క్రీడాభూమి

వర్షంతోనే తంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్: ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం ఇక్కడి రోజ్ బౌల్ మైదానంలో జరగాల్సిన వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేక వర్షం కారణంగా రద్దవుతుందా? అన్న ప్రశ్న క్రీడాభిమానులను వేధిస్తున్నది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య సోమవారం ఇదే మైదానంలో జరగాల్సిన మ్యాచ్‌ని వర్షం వేటాడింది. ఆటను కొనసాగించే అవకాశాలు లేకపోవడంతో, టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లు చెరొక పాయింట్‌ను పంచుకున్నాయి. ఇదే మైదానంలో మరోసారి వెస్టిండీస్ బరిలోకి దిగనుంది. ఈసారి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో కావడంతో, విజయం సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలన్నది జాసన్ హోల్డర్ కెప్టెన్సీలో విండీస్ ఆలోచన. నిలకడగా రాణించి, సత్తా చాటడమేగాక, టైటిల్ ఫేవరిట్స్‌లో తన పేరు కూడా ఉందని నిరూపించుకోవాలన్నది ఇంగ్లాండ్ తపన. ఈ రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్ అసలు జరుగుతుందా? అనేదే ప్రశ్న. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాడ్ తన మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 104 పరుగుల తేడాతో చిత్తుచేసింది. అయితే, అదే ఒరవడిని కొనసాగించలేక, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై అన్ని విభాగాల్లోనూ అధిపత్యాన్ని కనబరచి, 106 పరుగుల భారీ తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం మీద ఇంత వరకూ మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలు, ఓ పరాజయంతో నాలుగు పాయింట్లు సంపాదించిన ఇంగ్లాండ్ నాకౌట్ దశకు చేరే అవకాశాలను మరింత మెరుగు పరచుకోవాలంటే, విండీస్‌ను తప్పక ఓడించాలి. నిలకడలేమి నుంచి బయటపడాలంటే ఇంగ్లాండ్‌పై విండీస్ తప్పక గెలవాలి. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల ఆధిక్యంతో చిత్తుచేసిన ఈ జట్టు, రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొని, 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అయితే, ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థికి చివరి వరకూ గట్టిపోటీనిచ్చింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టులో ఖాతాలో ఓ విజయం, ఓ పరాజయంతోపాటు ఓ రద్దయిన మ్యాచ్ కూడా ఉంది. ఏదిఏమైనా వరల్డ్ కప్‌లో ముందుకు వెళ్లేందుకు ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడడం ఖాయం. అందుకే, శుక్రవారం నాటి మ్యాచ్ అభిమానులను ఆకట్టుకోనుంది. స్వదేశంలో, వేలాది మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్‌లు ఆడుతున్న ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌కు అతనితోపాటు జో రూట్, జాసన్ రాయ్, జేమ్స్ విన్సీ వంటి బ్యాట్స్‌మెన్ అండ ఉంది. వికెట్‌కీపర్లు జానీ బెయిర్‌స్టో, జొస్ బట్లర్ ఇద్దరూ బ్యాటింగ్‌లోనూ నిష్ణాతులే. బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, లియాం ప్లంకెట్, టామ్ క్యూరన్, జొఫ్రా ఆర్చర్ రూపంలో అద్భుతమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. గత మ్యాచ్‌లో వోక్స్ భారీగానే పరుగులు సమర్పించుకున్నప్పటికీ, అతని బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. స్పెషలిస్టు బౌలర్లుగా మార్క్ ఉడ్, అదిల్ రషీద్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగితంపై చూస్తే, విండీస్ కంటే ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్నది.
జాసన్ హోల్డర్ కెప్టెన్‌గా ఉన్న విండీస్‌లో క్రిస్ గేల్ బ్యాటింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సామర్థ్యం ఉన్న గేల్స్‌తోపాటు డారెన్ బ్రేవో, ఇవిన్ లూయిస్, షిమ్రన్ హెత్‌మేయర్ వంటి సమర్థులైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఈ జట్టులోనూ కీపర్లు నికొలాస్ పూరన్, షాయ్ హోప్ బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఫాబియన్ అలెన్, ఆండ్రె రసెల్ ఆల్‌రౌండర్లుకాగా, ఆష్లే నర్స్, ఒషెన్ థామస్, కెమెర్ రోచ్, షానన్ గాబ్రియేల్, షెల్డన్ కాంట్రెల్ స్పెషలిస్టు బౌలర్లు. ఒక జట్టుతో మరో జట్టును పోలిస్తే, ఇంగ్లాండ్ కంటే వెస్టిండీస్ బలహీనంగా కనిపిస్తుంది. అయితే, ఎలాంటి జట్టునైనా చిత్తుచేసే సత్తా తనకు ఉందని విండీస్ ఈ టోర్నీలో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను చిత్తుచేసిన విధానం స్పష్టం చేసింది.
* ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. వాటిలో మూడు ఈసారి టోర్నీలోనే రద్దుకావడం గమనార్హం. 1979లో వెస్టిండీస్, శ్రీలంక జట్ల మధ్య ఓవల్ మైదానంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల కొనసాగలేదు. 2015లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య బ్రిస్టేబన్‌లోనూ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. తాజాగా మూడు మ్యాచ్‌లు బ్రిస్టల్‌లోనే రద్దుకావడం గమనార్హం. పాకిస్తాన్/ శ్రీలంక, శ్రీలంక/బంగ్లాదేశ్, భారత్/న్యూజిలాండ్ మ్యాచ్‌లు కొనసాగలేదు.
*
చిత్రం...సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో ట్రైనింగ్ సెషన్‌కు సపోర్టింగ్ స్ట్ఫా సభ్యుడితో కలిసి హాజరై, వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు మార్క్ ఉడ్ (మధ్య), క్రిస్ వోక్స్ (కుడి).