క్రీడాభూమి

‘బ్లాక్ హార్స్’తో కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 26: వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ‘బ్లాక్ హార్స్’ న్యూజిలాండ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే, వామప్ మ్యాచ్‌లో భారత్ వంటి పటిష్టమైన జట్టును మట్టి కరిపించి, సత్తా చాటింది. 1975 నుంచి 2015 వరకూ 11 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడిన కివీస్ ఆరు పర్యాయాలు (1975, 1979, 1992, 1999, 2007, 2011) సెమీస్ చేరిన కివీస్, 2015లో మరింత ముందుకు దూసుకెళ్లింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, టోర్నమెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేయడం న్యూజిలాండ్ సామర్థ్యానికి నిదర్శనం. ట్రోఫీని అందుకోవడానికి సుమారు నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాలన్న పట్టుదల జట్టు ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నది. వైవిధ్య భరితమైన బౌలింగ్, బలమైన బ్యాటింగ్ విభాగాలతో కివీస్ ఈసారి వరల్డ్ కప్‌పై కనే్నసింది. విజేతగా నిలవాలన్న కోరిక నెరవేర్చుకోవడానికి జట్టులోని ప్రతి ఆటగాడూ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కువ పర్యాయాలు సెమీస్ నుంచే వెనుదిరగాల్సిన పరిస్థితులను అధ్యయనం చేసి, అప్పట్లో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్లకు ఏమాత్రం ఏమరుపాటు తగదన్న విషయం బాగా తెలుసు. అందుకే, వామప్ మ్యాచ్‌ని కూడా ఆ జట్టు సీరియస్‌గానే తీసుకుందనడానికి భారత్‌తో శనివారం జరిగిన మ్యాచ్ తీరే నిదర్శనం. వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరడం ఆషామాషి కాదు. మొదటి పది రోజుల వ్యవధిలో శ్రీలంక (జూన్ 1న కార్డ్ఫిలో), బంగ్లాదేశ్ (జూన్ 5న ఓవల్‌లో), అఫ్గానిస్తాన్ (జూన్ 8న టౌన్టన్‌లో) జట్లతో తలపడే న్యూజిలాండ్‌కు ఆతర్వాత బలమైన జట్లు ఎదురవుతాయి. 13న టైటిల్ ఫేవరిట్స్‌లో ఒకటైన భారత్‌ను నాటింగ్‌హామ్‌లో ఢీకొనాల్సి ఉంటుంది. వామప్ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాను ఓడించడం అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం. 19న దక్షిణాఫ్రికాతో బర్మింగ్‌హామ్‌లో తలపడాలి. ఈ మ్యాచ్ కూడా న్యూజిలాండ్ సామర్థ్యానికి పరీక్షగా నిలవనుంది. 22న వెస్టిండీస్‌తో మాంచెస్టర్‌లో మ్యాచ్ ఆడుతుంది. 26న బర్మింగ్‌హామ్‌లో పాకిస్తాన్‌ను, 29న ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ కివీస్ కడ వరకూ పోరాడక తప్పదు. జూలై మూడున ఇంగ్లాండ్‌తో చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగే మ్యాచ్‌తో ‘బ్లాక్ క్యాప్స్’ ఈ వరల్డ్ కప్‌లో తమ గ్రూప్ దశ మ్యాచ్‌లను ముగిస్తారు. 2015లో, బ్రెండమ్ మెక్‌కలమ్ నాయకత్వంలో కివీస్ జట్టు ధాటిగా ఆడడం, మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థులపై విరుచుకుపడడం వంటి వ్యూహాలను అనుసరించింది. దూకుడుగా ఆడడంలో, అంతే వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి అనిపించుకున్న మెక్‌కలమ్ వేసిన బాటలు న్యూజిలాండ్ జట్టుకు మార్గదర్శకాలు. అయితే, ప్రస్తుత కోచ్ గారీ స్టెడ్స్ వ్యూహాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆచితూచి ఆడాలని, ప్రత్యర్థి బలహీన పడేంతవరకూ వేచిచూసి, ఆతర్వాత దాడులకు ఉపక్రమించాలని అతని సూత్రం. సహజంగానే ఈ వైరుధ్యం ఆటగాళ్లను గందరగోళానికి గురి చేస్తాయి. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, మార్టిన్ గుప్టిల్, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ వంటి ఎంతో మందికి ‘అఫెన్సివ్ క్రికెట్’ అంటేనే ఇష్టం. వీరిని స్టెడ్స్ ఏ విధంగా నియంత్రీకరిస్తాడో చూడాలి. ఇలావుంటే, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ వంటి ప్రపంచ మేటి పేసర్లు జట్టులో ఉన్నారు. వేలికి గాయమైన వికెట్‌కీపర్ టామ్ లాథమ్ త్వరగానే కోలుకుంటే, కివీస్ బ్యాటింగ్ విభాగానికి మరింత బలం చేకూరుతుంది. మొత్తం మీద, స్థూలంగా చూస్తే అన్ని విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ ప్రస్థానం ఏ విధంగా, ఎంత వరకూ సాగుతుందో చూడాలి. టైటిల్ గెలిచే సత్తావున్న జట్ల జాబితాలో కివీస్ కూడా ఉండడంతో, వరల్డ్ కప్‌లో ఈసారి పోటీ తీవ్రంగానే ఉంటుందని చెప్పాలి.