క్రీడాభూమి

క్రికెట్ కోచ్‌గా కుంబ్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, జూన్ 23: టీమిండియా కోచ్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లేను కోచ్‌గా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నియమించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కుంబ్లేకు ఎంతో అనుభవం ఉందని, అందుకే అతనిని ఎంపిక చేశామని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపాడు. బోర్డు పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. అతను ఏడాది పాటు ఈ పదవిలో ఉంటాడని చెప్పాడు. సర్వత్రా ఉత్కంఠ రేపిన కోచ్ ఎంపిక సుమారు ఏడాది కాలంగా నానుతునే ఉంది. ఇటీవలే కోచ్‌తోపాటు సపోర్టింగ్ స్ట్ఫా కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా బిసిసిఐ విడుదల చేసిన ప్రకటనకు భారీ స్పందన లభించింది. ప్రత్యేకించి కోచ్ పదవికి రవి శాస్ర్తీ, టామ్ మూడీ, స్టువర్ట్ లా, సందీప్ పాటిల్ వంటి ఎంతో మంది హేమాహేమీలు ఆరంభంలోనే దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కుంబ్లే చివరి నిమిషంలో రేసుకు సిద్ధమయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా అతను విసిరిన గుగ్లీ పోటీదారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. రవి శాస్ర్తీ, సందీప్ పాటిల్ తదితరులు భారత కోచ్ పదవికి అంతకు ముందు దరఖాస్తు చేసుకుంటే, కుంబ్లే చివరి క్షణాల్లో రేసులోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి అనుబంధంగా పని చేస్తున్న క్రికెట్ కమిటీకి చీఫ్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే టీమిండియా చీఫ్ కోచ్ పదవికి పోటీ పడతాడని ఎవరూ ఊహించలేదు. హఠాత్తుగా తెరపైకి వచ్చిన అతను అంతే సంచలనం సృష్టిస్తూ కోచ్ పదవిని దక్కించుకున్నాడు. కాగా, రవి శాస్ర్తిని బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉంది. లేకపోతే అతనిని జట్టుకు డైరెక్టర్‌గా కొనసాగించవచ్చు. త్వరలోనే ఈ విషయంలో బిసిసిఐ ఒక నిర్ణయం తీసుకుంటుంది.
పారదర్శకంగా ఎంపిక
టీమిండియా కోచ్ ఎంపిక పారదర్శకంగా జరిగిందని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ఎంపిక చేసిన పలువురిని సిఎసి ఇంటర్వ్యూ చేసిందని పాలక మండలి సమావేశం అనంతంరం విలేఖరులతో మాట్లాడుతూ ఠాకూర్ తెలిపాడు. అన్ని కోణాల్లోనూ పరిశీలించి, చర్చించి, చివరికి కోచ్ పదవికి కుంబ్లేను ఎంపిక చేశామని చెప్పాడు. కోచ్ విదేశీయుడా లేక స్వదేశీయుడా అన్నది ప్రధానం కాదని, ఆ పదవి కోసం కొన్ని ప్రత్యేక అర్హతలను ఖరారు చేశామని ఠాకూర్ అన్నాడు. దాని ప్రకారమే జాబితాను కుదించడం, ఇంటర్వ్యూలు నిర్వహిచడం, తుది జాబితాను సిఎసి సమర్పించడం జరిగాయని వివరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది కాబట్టే కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేశామని పేర్కొన్నాడు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కిన కుంబ్లే ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు కూల్చిన బౌలర్‌గా లీనేకర్ రికార్డును సమం చేశాడు. కెరీర్‌లో 132 టెస్టులు, 271 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 2,506 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 100 (నాటౌట్). వనే్డల్లో 938 పరుగులు చేసిన అతని అత్యధిక స్కోరు 26 పరుగులు. టెస్టు ఫార్మెట్‌లో అతను 40,850 బంతులు వేశాడు. ప్రపంచ టెస్టు చరిత్రలో ముత్తయ్య మురళీధరన్ (44,039) తర్వాత అత్యధిక బంతులు వేసిన బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. 619 వికెట్లు పడగొట్టిన అతని ఉత్తమ బౌలింగ్ విశే్లషణ 74 పరుగులకు పది వికెట్లు. వనే్డల్లో 337 వికెట్లు సాధించిన కుంబ్లే అత్యుత్తమంగా 12 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చాడు.
**
వడపోత
ధర్మశాల: కోచ్ పదవికి మొత్తం 57 మంది దరఖాస్తు చేసుకోగా, బిసిసిఐ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) నిజమైన పోటీదారులుగా 21 మందిని గుర్తించింది. సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ జాబితాను సగానికి సగం కుదించడంతో కోచ్ ఎంపికలో కొంత వెసులుబాటు లభించింది. ఈ 21 మంది ప్రొఫైల్స్‌ను కూడా పరిశీలించి, వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత పది మందికి సిఎసి మంగళవారం కోల్‌కతాలో ఇంటర్వ్యూలను నిర్వహించింది. జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్‌కు ఆహ్వానం అందకపోవడం విశేషం. రవి శాస్ర్తీ, అనీల్ కుంబ్లే పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసిన తర్వాత సిఎసి సమర్పించిన నివేదిక ఆధారంగా అనీల్ కుంబ్లే పేరును ధర్మశాలలో సమావేశమైన బిసిసిఐ పాలక మండలి ఆమోదించింది.

చిత్రం అనీల్ కుంబ్లే