క్రీడాభూమి

పరువు కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 22: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం జరిగే గ్రూప్ మ్యాచ్‌లో కేవలం పరువు కోసం పోరాడనున్నాయి. ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో జరిగే ఈమ్యాచ్‌ని గెల్చుకుంటే, పాకిస్తాన్ సెమీస్ చేరడం సాంకేతిక పరంగా సాధ్యమవుతుంది. అయితే, ఆడాల్సిన మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ పాక్ విజయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేగాక, ఇతర మ్యాచ్‌ల్లో ఫలితాలు కూడా ఈ జట్టును సెమీస్ చేర్చడానికి అనువుగా రావాలి. కాగా, పాక్ చేతిలో ఓడితే దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఢీకొన్న పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయినప్పుడు అభిమానులు 1992 వరల్డ్ కప్‌ను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో కూడా మొదటి మ్యాచ్‌లో విఫలమైన పాక్ ఆతర్వాత గొప్పగా ఆడి, చివరికి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఈనెల 16న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి పోరాటం లేకుండానే చేతులెత్తేసిన పాక్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ నిర్ణయాలపై వసీం అక్రం సహా ఎంతో మంది మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ‘అసలు మతి ఉందా? భారత్ వంటి బలమైన జట్టుపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటావా? లక్ష్య ఛేదనలో టీమిండియా ఎంత దూకుడుగా ఉంటుందో తెలియదా?’ అంటూ అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్‌లో ఇంత వరకూ భారత్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా దక్కించుకోలేకపోవడంపై పాక్ జట్టుపై అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ అమీర్ ఒక్కడే భారత్‌కు గట్టిపోటీనిచ్చాడు. మిగతా వారంతా విఫలంకాగా, సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ వరుస వైఫల్యాలు జట్టు మేనేజ్‌మెంట్‌ను సైతం అసంతృప్తికి గురి చేస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అతనికి అవకాశం దక్కకపోవచ్చన్న వాదన వినిపిస్తున్నది. వరల్డ్ కప్ తర్వాత వనే్డ ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్ అవుతున్నట్టు మాలిక్ ఇది వరకే ప్రకటించాడు. కాబట్టి, మిగతా మ్యాచ్‌ల్లో ఆడించి, అతనికి వీడ్కోలు పలకాలన్న అభిప్రాయం కూడా జట్టుకు లేకపోలేదని అంటున్నారు. ఏదిఏమైనా, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన చేదు అనుభవం నుంచి పాకిస్తాన్ బయటపడిందా? లేదా? అనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటేనే పాక్ జట్టు ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది.
నిరాశపరచిన డు ప్లెసిస్ బృందం
టైటిల్ ఫేవరిట్స్ ముద్రతో లండన్ చేరుకున్నప్పటికీ, దారుణ వైఫల్యాలతో ఫఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు అందరినీ నిరాశకు గురి చేసింది. ఇప్పటికే ఈ జట్టు సెమీస్ చేరే అవకాశాలను కోల్పోయింది. పాక్‌తోపాటు దక్షిణాఫ్రికా ఖాతాలోనూ మూడు పాయింట్లే ఉన్నాయి. కానీ, పాక్ ఐదు మ్యాచ్‌లు ఆడితే, డు ప్లెసిస్ బృందం ఆరు మ్యాచ్‌లు ఆడింది. దీనితో టోర్నీలో మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచినప్పటికీ, సెమీస్‌కు చేరడం అసాధ్యం. అయితే, పాకిస్తాన్‌ను ఓడించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించుకొని, ఆతర్వాత జరిగే మ్యాచ్‌లను కూడా సొంతం చేసుకొని కొంతైనా పరువు నిలబెట్టుకోవాలన్నదే దక్షిణాఫ్రికా లక్ష్యంగా ఎంచుకుంది. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొన్న ఈ జట్టు నాలుగు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. నిజానికి గెలిచే అవకాశాలను చేతులారా జారివిడుచుకొని, ఓటమిని కొనితెచ్చుకుంది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ సెంచరీతో తన జట్టును ఆదుకోవడమేగాక, గెలిపించడంలో దక్షిణాఫ్రికా బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకొని, మళ్లీ తనదైన శైలిలో ఆడితేగానీ దక్షిణాఫ్రికా జట్టు గాడిన పడదు. ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తేనే పాక్‌ను ఓడించగలుగుతుంది. అదే సమయంలో, పోయిన పరువురును నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ఆదివారం నాటి మ్యాచ్‌ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలన్న పట్టుదలతో ఉంది. క్రికెట్ వీరాభిమానులు ఎక్కువగా ఉన్న పాకిస్తాన్‌లో జట్టు పరాజయాలను క్రీడాస్ఫూర్తితో తీసుకునే వారు చాలా తక్కువ. పరాజయాలను ఎదుర్కొని స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆటగాళ్లపై దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని పాక్ క్రికెటర్లు కోరుకుంటున్నారు. అందుకే, సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉంది. స్థూలంగా చూస్తే, దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్‌దే పైచేయిగా కనిపిస్తున్నది. విజయావకాశాలు కూడా ఎక్కువే.

చిత్రం...లార్డ్స్ మైదానంలో శనివారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన పాకిస్తాన్ క్రికెటర్లు