలోని నైట్ రైడర్స్‌లో స్టార్లు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కానీ, ప్రతి ఒక్కరూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆడడం ఆ జట్టుకు ఉత్తమ ఫలితాలను సాధించిపెడుతున్నది. దినేష్ కార్తీక్ బ్యాటింగ్ సామర్థ్యానికి ఆండ్రూ రసెల్, నితీష్ రాణా, రాబిన్ ఉతప్ప, కార్లొస్ బ్రాత్‌వెయిట్ వంటి సమర్థులు తోడైనందువల్ల నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నది. క్రిస్ లిన్, పీయూష్ చావ్లా వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. స్థూలంగా చూస్తే, రాయల్ చాలెంజర్స్ కంటే కొంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, పట్టుదలలో, చివరి వరకూ పోరాటాన్ని కొనసాగించే విషయంలో ఆ జట్టుకు ఏమాత్రం తీసిపోదు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోహ్లీ బృందం నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, నైట్ రైడర్స్ విజయాన్ని పూర్తిగా కొట్టేయడానికి వీల్లేదు. మొత్తం మీద ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడం ఖాయం.