క్రీడాభూమి

సూపర్ విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వ విజేతగా ఇంగ్లాండ్*
సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం *
మొదటిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడిన ఆతిథ్య జట్టు*
వరుసగా రెండోసారి ఫైనల్‌లో ఓడిన కివీస్
లండన్, జూలై 14: అనుక్షణం ఉత్కంఠ రేపుతూ, చివరి వరకూ ఫలితం ఎటువైపు ఉంటుందో తెలియక, ప్రేక్షకులను మునివేళ్లమీద నిల్చోబెట్టిన ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఇంగ్లాండ్ గెల్చుకుంది. తొలిసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఆతిథ్య దేశం ట్రోఫీని సాధించడం వరుసగా ఇది మూడోసారి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 241 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. దీనితో ఫలితాన్ని తేల్చడానికి సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులోనూ రెండు జట్లు సమవుజ్జీగా నిలిచాయి. ఇంగ్లాండ్ 15 పరుగులు చేస్తే, న్యూజిలాండ్ కూడా 15 పరుగులు చేసింది. సూపర్ ఓవర్ సైతం ‘టై’గా ముగిసినప్పటికీ, బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌కు ట్రోఫీ దక్కింది. 2015 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన న్యూజిలాండ్ ఈసారి ఇంగ్లాండ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది.
అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఓపెనర్లు సరైన ప్రారంభాన్ని ఇవ్వలేకపోయారు. వోక్స్ వేసిన ఇన్నింగ్స్‌లోని ఏడో ఓవర్ రెండో బంతికి గుప్టిల్ ఎల్‌బీగా వెనుదిరిగాడు. అంత కుముందు హెన్రీ నికోల్స్ విషయంలో మాదిరిగానే బంతి బ్యాట్‌కు తగిలి ఉంటుందనే ఉద్దేశంతో డీఆర్‌ఎస్‌కు గుప్టిల్ మొగ్గు చూపాడు. శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన ఇచ్చిన ఎల్‌బీని సవాలు చేశాడు. రివ్యూలో బంతి బ్యాట్‌కు తగల్లేదని స్పష్టం కావడంతో గుప్టిల్ వెనుదిరగక తప్పలేదు. 29 పరుగుల స్కోరువద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 18 బంతులు ఎదుర్కొన్న గుప్టిల్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 19 పరుగులు చేశాడు. జట్టుకు బలమైన పునాది వేసేందుకు ప్రయత్నిస్తూ, నికోల్స్‌తో కలిసి స్కోరును 21.2 ఓవర్లలో వంద పరుగుల మైలురాయికి చేర్చిన కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఆతర్వాత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. జట్టు స్కోరు 103 పరుగుల వద్ద అతను జొస్ బట్లర్ క్యాచ్ అందుకోగా, లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 53 బంతులు ఎదుర్కొని, 30 పరుగులు చేసిన అతని స్కోరులో రెండు ఫోర్లు ఉన్నాయి. అర్ధ శతకం పూర్తిచేసి, ప్రమాదకరంగా మారిన నికోల్స్‌ను కూడా ప్లంకెట్ ఔట్ చేశాడు. 77 బంతులు ఎదుర్కొన్న నికోల్స్ నాలుగు ఫో ర్లతో 55 పరుగులు సాధించాడు. ప్లంకెట్ సం ధించిన యార్కర్‌ను ఆడలేక క్లీన్ బౌల్డ్ అయిన అతని స్కోరులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యాడు. 31 బంతులు ఆడిన అతను 15 పరుగులు చేసి, మార్క్ ఉడ్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. 141 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ చేజార్చుకుంది. ఆ ఓవర్‌లో ప్లంకెట్ వికెట్ మెయిడిన్‌ను నమోదు చేయడం విశేషం. జిమీ నీషమ్ వికెట్ కూడా ప్లంకెట్ ఖాతాలోకే చేరింది. నీషమ్ 25 బంతుల్లో 19 పరుగులు చేసి, జో రూట్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. టామ్ లాథమ్ జట్టుకు మెరుగైన స్కోరును అందించేందుకు ప్రయత్నిస్తుండగా, జిమీ నీషమ్ (19), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (16) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. లాథమ్ 58 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేసి, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు జేమ్స్ విన్స్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు చిక్కాడు. మాట్ హెన్రీ నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జొఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యా డు. న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 241 పరుగులు చేసింది. అప్పటికి మిచెల్ సాంట్నర్ (5), ట్రెంట్ బౌల్ట్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ ప్లంకెట్ 42 పరుగులకు మూడు, క్రిస్ వోక్స్ 37 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు.
హెన్రీ తొలిదెబ్బ..
ఇంగ్లాండ్ జట్టును మాట్ హెన్రీ తొలిదెబ్బ తీశాడు. అతని బౌలింగ్‌లో, టామ్ లాథమ్ క్యాచ్ అందుకోగా, జాసన్ రాయ్ (20 బంతుల్లో 17) ఔటయ్యాడు. 28 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ, ఎలాంటి ఫలితం దక్కని జో రూట్ 30 బంతుల్లో కేవలం ఏడు పరుగులు చేసి, లాథమ్ క్యాచ్ పట్టగా, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ టోర్నీ మొత్తం మీద అద్వితీయ ప్రతిభతో రాణిస్తున్న జానీ బెయిర్‌స్టో ఫైనల్‌లో విఫలమయ్యాడు. 55 బంతుల్లో 36 పరుగులు చేసిన అతను లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జట్టును ఆదుకోవాల్సిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జిమీ నీషమ్ బౌలింగ్‌లో లాకీ ఫెర్గూసన్‌కు క్యాచ్ అందించడంతో, 86 పరుగుల వద్ద ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కాగా, 27.4 ఓవర్లలో ఇంగ్లాండ్ వంద పరుగుల మైలురాయిని అధిగమించింది. జొస్ బట్లర్, బెన్ స్టోక్స్ 121 బంతుల్లో వంద పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. అదే క్రమంలో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన బట్లర్, 53 బంతుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. స్టోక్స్ 81 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది 20వ వనే్డ అర్ధ శతకం. తర్వాత కొద్ది సేపటికే బట్లర్ వికెట్ కూలింది. 60 బంతుల్లో 59 పరుగులు చేసిన అతనిని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ టిమ్ సౌథీ క్యాచ్ పట్టగా లాకీ ఫెర్గూసన్ ఔట్ చేశాడు. ఐదో వికెట్‌కు 110 పరుగుల జతకలవగా, 196 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 46 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 203 పరుగులు చేసింది. అదే స్కోరువద్ద లాకీ పెర్గూసన్ బౌలింగ్‌లోనే, టామ్ లాథమ్ క్యాచ్ అందుకోవడంతో క్రిస్ వోక్స్ (2) పెవిలియన్ చేరాడు. కాగా, ఒక వరల్డ్ కప్ టోర్నీలో అత్యధికంగా 21 మందిని పెవిలియన్‌కు పంపిన వికెట్‌కీపర్‌గా ఆడం గిల్‌క్రిస్ట్ రికార్డును లాకీ ఫెర్గూసన్ సమం చేశాడు. ఫ్లంకెట్ 10 పరుగులు చేసి, జిమీ నీషమ్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్ చివరి బంతిలో జొఫ్రా ఆర్చర్‌ను జిమీ నీషమ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో చివరి బంతిలో ఇంగ్లాండ్ విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన చివరి ఓవర్ మూడో బంతిని స్టోక్స్ తర్వాతి బంతిని సిక్స్‌గా మార్చాడు. తర్వాతి బంతిలో ఎక్‌స్ట్రాలు సహా ఆరు పరుగులు లభించాయి. అదిల్ రషీద్ ఒక పరుగు చేసిన తర్వాత రనౌట్ కాగా, చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. మార్క్ ఉడ్ కూడా ఒక రన్‌ను పూర్తి చేసి రనౌట్‌కాగా, మ్యాచ్ ‘టై’ అయింది.
స్కోరుబోర్డు..
న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్ ఎల్‌బీ క్రిస్ వోక్స్ 19, హెన్రీ నికోల్స్ బీ ప్లంకెట్ 55, కేన్ విలియమ్‌సన్ సీ జొస్ బట్లర్ బీ ప్లంకెట్ 30, రాస్ టేలర్ ఎల్‌బీ మార్క్ ఉడ్ 15, టామ్ లాథమ్ సీ (సబ్‌స్టిట్యూట్) జేమ్స్ విన్స్ బీ క్రిస్ వోక్స్ 47, జిమీ నీషమ్ సీ జో రూట్ బీ ప్లంకెట్ 19, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ సీ (సబ్‌స్టిట్యూట్) జేమ్స్ విన్స్ బీ క్రిస్ వోక్స్ 16, మిచెల్ సాంట్నర్ 5 నాటౌట్, మాట్ హెన్రీ బీ జొఫ్రా ఆర్చర్ 4, ట్రెంట్ బౌల్ట్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 30, మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241.
వికెట్ల పతనం: 1-29, 2-103, 3-118, 4-141, 5-175, 6-219, 7-232, 8-240.
బౌలింగ్: క్రిస్ వోక్స్ 9-0-37-3, జొఫ్రా ఆర్చర్ 10-0-42-1, లియామ్ ప్లంకెట్ 10-0-42-3, మార్క్ ఉడ్ 10-1-49-1, అదిల్ రషీద్ 8-0-39-0, బెన్ స్టోక్స్ 3-0-20-0.
ఇంగ్లాండ్: జాసన్ రాయ్ సీ టామ్ లాథమ్ బీ మాట్ హెన్రీ 17, జానీ బెయిర్ స్టో బీ లాకీ ఫెర్గూసన్ 36, జో రూట్ సీ టామ్ లాథమ్ బీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 7, ఇయాన్ మోర్గాన్ సీ లాకీ ఫెర్గూసన్ బీ జిమీ నీషమ్ 9, బెన్ స్టోక్స్ నాటౌట్ 84, జొస్ బట్లర్ సీ (సబ్‌స్టిట్యూట్) టిమ్ సౌథీ బీ లాకీ ఫెర్గూసన్ 59, క్రిస్ వోక్స్ సీ టామ్ లాథమ్ బీ లాకీ ఫెర్గూసన్ 2, లియామ్ ప్లంకెట్ సీ ట్రెంట్ బౌల్ట్ బీ జిమీ నీషమ్ 10, జొఫ్రా ఆర్చర్ బీ జిమీ నీషమ్ 0, అదిల్ రషీద్ రనౌట్ 0, మార్క్ ఉడ్ రనౌట్ 0, ఎక్‌స్ట్రాలు 17, మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 241.
వికెట్ల పతనం: 1-28, 2-59, 3-71, 4-86, 5-196, 6-203, 7-220, 8-227, 9-240, 10-241.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 10-0-67-0, మాట్ హెన్రీ 10-2-40-1, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 10-2-25-1, లాకీ ఫెర్గూసన్ 10-0-50-3, జిమీ నీషమ్ 7-0-43-3, మిచెల్ సాంట్నర్ 3-0-11-0.

చిత్రం...గెలిచిన ఆనందంలో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు