క్రీడాభూమి

వేలానికి బెకర్ మెడల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 24: ప్రపంచ మాజీ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ బోరిస్ బెకర్ కెరీర్‌లో సాధించిన పతకాలు, ఇతర విలువైన వస్తువులు వేలానికి వచ్చాయి. అప్పులను తీర్చలేక, 2017 దివాలా ప్రకటించిన బెకర్‌కు సంబంధించిన పతకాల వేలం గత ఏడాదే జరగాల్సి ఉండింది. అయితే, తాను సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ తరఫున యూరోపియన్ యూనియన్‌కు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానని, ఈ హోదా ఉన్నందున తన పతకాలను వేలం వేయడానికి వీల్లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, బెకర్‌కు అలాంటి నియామక పత్రాలు ఏవీ ఇవ్వలేదని సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ ఇటీవల ప్రకటించింది. అంతేగాక, 2014లో అదృశ్యమైన ఓ ఖాళీ పాస్‌పోర్టును బెకర్ ఫోర్జరీ చేశాడని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాడని ఆరోపించింది. ఈ వివాదంపై కోర్టు కేసు నడుస్తుండగా, గతంలో పతకాల వేలానికి అనుమతి పొందిన వేలిస్ హార్డీ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వేలం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుందని, జూలై 11వ తేదీ వరకూ వివరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. చివరి తేదీలోగా బిడ్డింగ్స్ తమకు చేరాలని వివరించింది. కాగా, బెకర్ జర్మనీతోపాటు వివిధ దేశాల్లో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు. మాలోర్కాలో తన విల్లా నిర్మాణం, ఆధునీకరణ పనుల కోసం చేసిన అప్పులను తీర్చకపోవడంతో కోర్టు అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేగాక, 5,70,000 డాలర్ల జరిమానా విధించింది. దీనికితోడు అతను 19,37,000 డాలర్ల వరకూ పన్నులు చెల్లించాల్సి ఉంది. కెరీర్‌లో 49 టైటిళ్లు సాధించిన బెకర్ 2,27,89,100 డాలర్లు సంపాదించాడు. కానీ, వ్యక్తిగత జీవితంలో అరాచకంగా వ్యవహరించి, కోర్టు కేసుల్లో చిక్కుకొని పరువుతోపాటు డబ్బు కూడా పోగొట్టుకున్నాడు. బెనెడికేట్ కర్టిన్‌తో వివాహేతర వ్యవహారం నెరపిన అతను ఆతర్వాత నటి బార్బరా ఫెల్టస్‌ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన తర్వాత ఆమెకు విడాకులిచ్చి, భరణం కింద సుమారు 14,00,000 డాలర్లు చెల్లించుకున్నాడు. కొన్నాళ్లు రష్యా మోడల్ ఏంజెలా ఎరూకొవాతో సహజీవనం చేశాడు. ఆమెతోనూ విభేదాలు తలెత్తాయి. భారీ మొత్తాన్ని చెల్లించి, ఆమె నుంచి విడిపోయాడు. ఆతర్వాత అలెగ్జాండ్రా మెయెర్ ఉల్డెన్ అనే క్రీడాకారిణితో కలిసి ఉన్నాడు. అయితే, బెకర్ జీవన శైలి నచ్చకపోవడంతో ఆమె ప్రముఖ టీవీ దిగ్గజం ఆలివర్ పోచర్‌ను వివాహం చేసుకుంది. ఆమె నుంచి విడిపోయిన తర్వాత, నెదర్లాండ్స్ మోడల్ షార్లే ‘లిల్లీ’ కెసెన్‌బర్గ్‌తోతోనూ జీవితం గడిపాడు. వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని, ఆమె కూడా కోర్టును ఆశ్రయించే ఉద్దేశంలో ఉందని సమాచారం. కేవలం 17 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ టైటిల్‌ను గెల్చుకొని సంచలనం సృష్టించిన బెకర్ ఆ తర్వాత కెరీర్‌లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కానీ, క్రమశిక్షణ లేని జీవితంతో పతనాన్ని కొనితెచ్చుకున్నాడు. మహిళలతో సహవాసం, విచ్చలవిడిగా ఖర్చులు అతనిని పాతాళానికి నెట్టేశాయి. ప్రస్తుత వేలం ద్వారా వచ్చే సొమ్ముతో అతని అప్పులు పూర్తి స్థాయిలో తీరే అవకాశం లేదు. అప్పటికీ ఇంకా మిలియన్ డాలర్ల మేర అతను రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. కెరీర్‌ను ఏ విధంగా సంచలనాలతో మొదలుపెట్టాడో, ఇప్పుడు అదే స్థాయిలో పతనమై, అందరి దృష్టిలో దోషిగా మిగిలాడు. చివరికి ట్రోఫీలు, టైటిళ్లు, ఇతరత్రా వ్యక్తిగత కలెక్షన్లను కోల్పోతున్నాడు.