క్రీడాభూమి

బెంగళూరుకు కఠిన పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 18: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుస పరాజయాలను ఎదుర్కొంటూ, అభిమానులను నిరాశపరుస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుక్రవారం కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కీలకమైన గ్రూప్ మ్యాచ్‌ని ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టోర్నీలో ముందుకెళ్లే అవకాశాలు బెంగళూరుకు సజీవంగా ఉంటాయి. లేకపోతే, నాకౌట్ చేరడం సంక్లిష్టంగా మారుతుంది. ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి, అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కోహ్లీ, ఏబీ డివిలియర్స్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, ఉమేష్ యాదవ్, యుజువేంద్ర చాహల్, మోయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌథీ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ బెంగళూరు ఎందుకు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నదనేది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. నైట్ రైడర్స్ జట్టు దినేష్ కార్తీక్ నాయకత్వంలో ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడింది. నాలుగు విజయాలు సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసింది.
దినేష్ కార్తీక్‌తోపాటు రాబిన్ ఉతప్ప, అండ్రె రసెల్, కుల్దీప్ యాదవ్ వంటి కొద్ది మందికి మాత్రమే ఈ జట్టులో స్టార్ స్టేటస్ ఉంది. అయినప్పటికీ, బెంగళూరు కంటే, మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నది. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న బెంగళూరు 8 మ్యాచ్‌లు ఆడి, కేవలం ఒకటంటే ఒక మ్యాచ్‌ని మాత్రమే గెల్చుకుంది. ఏకంగా ఏడు మ్యాచ్‌లను కోల్పోయింది. ఈ టోర్నమెంట్‌లో నైట్ రైడర్స్ ప్రస్థానం అసాధారణ స్థాయిలో లేకపోయినప్పటికీ, బెంగళూరు కంటే మెరుగ్గా ఉందనేది వాస్తవం. గురువారం నాటి మ్యాచ్ హోం గ్రౌండ్‌లో జరగనుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అందుకే, విజయంపై నైట్ రైడర్స్ ధీమాతో ఉంటే, బెంగళూరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నది. నిజానికి ఈ మ్యాచ్‌లో విజయం రెండు జట్లకూ అత్యవసరమే. అయితే, నైట్ రైడర్స్ కంటే ఎక్కువ ఒత్తిడి బెంగళూరుపైనే ఉండడానికి ప్రధాన కారణం ఆ జట్టుకు కోహ్లీ నాయకత్వం వహిస్తుండడమే. అతనిపై అంచనాలు విపరీతంగా ఉంటాయి కాబట్టే, ఆ స్థాయికి తగినట్టు రాణించకపోతే, జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతాయి. దీనికితోడు ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆడాల్సి ఉంటుంది. దీనితో అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం మిగతా అందరి కంటే కోహ్లీపైనే ఎక్కువగా ఉంది. అతను స్వయంగా పూనుకొని, అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో అదరగొట్టాలి. మిగతా వారు అతనికి అండగా నిలవాలి. సమష్టిగా పోరాడితేగానీ నైట్ రైడర్స్‌ను ఓడించడం సాధ్యం కాదు. పైగా, ఆండ్రె రసెల్, కార్లొస్ బ్రాత్‌వెయిట్ వంటి విధ్వంసరక బ్యాట్స్‌మెన్ నైట్ రైడర్స్‌కు ఉన్నారు. అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న రసెల్ బ్యాట్‌తోనేగాక, బాల్‌తోనూ రాణిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో, ప్రత్యర్థిని ఏమాత్రం తక్కువ అంచనా వేసినా కోహ్లీ బృందానికి చేదు అనుభవం తప్పదు. మొత్తం మీద రెండు జట్లకూ ఈ విజయం అత్యవసరంగా మారడంతో, పోరు హోరాహోరీగా కొనసాగి, అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తున్నది.

చిత్రం...నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్. బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ