క్రీడాభూమి

రాన్డన్ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలడేల్ఫియా, జూన్ 10: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో జోస్ సాలమన్ రాన్డన్ చేసిన గోల్‌తో వెనెజులా క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగా ఉరుగ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అత్యంత కీలకంగా మారిన మ్యాచ్‌లో వెనెజులాను ఢీకొన్న ఉరుగ్వే 0-1 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. రాన్డన్ చేసిన గోల్‌తో విజయం సాధించిన వెనెజులా ముందంజ వేయగా, గతంలో 15 పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఉరుగ్వే అనూహ్యంగా క్వార్టర్స్ కూడా చేరకుండానే వెనుదిరిగింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఇరు జట్ల మితిమీరిన డిఫెన్స్ విధానం కొనసాగింది. 36వ నిమిషంలో ఉరుగ్వే రక్షణ వలయాన్ని ఛేదించిన రాన్డన్ గోల్ చేయడాన్ని మినహాయిస్తే, ఈ మ్యాచ్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. వెనెజులా గోల్ చేసిన తర్వాత ఈక్వెలైజర్ కోసం ఉరుగ్వే కొంత సేపు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కీలక మ్యాచ్‌ని చేజార్చుకొని టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్వార్టర్స్‌కు మెక్సికో
ఉరుగ్వేతోపాటు మెక్సికో జట్టు కూడా క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈ జట్టు జమైకాను 2-0 తేడాతో ఓడించింది. మ్యాచ్ 18వ నిమిషంలో జేవియర్ హెర్నాండెజ్ చేసిన గోల్‌తో మెక్సికో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆతర్వాత నింపాదిగా ఆడుతూ, బంతిని తన ఆధీనంలో ఉంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. దీనితో ఈక్వెలైజర్ కోసం జమైకా చేసిన పోరాటం విఫలమైంది. ద్వితీయార్ధం చివరి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. 81వ నిమిషంలో ఆరిబి పెరాల్టా చేసిన గోల్‌తో మెక్సికో ఆధిక్యం 2-0కు దూసుకెళ్లింది. ఇంజురీ టైమ్‌లోనూ జమైకా గోల్ చేయలేకపోయింది. ఇదే తేడాతో విజయాన్ని నమోదు చేసిన మెక్సికో క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించింది.

ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్
టైటిల్ దిశగా సైనా, శ్రీకాంత్
సిడ్నీ, జూన్ 10: భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశారు. ఈ ఇద్దరు హైదరాబాదీలు తమతమ విభాగాల్లో సెమీస్ చేరి, అభిమానుల్లో ఆశలు పెంచారు. మహిళల సింగిల్స్‌లో సైనా 28-26, 21-16 తేడాతో 2013 ప్రపంచ చాంపియన్ రచానొక్ ఇంతనాన్‌ను ఓడించింది. 56 నిమిషాలు సాగిన ఈ పోరాటంలో అతి కష్టం మీద నెగ్గిన సైనా ఫైనల్‌లో స్థానం కోసం ఆమె వాంగ్ ఇహాన్‌తో తలపడుతుది. నాలుగో సీడ్ ఇహాన్ క్వార్టర్ ఫైనల్‌లో ఎనిమిదో సీడ్ తాయ్ జూ ఇంగ్‌ను 21-19, 21-15 స్కోరుతో ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. కాగా, పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21-18, 21-17 ఆధిక్యంతో దక్షిణ కొరియాకు చెందిన హీ హియోపై గెలిచి సెమీస్ చేరాడు. తర్వాతి మ్యాచ్‌లో అతను హన్స్ క్రిస్టియాన్ విటింగస్‌తో పోరాడతాడు. మరో క్వార్టర్స్‌లో విటింగస్ 21-14, 21-18 తేడాతో షవొ ససాకీని ఓడించాడు.

న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో
ఎన్‌ఆర్‌ఐ రావల్
వెల్లింగ్టన్, జూన్ 10: జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో రెండేసి టెస్టులు ఆడేందుకు ఎంపిక చేసిన న్యూజిలాండ్ జట్టులో అక్కడే స్థిరపడిన భారతీయుడు జీత్ అశోక్ రావల్ ఎంపికయ్యాడు. 27 ఏళ్ల రావల్ గతంలో భారత జూనియర్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2004లో అతని కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడింది. అక్కడే దేశవాళీ పోటీల్లో రాణించిన రావల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సగటున 43.85 పరుగులు సాధించాడు. అక్లాండ్ ఏసెస్ తరఫున ఒటాగో తరఫున అజేయంగా 202 పరుగులు చేసి, సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, టామ్ లాథమ్ వైఫల్యాల బాటలో సాగుతున్న కారణంగా, ప్రత్యామ్నాయంగా మరో ఓపెనర్ ఉండాలని భావించిన సెలక్టర్లు రావల్‌కు అవకాశం ఇచ్చారు. కాగా, జింబాబ్వేకు వెళ్లనున్న న్యూజిలాండ్ అక్కడ రెండు టెస్టులు ఆడుతుంది. మొదటి టెస్టు జూలై 29న, రెండో టెస్టు ఆగస్టు 6న హరారేలో మొదలవుతాయి. అనంతరం దక్షిణాఫ్రికాకు కివీస్ జట్టు వెళుతుంది. అక్కడ దర్బన్‌లో ఆగస్టు 19 నుంచి, సెంచురియన్‌లో ఆగస్టు 27 నుంచి ఆరంభమయ్యే టెస్టుల్లో ఆడుతుంది. రావల్‌ను మినహాయిస్తే జట్టులోని ఆటగాళ్లంతా గతంలో టెస్టులు ఆడినవారే.

రియోపై వికాస్ ఆశలు
నేటి నుంచి ప్రో బాక్సింగ్
న్యూఢిల్లీ, జూన్ 10: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) ఆధ్వర్యంలో ప్రో బాక్సింగ్ ఈవెంట్ న్యూఢిల్లీలో శనివారం ఆరంభం కానుంది. ఈ పోటీల్లో రాణించడం ద్వారా రియో ఒలింపిక్స్‌లో అర్హత సంపాదించాలని ప్రపంచ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత వికాస్ కృషన్ ఆశపడుతున్నాడు. 75 కిలోల విభాగంలో పోటీపడుతున్న అతను తొలి రౌండ్‌లో కెన్యా బాక్సర్ నిక్సన్ అబకాను ఢీ కొంటాడు. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈవెంట్‌లో తాను అనుకున్న స్థాయిలో రాణించలేకపోయానని, ఈసారి అలాంటి పొరపాట్లు చేయకుండా టైటిల్ సాధిస్తానని వికాస్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఈవెంట్‌లో పాల్గొంటే గాయపడే ప్రమాదం ఉందని కొంత మంది చేస్తున్న వాదనను అతను తోసిపుచ్చాడు. శిక్షణా శిబిరంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా గాయపడే అవకాశాలు ఉండవా అని ప్రశ్నించాడు. ఏమరుపాటుగా ఉంటే ఈ ప్రమాదం ఎప్పుడైనా తప్పదని వ్యాఖ్యానించాడు. రియోకు అర్హత సంపాదించడానికి దీనిని సరైన వేదికగా అభివర్ణించాడు.