క్రీడాభూమి

ఇక నెక్ గార్డ్ తప్పనిసరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఆగస్టు 19: తమతో కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లంతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తప్పనిసరిగా నెక్ గార్డ్‌ను ధరించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) త్వరలోనే ఆదేశాలు చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సీఏ అధికారులు ఈ అంశంపై చర్చలు జరిపారని, నిబంధనలను మార్చడం ద్వారా నెక్ గార్డ్‌ను కూడా తప్పనిసరి చేయనున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2014లో షీఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు సీన్ అబోట్ వేసిన బంతి హెల్మెంట్ గ్రిల్స్ నుంచి దూసుకెళ్లి, యువ బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్‌ను తీవ్రంగా గాయపరచిన విషయాన్ని సీఏ ఇంకా మరచిపోలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తర్వాత, క్రికెట్ గార్డ్స్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎలాంటి ప్రమాణాలను పాటించాలనే విషయంలో సీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా అవే ప్రమాణాలను పాటించాల్సిందేనంటూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. ఇలావుంటే, డ్రాగా ముగిసిన యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్ వేసిన బంతి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టివెన్ స్మిత్ మెడకు బలంగా తగిలింది. దీనితో అతను క్రీజ్‌లోనే కుప్పకూలాడు. వైద్య సిబ్బంది హుటాహుటిన వచ్చి, ప్రాథమిక చికిత్సను అందించిన తర్వాత కొద్దిగా కోలుకున్నాడు. ఆతర్వాత అతను మైదానంలోకి దిగలేదు. ఇలావుంటే, ‘స్టెమ్ గార్డ్’గా పిలిచే నెక్‌గార్డ్‌ను తప్పనిసరి చేయాలని సీఏ తీర్మానించే అవకాశాలు ఉన్నాయి. ఆటగాళ్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని సీఏ ఇది వరకే ప్రకటించింది. ఈ విషయంలో రాజీ ఉండబోదని స్పష్టం చేసింది. ఐసీసీ కూడా సీఏ వాదనను సమర్థించింది. అందుకే, బ్యాట్స్‌మెన్ వాడే హెల్మెట్ల నాణ్యతపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఇప్పుడు స్టెమ్ గార్డ్‌ను సీఏ తప్పనిసరి చేస్తే, ఐసీసీ కూడా అదే పంథాను అనుసరించి, ఆదేశాలు జారీ చేసే అవకాశాలు లేకపోలేదు.

చిత్రం...ఆర్చర్ బౌలింగ్‌లో గాయపడిన స్మిత్