క్రీడాభూమి

విండీస్‌కు అగ్ని పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (ఆంటీగువా), ఆగస్టు 21: టీమిండియాతో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టు వెస్టిండీస్ జట్టుకు అగ్ని పరీక్షగా మారనుంది. ఎక్కువ మంది యువకులున్న ఈ జట్టులో అంతర్జాతీయ క్రికెట్, ప్రత్యేకించి టెస్టు ఫార్మాట్‌లో అనుభవం ఉన్నవారు తక్కువ. అయితే, ఇటీవలే ఇంగ్లాండ్‌తో టెస్టు హోం సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకోవడంతో, ఈ జట్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. జాసన్ హోల్డర్ నాయకత్వంలో, మరోసారి హోం అడ్వాంటేజ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. కానీ, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న టీమిండియాను రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓడించడం విండీస్‌కు సులభసాధ్యం కాదన్నది వాస్తవం.
క్రెగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రేవో, షాయ్ హోప్, కెమర్ రోచ్ వంటి స్టార్లు విండీస్ జట్టులో ఉన్నారు. హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకపోవడంతో, అతని స్థానాన్ని బ్రాత్‌వెయిట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. యువ ఆటగాళ్లు షమరా బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రాస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, షిమ్రన్ హాత్‌మేయర్ వంటి ఆటగాళ్లు విండీస్‌ను బలోపేతం చేస్తున్నారు. అయితే, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో విండీస్ నిలకడలేమితో అల్లాడుతున్నది. ఎవరు, ఎప్పుడు రాణిస్తారో, ఎప్పుడు విఫలమవుతారో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ లోపాన్ని సరిదిద్దుకోకపోతే, టీమిండియాను ఢీకొనడం విండీస్‌కు మరింత కష్టమవుతుంది. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌ని మినహాయిస్తే, విండీస్‌కు అనుకూలంగా ఉన్న అంశాలేవీ కనిపించడం లేదు. ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ను నెగ్గడం కాకతాళీయం కాదని నిరూపించుకోవడానికి హోల్డర్ బృందం శ్రమించక తప్పదు.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇంత వరకూ 96 టెస్టులు జరిగాయి. భారత్ 20 మ్యాచ్‌లు గెలిస్తే, వెస్టిండీస్ 30 విజయాలను నమోదు చేసింది. 46 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. గణాంకాలను పరిశీలిస్తే విండీస్‌దై పైచేయిగా కనిపిస్తున్నప్పటికీ, ఇటీవల కాలంలో జరిగిన మ్యాచ్ ఫలితాలు భారత్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన విండీస్ ఇప్పుడు ఒక అనామక జట్టుగా మారింది. నిలకడలేని ఆటతో అభిమానులను నిరాశపరుస్తున్నది. ఎప్పుడు, ఏ విధంగా ఆడుతుందనేది ఎవరికీ అంతుచిక్కదు. ఈ పరిస్థితుల్లో టీమిండియాను భారత్ ఏ స్థాయిలో ఢీ కొంటుందనేది ఆసక్తిని రేపుతున్నది. కాగితంపై చూస్తే, విండీస్ కంటే భారత్ బలంగా కనిపిస్తున్నది. కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా, లోకేష్ రాహుల్ వంటి మేటి బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నారు. మాయాంక్ అగర్వాల్, తెలుగు తేజం హనుమ విహారీ తదితరులు టెస్టు ఫార్మాట్‌లో తమ బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వికెట్‌కీపింగ్ బాధ్యతలను వృద్ధిమాన్ సాహూకు అప్పచెప్పడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే జరిగితే, యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ బెంచ్‌కి పరిమితమవుతాడు. స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా అతనికి తుది జట్టులో అవకాశం దక్కడం అనుమానంగానే ఉంది. విండీస్ టూర్‌లోనే, టీ-20, వనే్డ ఫార్మాట్స్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన పంత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, సాహాకే కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. సాహా బ్యాట్స్‌మన్‌గా కూడా జట్టుకు ఎన్నో సందర్భాల్లో విశేషమైన సేవలు అందించాడు. బౌలింగ్ విభాగానికి వస్తే, ఇశాంత్ శర్మ వంటి సీనియర్ పేసర్ అండ జట్టుకు ఉంది. జస్పీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఉన్నారు. స్పిన్‌లో సీనియర్ బౌలర్ రవిచంద్ర అశ్విన్ పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా, అన్ని రకాల సర్ఫేస్‌లపై రాణించగల సమర్థుడు. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విండీస్ పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్నర్‌గా మెరుగైన సేవలు అందిస్తున్నాడు. హార్దిక్ పాండ్య అందుబాటులో ఉంటే, రోహిత్ శర్మ, అజింక్య రహానేలో ఒకరికే ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కుతుందని అంటున్నారు. అయితే, ఇటీవల కాలంలో విండీస్ ఆడుతున్న తీరును చూస్తే, అదనంగా మరో బ్యాట్స్‌మన్ అవసరమని కోహ్లీ భావించవచ్చు. అదే జరిగితే రోహిత్, రహానేతోపాటు పాండ్య కూడా తుది జట్టులో ఉంటాడు. జట్టు కూర్పు ఎలావున్నా, అన్ని విభాగాల్లోనూ విండీస్ కంటే భారత్ మెరుగ్గా ఉందనేది వాస్తవం. కోహ్లీ సేనను ఎదుర్కోవడానికి విండీస్ జట్టు ఏఏ వ్యూహాలను అనుసరిస్తుందో, హోం అడ్వాంటేజ్‌ని ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి.
**
ఈ టెస్టును గెలిస్తే, కెప్టెన్‌గా కోహ్లీకి అది 27వ టెస్టు విజయం అవుతుంది. టీమిండియాకు ఎక్కువ విజయాలను సాధించిపెట్టిన జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ సరసన కోహ్లీకి చోటు దక్కుకుంది. ఈ టెస్టులో అతను సెంచరీ సాధిస్తే, కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికీ పాంటింగ్ సరసన స్థానం లభిస్తుంది. కెప్టెన్‌గా పాంటింగ్ 19 శతకాలు సాధించాడు. కోహ్లీ కెప్టెన్‌గా 18 సెంచరీలు చేసి, పాంటింగ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో అతను పాంటింగ్‌ను అధిగమించే అవకాశాలున్నాయ.
**
నార్త్ సౌండ్‌లోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 187, రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. ఆ గణాంకాలను పరిశీలిస్తే, భారత్ బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు తప్పవని స్పష్టమవుతున్నది. కొత్త బంతితో కెమెర్ రోచ్, షానన్ గాబ్రియల్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే ప్రమాదం కనిపిస్తున్నది. కెప్టెన్ జాసన్ హోల్డర్ నిలకడగా బౌల్ చేయగల సమర్థుడిగా పేరు సంపాదించాడు. విండీస్ పేస్ అటాక్‌కు భారత బ్యాట్స్‌మెన్ ఏ విధంగా సమాధానం చెప్తారన్నది ఆసక్తి రేపుతున్నది.

చిత్రం...కోచ్ రవి శాస్ర్తీతో కలిసి నెట్ ప్రాక్టీస్‌కు హాజరైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ