క్రీడాభూమి

రబదాకు ఫిట్నెస్ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: దక్షిణాఫ్రికా ఆటగాడు కాగిసో రబదా ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు. దీనితో అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో మిగతా మ్యాచ్‌ల్లో ఆడకుండానే వెనుదిరిగుతున్నాడు. రాబోయే వరల్డ్ కప్‌లో అతను ఆడడం అనుమానంగానే కనిపిస్తున్నది. ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడతున్న రబదా వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, మెరుగైన చికిత్స కోసం అతను స్వదేశానికి వెళుతువన్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రబదా ఆడలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 80 పరుగుల భారీ తేడాతో చిత్తుకావడం రబదా జట్టులో లేని లోటును బహిర్గతం చేసింది. వాస్తవానికి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రబదాను ఆడించాలని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అనుకున్నాడు. కానీ, ముందు జాగ్రత్తగా మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించింది. వైద్య పరీక్షల అనంతరం రబదా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, అతనికి తగినంత విశ్రాంతి అవసరమని స్పష్టమైంది. ఫలితంగా అతనిని ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌ల నుంచి తప్పించి, స్వదేశానికి పంపాలని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ తీర్మానించింది. ఇలావుంటే, ఐపీఎల్ పూర్తయిన వెంటనే వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా, తమతమ కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడడం వివిధ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఐపీఎల్ ఫైనల్ ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈనెల 30న ది ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్‌తో ప్రారంభమవుతున్నది. ఐపీఎల్‌లో విరామం లేకుండా మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఆటగాళ్లు వరల్డ్ కప్‌లో ఎంత వరకూ తమతమ దేశాలకు న్యాయం చేస్తారని ఈ మెగా టోర్నీలో ఆడే జట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ ఇప్పటికే గాయపడి, ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు రబదా కూడా అదే దారిని అనుసరిస్తున్నాడు. వరల్డ్ కప్ ప్రారంభమయ్యే నాటికి అతను పూర్తిగా కోలుకుంటాడా? లేదా? అన్న అనుమానం దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులతోపాటు అభిమానులను కూడా వేధిస్తున్నది. ఇలావుంటే, గత ఏడాది కూడా రబదా వెన్నునొప్పి కారణంగా మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఐపీఎల్ కూడా జరగడంతో, అందులో ఆడలేకపోయాడు. ఈసారి ఆడే అవకాశం వచ్చినప్పటికీ, మరోసారి ఫిట్నెస్ సమస్యతో దూరం చేసుకున్నాడు.