క్రీడాభూమి

పడిలేచే కెరటం పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌంట్‌డౌన్-6
*
పాకిస్తాన్ జట్టును ఏ టోర్నీలోనూ హాట్ ఫేవరిట్‌గా పేర్కోలేం. అలాగని, పూర్తిగా కొట్టేయడానికీ వీల్లేదు. దారుణమైన ఆటతో అభిమానులను నిరాశపరుస్తూ, పరాజయాలను ఎదుర్కోవడం, ఆ వెంటనే ఎవరూ ఊహించని రీతిలో దాడులకు దిగి విజయాలను నమోదు చేయడం పాక్ క్రికెటర్లకు అలవాటు. అందుకే ఈ జట్టును పడిలేచే కెరటంతో పోలుస్తారు. 1975 నుంచి 2015 వరకు ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఆ జట్టు ప్రస్థానాన్ని గమనిస్తే ఈ విష యం స్పష్టమవుతుంది. 1975లో జరిగిన తొలి వరల్డ్ కప్‌లో గ్రూప్ దశకే పరిమితమైన పాక్ పోరు ఆతర్వాత, 1979, 1983, 1987 సంవత్సరాల్లో సెమీస్ వర కూ కొనసాగింది. అయితే, ఆ మూడు పర్యాయాలు ఫైనల్ చేరుకోలేక వెనుదిరిగింది. కానీ, 1992లో ఒక్కసారిగా ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడింది. ఇమ్రాన్ ఖాన్ వంటి సమర్థుడు జట్టుకు స్ఫూర్తిదాయమైన నాయకత్వాన్ని అందించాడు. రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కు తీసుకొని, మళ్లీ బరిలోకి దిగిన ఇమ్రాన్ తన జట్టుకు ఏకంగా వరల్డ్ కప్ టైటిల్‌నే అందించాడు. 1996లో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టినప్పుడు, ఈ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. అభిమానులు మరోసారి టైటిల్‌ను ఆశించారు. కానీ, దారుణంగా విఫలమైన పాక్ క్వార్టర్ ఫైనల్స్ నుంచే ఇంటిదారి పట్టింది. 1999లో ఆ జట్టుపై ఎవరూ ఆశలు పెట్టుకోలేదు. సెమీస్ చేరితే గొప్పేనని అనుకున్నారు. అయితే, మరోసారి పాక్ తనదైన శైలిలో రెచ్చిపోయింది. ఫైనల్ వరకూ దూసుకెళ్లింది. టైటిల్ సాధించలేకపోయినా, ‘జెయింట్ కిల్లర్’ జట్టు ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పింది. అంతకు ముందు వరల్డ్ కప్‌లో చూపిన ప్రతిభను గుర్తుంచుకున్న పాక్ అభిమానులు 2003లో టైటిల్ లభిస్తుందని ఆశించారు. సంచలన విజయాలతో ఫైనల్ చేరడమేగాక, 1999లో మాదిరి తడబడకుండా, ప్రత్యర్థిని చిత్తుచేస్తుందని అనుకున్నారు. కానీ, పాక్ జట్టు అందరినీ నిరాశకు గురిచేసింది. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించి, స్వదేశం చేరుకుంది. 2007లో మరోసారి అలాంటి చేదు అనుభవానే్న చవిచూసింది. రెండు పర్యాయాలు కనీస పోటీ కూడా ఇవ్వకపోవడంతో, 2011లో పాక్ జట్టు ఒకటి రెండు మ్యాచ్‌లు గెలిచినా గొప్పే అనుకున్నారు. ఈ జట్టు ఆటగాళ్లు ఎప్పుడు చెలరేగుతారో? ఎప్పుడు విఫలమవుతారో? ఎవరూ చెప్పలేని పరిస్థితి. గ్రూప్ దశలోనే వెనుతిరుగుతుందనుకున్న జట్టు ఏకంగా సెమీ ఫైనల్స్ వరకూ చేరింది. ఫైనల్‌లో చోటు దక్కించుకోలేక పోయినప్పటికీ, అంతకు ముందు రెండు వరల్డ్ కప్ టోర్నీల్లో ఎదుర్కొన్న వైఫల్యాలతో పోలిస్తే, అసాధారణ విజయాలుగానే పేర్కోవాలి. 2015 వరల్డ్ కప్‌లో పాక్ మరింత పెరుగుపడి, ఫైనల్ చేరుతుందనీ, తనదైన రోజున టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంటుందని అభిమానులు ఊహించారు. కానీ, క్వార్టర్ ఫైనల్స్‌తోనే ఆ పార్టీ పోరాటం ముగిసింది.
మొత్తం మీద వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ 71 మ్యాచ్‌లు ఆడింది. 40 విజయాలు సాధించింది. 29 మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు వెల్లడి కాలేదు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో జావేద్ మియందాద్ (1,083), సరుూద్ అన్వర్ (915), ఇంజమామ్ ఉల్ హక్ (717), రమీజ్ రాజా (700), ఇమ్రాన్ ఖాన్ (666) మొదటి ఐదు స్థానాలను ఆక్రమించారు. రమీజ్ రాజా, సరుూద్ అన్వర్ అత్యధికంగా చెరి మూడు సెంచరీలు నమోదు చేశారు. అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్ల జాబితాలో వసీం అక్రం (55), ఇమ్రాన్ ఖాన్ (34), షోయబ్ అక్తర్ (30), షహీద్ అఫ్రిదీ (30), ముస్తాక్ అహ్మద్ (26) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా, ఈసారి వరల్డ్ కప్‌లో పోటీపడుతున్న పాక్ జట్టులో ఆ స్థాయి ఆటగాళ్లు లేరనే చెప్పాలి. కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ పాక్‌కు టీ-20 వరల్డ్ కప్ టైటిల్‌ను అందించాడు. అంతకు మించి అతను సాధించిన అద్భుతాలు ఏవీ లేవు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అసిఫ్ అలీ, బాబర్ ఆజమ్, ఓపెనర్ ఫఖర్ జమాన్, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఇమామ్ ఉల్ హక్ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్ విభాగం బరాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇంగ్లాండ్ వికెట్లపై వీరు గొప్పగా రాణించలేరని చెప్పడానికి ఇటీవలే జరిగిన సిరీస్‌ను పేర్కోవాలి. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగతా నాలుగు వనే్డల్లోనూ ఇంగ్లాండ్ విజయాలను నమోదు చేసింది. ఒక మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మన్ భారీ స్కోరు చేసినా, బౌలర్ల వైఫల్యంతో దానిని కూడా చేజార్చుకుంది. మహమ్మద్ అమీర్ రూపంలో టాప్ స్టార్ పేసర్ పాక్ జట్టులో ఉన్నాడు. షహీన్ అఫ్రిదీ స్పిన్నర్‌గా ఎంత వరకూ రాణిస్తాడో చూడాలి. ఈ నేపథ్యంలో, ఆల్‌రౌండర్లు హారిస్ సొహైల్, హసన్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్ తదితరులు కీలక పాత్ర పోషించాలి. లేకపోతే, పాక్‌కు ఈసారి వరల్డ్ కప్‌లో భంగపాటు తప్పదు. అయితే, ఏ దశలోనైనా ఎదురుదాడికి దిగే తత్వం ఉన్న పాక్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని గతంలో అనేక సందర్భాల్లో ప్రపంచ మేటి జట్లకు కూడా తెలిసొచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకొని, పాక్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
చిత్రాలు.. ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా సంబురాలు చేసుకుంటున్న పాకిస్తాన్ జట్టు
*1992 ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్