క్రీడాభూమి

విజేత ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి, జూన్ 7: టైటిల్ ఫేవరిట్‌గా ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్, ‘జెయింట్ కిల్లర్’గా ముద్ర వేయించుకున్న బంగ్లాదేశ్ మధ్య శనివారం జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవరన్నది ఉత్కంఠ రేపుతున్నది. ఈసారి వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొన్న ఇంగ్లాండ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ, ఆతర్వాత పాకిస్తాన్ చేతిలో 14 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్ కూడా మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 21 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం న్యూజిలాండ్‌తో తలపడి, రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరు జట్లు చెరొక విజయం, ఒక పరాజయంతో సమవుజ్జీలుగా నిలిచాయి. ఎలాంటి అంచనాలు లేకుండా పోటీ పడుతున్న బంగ్లాదేశ్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వదేశంలో, మద్దతుదారుల సమక్షంలో పోరాటం సాగిస్తున్న ఇంగ్లాండ్‌కు తప్పక గెలవాల్సిన పరిస్థితి. లేకపోతే, రెండు వరుస పరాజయాల కారణంగా అభిమానుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సొంత గడ్డపై మ్యాచ్‌లు ఆడడం ఒక రకంగా నష్టమేగానీ, మరో రకంగా ఎంతో లాభం. అభిమానుల మద్దతు ఒకవైపు, పిచ్‌ల తీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఊతమిస్తాయి. హోం అడ్వాంటేజ్ సహజంగానే ఏ జట్టుకైనా మేలు చేస్తుంది. పాకిస్తాన్ చేతిలో ఓడినప్పటికీ, ఇంగ్లాండ్ పోరాట తత్వాన్ని మెచ్చుకోక తప్పదు. బౌలింగ్ విభాగం విఫలమైన కారణంగా, పాక్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేయగలిగింది. అయితే, బ్యాట్స్‌మెన్ పోరాటం జట్టును ఆదుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 334 పరుగులు చేసి, కేవలం 14 పరుగుల తేడాతో ఓడింది. బౌలింగ్‌లో క్రిస్ వోక్స్, మోయిన్ అలీ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో వీరు పరుగులు తక్కువిచ్చి, ఎక్కువ వికెట్లు సాధిస్తే ఇంగ్లాండ్‌కు లాభం. మార్క్ ఉడ్ రెండు వికెట్లు తీశాడు. శనివారం నాటి మ్యాచ్‌లో అతను బౌలింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. కాగా, జొఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, అదిల్ రషీద్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. మొదటి మ్యాచ్‌లో చక్కటి బౌలింగ్‌తో రాణించిన ఆర్చర్, స్టోక్స్ మళ్లీ ఫామ్‌లోకి వస్తే, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. స్థూలంగా చూస్తే, ప్రత్యర్థిని ఇంగ్లాండ్ ఓడించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎప్పుడు ఎలా ఆడతారో..
బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎప్పుడు, ఎలా ఆడతారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. సాధారణమైన జట్టు చేతిలోనూ ఓడడం, బలమైన జట్టును కూడా చిత్తు చేయడం బంగ్లాదేశ్‌కు అలవాటుగా మారింది. అందుకే ఆ జట్టుపై ‘జెయింట్ కిల్లర్’ ముద్ర పడింది. ఈసారి వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ఫైనల్ చేరుతుందనో, టైటిల్ సాధిస్తుందనో ఎవరూ ఊహించడం లేదు. అయితే, టైటిల్ ఫేవరిట్ జట్లను సైతం ఇంటిదారి పట్టించే ప్రమాదం లేకపోలేదన్నది వాస్తవం. ఈ వాదనకు బలం చేకూర్చే సంఘటనలు ఆ జట్టు క్రికెట్ చరిత్రలో కోకొల్లలు. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఆ జట్టు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టింది. అయితే, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడి, ఓటమిపాలైంది. 49.2 ఓవర్లు ఆడి 244 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ అల్ హసన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 8 వికెట్లకు 248 పరుగులు చేసి గెలిచింది. ఈ స్కోర్లను చూస్తే, బంగ్లాదేశ్ కడ వరకూ పోరాటం సాగించిందనేది స్పష్టమవుతుంది. ఈ జట్టుపై ఎవరికీ, ఎలాంటి అంచనాలు లేవు. ఈ టోర్నీలో నమోదు చేసే ప్రతి విజయం ఈ జట్టుకు ఓ బహుమానమే అవుతుంది. అందుకే, ఇంగ్లాండ్ ఫేవరిట్‌గా పోటీలో ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదు. తనదైన రోజున ఎలంటి సంచలనాలనైనా నమోదు చేయగల సత్తా ఆ జట్టుకు ఉంది. అందుకే, శనివారం నాటి పోరులో ఇంగ్లాండ్ జాగ్రత్తగా ఆడాలి. ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే, భారీ మూల్యానే్న చెల్లించాల్సి వస్తుంది.