క్రీడాభూమి

‘ఫైనల్’ హీరో ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 28: తొమ్మిదో ఐపిఎల్ తుది ఘట్టానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి దీనిని ఇరు జట్ల మధ్యగాక, ఇరువురు కెప్టెన్ల మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించాల్సి ఉంటుంది. ఇద్దరూ తమతమ జట్లు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించినా వారే. ఇద్దరూ పరుగుల వేటను కొనసాగిస్తున్నా వారే. ఇద్దరూ అసాధ్యంగా కనిపించిన ఫైనల్ బెర్త్‌ను సాధించిపెట్టిన వారే. కోహ్లీ 15 మ్యాచ్‌లు ఆడి, 919 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లోనేగాక, ఐపిఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించాడు. మరో 81 పరుగులు చేస్తే, ఒక ఐపిఎల్ సీజన్‌లో 1,000 పరుగుల మైలురాయిని చేరిన మొదటి బ్యాట్స్‌మన్‌గానూ అతను మరో రికార్డును నెలకొల్పుతాడు. కాగా, 16 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ ఇప్పటి వరకూ 779 పరుగులు చేసి, ఈసారి ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. గతంలో రెండు పర్యాయాలు ఫైనల్ చేరిన జట్టు బెంగళూరు. 2009, 2011 సంవత్సరాల్లో టైటిల్‌కు చేరువైనప్పటికీ రన్నరప్ ట్రోఫీతోనే సరిపుచ్చుకుంది. ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరిన బెంగళూరుకు హోం గ్రౌండ్‌లో మ్యాచ్ జరగడం సానుకూల పరిణామం. అంతేగాక, కెప్టెన్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన సన్‌రైజర్స్ కేవలం సమష్టి కృషి అనే సిద్ధాంతంతోనే ముందుకు దూసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ నిలకడగా రాణించడంపైనే దృష్టిని కేంద్రీకరించడంతో విజయాలు సాధ్యమయ్యాయి. అదే ఫలితాన్ని పునరావృతం చేయగలుగుతుందా అన్నది ఉత్కంఠ రేపుతున్నది. బెంగళూరు సామర్థ్యాన్నిగానీ, పట్టుదలనుగానీ తక్కువ అంచనా వేయకూడదని ఇప్పటికే సన్‌రైజర్స్ గుర్తించి ఉండవచ్చు. ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఒకానొక దశలో ఆడిన ప్రతి మ్యాచ్‌నీ గెల్చుకోవాల్సిన స్థితిని ఎదుర్కొన్నప్పటికీ బెంగళూరు ఒత్తిడికి లోనుకాలేదు. గుజరాత్ లయన్స్‌ను 144 పరుగులు, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను తొమ్మిది వికెట్లు, వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా డక్‌వర్త్ లూయిస్ విధానం ద్వారా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను 82 పరుగులు, చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడించిన బెంగళూరు ప్లే ఆఫ్‌కు అర్హత సంపాదించింది. మొదటి క్వాలిఫయర్‌లో గుజరాత్ లయన్స్‌పై విజయభేరి మోగించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, 2013లో అత్యుత్తమంగా ప్లే ఆఫ్ వరకూ చేరిన సన్‌రైజర్స్ మొట్టమొదటిసారి ఫైనల్‌లో స్థానం సంపాదించింది. బెంగళూరులో ఆ జట్టును ఎదుర్కోవడం అనుకున్నంత సులభం కాదన్నది వార్నర్ బృందానికి తెలియంది కాదు. అందుకే, కోహ్లీ సేనను ఎదుర్కోవడానికి అన్ని విధాలా సన్నద్ధమైంది. వార్నర్‌తోపాటు శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, మోజెస్ హెన్రిక్స్, బరీందర్ శరణ్, ముస్త్ఫాజుర్ రహ్మాన్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో చాలా మందికి స్టార్ ఇమేజ్ లేకపోయినా, పరిస్థితులకు తగ్గట్టు, నిలకడగా ఆడడం వచ్చు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, వ్యూహాత్మకంగా సాగడం తెలుసు. అందుకే మేటి జట్లను కూడా సన్‌రైజర్స్ ఓడించగలిగింది.
కాగితంపై చూస్తే కోహ్లీ, క్రిస్ గేల్, డివిలియర్స్, షేన్ వాట్సన్, లోకేష్ రాహుల్, వరుణ్ ఆరోన్, క్రిస్ జోర్డాన్ వంటి హేమాహేమీలతో బెంగళూరు పటిష్టంగా ఉంది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. అయితే, సమష్టిగా రాణిస్తున్న సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏదిఏమైనా, ఆదివారం ఐపిఎల్ ఫైనల్‌లో బెంగళూరు, సన్‌రైజర్స్ తలపడుతున్నప్పటికీ, కోహ్లీ, వార్నర్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగనుంది. అందుకే అందరి దృష్టి ఇరు జట్ల కెప్టెన్లపై కేంద్రీకృతమైంది. ఎవరు తమ జట్టును గెలిపిస్తారో, ఎవరు విఫలమవుతారో చూడాలి.
ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలు.

chitram
* సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్
కెప్టెన్ డేవిడ్ వార్నర్

* అసాధారణ ఫామ్‌లో ఉన్న
రాయర్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ హీరో విరాట్ కోహ్లీ