స్పాట్ లైట్

యునెస్కోకు పొగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్రను పరిరక్షించాల్సిన యునెస్కో దానిని వక్రీకరిస్తోందా? యునెస్కోలో సంస్కరణలు అవసరమా? వెస్ట్ బ్యాంకులోని హెబ్రాన్ నగరాన్ని పాలస్తీనా దేశంలోని సాంస్కృతిక వారసత్వ సంస్థగా ప్రకటించి యునెస్కో ఇజ్రాయిల్ ఆగ్రహానికి గురైంది. ఇజ్రాయిల్ మీద ఈగ వాలితే దుడ్డువాలిన చందంగా అమెరికా విలవిలలాడుతుంది. దాంతో అమెరికా కూడా ఆగ్రహం చెందింది.
ఐక్య రాజ్య సమితి విద్యా శాస్తవ్రిజ్ఞాన సాంస్కృతిక సంస్థ- యునెస్కో మరోసారి ఇరకాటంలో పడింది. కొత్త డైరెక్టర్ జనరల్ ఓటింగ్ సమయంలో యునెస్కో నుండి వైదొలుగుతున్నట్టు అమెరికా ప్రకటించి కొత్త ఉద్రిక్తతకు తెరతీసింది. ప్రపంచంలో తమదే అసలైన సంపూర్ణ ప్రజాస్వామ్య దేశమని పదే పదే చెప్పుకునే అగ్రరాజ్యం అంతర్జాతీయంగా మాత్రం అత్యంత అప్రజాస్వామికంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచ ప్రయోజనాలను పక్కన పెట్టి, ఇరుగుపొరుగుదేశాలు, మిత్రదేశాలు ఏమైపోయినా తన ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టు అమెరికా వ్యవహరించింది. పాలస్తీనాను ఐక్య రాజ్యసమితి దాని అనుబంధ సంస్థలు ప్రత్యేక దేశంగా గుర్తించడం అమెరికాకు సుతారం ఇష్టం లేదు. అలాంటిది పాలస్తీనా అథారిటీకి 2011లోనే యునెస్కో సభ్యత్వం ఇచ్చింది. ఆ చర్య అమెరికాకు , ఇజ్రాయిల్‌కు మింగుడు పడలేదు, అప్పటి నుండి ఏదో సాకులు చెబుతూ యునెస్కోకు ఇవ్వాల్సిన నిధులను ఆపేసింది. యునెస్కో పట్ల ఇంతకాలం పెద్దన్న పాత్ర పోషించిన అమెరికా తమకు నమ్మిన బంటైన ఇజ్రాయిల్ వంటి దేశాల కోసం మొండిగా ముందుకు వెళ్లడం కొత్త కాదు. ఆగ్రహించిన అమెరికా యునెస్కో నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించి అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యంలో పడేసింది. ఈ నిర్ణయం 2018 డిసెంబర్ 31 నుండి అమలులోకి రానుంది. అయితే శాశ్వత పరిశీలకుడి హోదాలో మాత్రం కొనసాగుతామని అమెరికా తెలిపింది. యునెస్కో ఆషామాషీ సంస్థ కాదు, రెండో ప్రపంచ యుద్ధానంతరం 1946 నవంబర్ 16న ఆవిర్భవించిన ఈ సంస్థ ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేస్తోంది. ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రిగా పనిచేసిన ఆద్రే అజౌల్ డైరెక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు.
యునెస్కో ఐక్య రాజ్య సమితికి చెందిన ఒక ప్రధాన అంగం. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలు, పరిరక్షణ, అంతర్జాతీయ శాంతికి తన వంతు దోహదపడటం, విద్య, శాస్త్ర, సాంకేతిక కార్యకలాపాలు ద్వారా దారిద్య్ర నిర్మూలనకు కృషి చేయడం లక్ష్యంగా యునెస్కో పనిచేస్తోంది. నానాజాతి సమితి వారసత్వాన్ని కొనసాగిస్తున్న యునెస్కోలో 195 దేశాలకు సభ్యత్వం ఉంది. మరో 10 దేశాలు అనుబంధంగా పనిచేస్తున్నాయి. 170 దేశాలకు చెందిన 3వేల మంది సిబ్బంది యునెస్కోలో పనిచేస్తున్నారు.
యునెస్కోలో మూడు ప్రధాన అంగాలున్నాయి. తమ విధివిధాన నిర్మాణం కోసం అధికార చలామణి కోసం, దైనందిన కార్యక్రమాలకు ఇవి కేంద్రంగా ఉంటాయి. సాధారణ సభ, కార్యనిర్వాహక సభ, మంత్రాలయం. సాధరణ సభలో సమావేశాలు రెండేళ్లకోమారు జరుగుతాయి. కార్యనిర్వాహక బోర్డు నాలుగేళ్లకోసారి ఎన్నికవుతుంది. ఇక మంత్రాలయం దైనందిన కార్యక్రమాలతో పాటు పరిపాలనా బాధ్యతలు నెరవేరుస్తుంది. దీనికి డైరెక్టర్ జనరల్ ఉంటారు. యునెస్కో ప్రస్తుతం ఐదు రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక - మానవ శాస్త్రాలు, కమ్యూనికేషన్లు, సమాచార వ్యవస్థలు. విద్య ద్వారా యునెస్కో అంతర్జాతీయ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ దీని ప్రధాన ఉద్ధేశ్యం. వివిధ దేశాల్లో విద్యా విధానాలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చిలను చేపట్టడం దీని ఉద్ధేశ్యం. ఇంటర్నేషనల్ నెట్ వర్కు ఆఫ్ జియో పార్క్సు, బయోస్పియర్ రిజర్వు, సిటీ ఆఫ్ లిటరేచర్, అపాయంలో పడ్డ భాషలు, మాస్టర్ పీసెస్ ఆఫ్ ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్, మెమోరి ఆఫ్ ద వరల్డ్, వారసత్వ ప్రదేశాలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భావవ్యక్తీకరణ స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడం, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, మీడియా ద్వారా సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి రాజకీయ సిద్ధాంతాలను తయారుచేయడం ఇలా అనేక కార్యక్రమాలు యునెస్కో ద్వారా జరుగుతున్నాయి.
ఈనాటిది కాదు
యునెస్కోపై అమెరికా ఆగ్రహం ఈనాటిది కాదు, 2011లోనే ఇందుకు పునాది పడింది. యునెస్కోలో పాలస్తీనాను చేర్చుకోవడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. 173 దేశాలు మద్దతు ఇస్తున్నా అమెరికాకు మాత్రం మింగుడుపడలేదు. పశ్చిమాసియాలో పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. తన అనుంగు మిత్రుడైన ఇజ్రాయిల్‌కు మద్దతుగా నిలిచినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహంగానే ఉంది. పాలస్తీనా హెబ్రాన్ నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపద నగరంగా గుర్తించడంతో అమెరికా పుండుమీద కారం చల్లినట్టయింది. అప్పటి నుండి యునెస్కో కార్యక్రమాల్లో అన్యమనస్కంగానే పాల్గొంటోంది.
ద్వంద్వ వైఖరి
యునెస్కో నుండి వైదొలగడం , మళ్లీ చేరడం అమెరికాకు కొత్త కాదు. 1984లో రోనాల్డ్ రీగన్ హయాంలో ఒకసారి వైదొలగింది. అప్పట్లో సోవియట్ యూనియన్ (నేటి రష్యా) , అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న సమయంలో యునెస్కో సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపుతుందనే సాకుతో అమెరికా దూరం జరిగింది.
సంస్కరణలు
యునెస్కోలో భారీ సంస్కరణలు జరగాలని అమెరికా చాలా కాలంగా వాదిస్తోంది. మరో పక్క ఐక్య రాజ్య సమితి భద్రతామండలి వంటి సంస్థల్లో సంస్కరణలు జరగాల్సిందేనని మిగిలిన దేశాలు పట్టుబడుతున్నాయి.

బి వి ప్రసాద్