స్పాట్ లైట్

నిన్న కయ్యం.. నేడు వియ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్ పట్ల అమెరికా వైఖరి మారుతోందా? అమెరికా, కెనడా జంటను విడిపించినందుకు కృతజ్ఞతగా ఏకంగా ట్రంప్ పాక్‌ను అక్కున చేర్చుకోబోతున్నారా? హక్కానీ నెట్‌వర్క్‌ను అంతం చేయడానికి సహకరిస్తామన్న పాక్ ఆఫర్‌తో కరిగిపోయిన ట్రంప్, మరింతగా ఆ దేశంతో వియ్యానికి ఒడిగట్టే అవకాశం కనిపిస్తోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం కలిగిన పాక్- అమెరికా అడుగులకు మడుగులొత్తడం వెనుక కూడా స్వయ ప్రయోజనం ఉంది. అమెరికా సాయపడనిదే పాకిస్తాన్ ఆర్థికంగా గట్టెక్కే అవకాశం లేదు. మళ్లీ ఈ రకమైన చేరదీత మొదలైతే దానిపై భారత్ స్పందన ఎలా ఉంటుంది? పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల అమెరికాపై ఒత్తిడి తెచ్చే విషయంలో మోదీ సర్కార్ ఏ రకంగా ముందడుగు వేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

అమెరికా, పాకిస్తాన్‌ల మధ్య వైరం స్థానే స్నేహం బలపడుతోందా? 9/11 నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్, అల్‌ఖైదా మిలిటెంట్లను ఏరివేసేందుకు సాయపడ్డ పాకిస్తాన్ పట్ల అనంతర కాలంలో కనె్నర్రజేసిన అమెరికా తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ అక్కున చేర్చుకోబోతోందా? అమెరికా ఏ దేశంతో స్నేహ సంబంధాలను పెంపొందించుకున్నా, వైరాన్ని కొని తెచ్చుకున్నా అది పూర్తిగా దాని స్వీయ ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటుంది. తమకు లాభం చేకూరినంత వరకు ఆయా దేశాలను ఆదుకునే అమెరికా ఎప్పుడైతే పరిస్థితి బెడిసికొడుతుందో వాటిపైనే కనె్నర్ర జేస్తుంది. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్‌పై అడపాదడపా నిప్పులు చెరుగుతూ వచ్చిన ట్రంప్ ప్రభుత్వం హక్కానీ మిలిటెంట్ నెట్‌వర్క్‌ను తొలగించే విషయంలో సాయపడేందుకు పాక్ ముందుకు రావడంతో శాంతించడం తాజా సామరస్యానికి సాంకేతమే. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి పాకిస్తాన్ పట్ల వత్తిడి పెరుగుతుందని, కాశ్మీర్‌లోకి ఉగ్రవాద మూకల్ని పంపడం ఆగుతుందని భావించిన భారత్‌కు ఈ తాజా పరిస్థితి మింగుడుపడడం లేదు. అమెరికా, కెనడాకు చెందిన ఓ జంటను హక్కానీ దిగ్బంధం నుంచి విడిపించడంలో సాయపడిన పాకిస్తాన్ పట్ల ట్రంప్ మెతకవైఖరి అవలంబిస్తున్నట్టుగా తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది. ఒకపక్క అమెరికానుంచి నిధులు ఆగిపోవడం, దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో ఇప్పుడు అమెరికా డిమాండ్లకు తలవంచక తప్పని పరిస్థితి పాకిస్తాన్‌కు ఏర్పడింది. ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అమెరికా పర్యటన వెనుక అసలు లక్ష్యం కూడా అగ్ర రాజ్యాధినేత అండదండలను చూరగొనాలన్నదే. అమెరికా ప్రయోజనాలను పరిరక్షించేందుకు హక్కానీ నెట్‌వర్క్ నుంచి బందీగా ఉన్న జంటను విడిపించేందుకు సాయపడతామని పాక్ హామీ ఇవ్వడంతో ట్రంప్ సర్కార్ వైఖరి మారింది. నిన్న మొన్నటివరకు పాక్‌ను తూర్పారబట్టిన ఆయన ఇప్పుడు మరో రకంగా మాట్లాడడం భారత్‌కు విస్మయాన్ని కలిగించే పరిణామమే. ఈ జంటను హక్కానీ నెట్‌వర్క్ నుంచి విడిపించి తీరాల్సిందేనని పాక్ విదేశాంగ మంత్రిపై అమెరికా ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేయడంతో ఐదేళ్ల క్రితం కిడ్నాపైన అమెరికన్ కైట్లాన్ కోల్‌మాన్, కెనడియన్ జోషువా బోలెలు విడుదలయ్యారు. ఈ జంటను విడిపించకపోతో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందన్న కారణంగా తీవ్రస్థాయిలోనే చర్యలు తీసుకుంటామని పాక్ విదేశాంగ మంత్రిని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించిన ఫలితంగానే ఈ బందీలకు విముక్తి లభించింది. తమ డిమాండ్ ఏమాత్రం విస్మరించినా సాయం ఆపేస్తామని, మళ్లీ ద్రోన్ దాడులు మొదలుపెడతామని, అన్నింటికీ మించి ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్‌ను ప్రకటిస్తామని కూడా ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆ హెచ్చరికలకు బెంబేలెత్తిన పాక్ విదేశాంగ మంత్రి స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే హక్కానీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి అమెరికాతో కలిసి సంయుక్త దాడులు జరుపుతామని ప్రకటించడం రెండు దేశాల మధ్య మారిన పరిస్థితికి నిదర్శనమే. నిజానికి ఈ రకమైన అమెరికా హెచ్చరికలు ఎన్నింటినో గతంలోనే పాకిస్తాన్ చవిచూసింది. తన దారి తనదే అన్నట్టుగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అన్ని విధాలుగా అణగారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే అమెరికా సాయం అవసరం. అందుకే ట్రంప్ హెచ్చరికలకు తలవంచింది. హక్కానీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తామని ప్రకటిస్తే ట్రంప్ నుంచి మరింత సాయం పొందవచ్చునని భావించింది. ఎప్పుడైతే పరిస్థితి తనకు అనుకూలంగా మారిందో బందీలుగా ఉన్న మరింత మంది అమెరికన్లను విడిపించేందుకు పాక్ చేయూతను ఇవ్వవచ్చు. ఆ విధంగా అమెరికా మన్ననలు పొందేందుకు ప్రయత్నించనూవచ్చు. ఇలా చేయడం వల్ల భారత్‌కు వ్యతిరేకంగా తాము ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామన్న ఆగ్రహాన్నుంచి అమెరికాను తప్పించే అవకాశం ఉంటుందని పాకిస్తాన్ భావించనూవచ్చు. ఇవన్నీ కూడా రానున్న కాలంలో పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరిలో సానుకూల మార్పు తెచ్చే అవకాశం ఉందన్న భావన భారత్‌లో కలగడానికి దారితీస్తున్నాయి. ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయో ట్రంప్ కూడా ఈ పరిణామాన్ని గుణాత్మకమైనదిగా అభివర్ణించడం విడ్డూరమే. ఒత్తిళ్లకు లొంగైనా సరే పాకిస్తాన్ తమ డిమాండ్లను అంగీకరించడం పట్ల ట్రంప్ సానుకూలంగానే స్పందించారు.
అవసరానుగుణంగా అమెరికా నుంచి సాయాన్ని పొందేందుకు పాకిస్తాన్ వేయని ఎత్తుండదు. గతంలో కూడా ముషారఫ్ హయాంలో తాలిబన్లను, అల్‌ఖైదాను అంతం చేసేందుకు సాయపడుతున్నామన్న నెపంతో వేలాది డాలర్లను అమెరికా నుంచి పొందింది. కానీ వాటిని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అంతం చేయడానికి కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా మిలిటెన్సీని పెంపొందించడానికే ప్రయత్నించిందన్న కథనాలూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనే పాక్‌కు అమెరికా సాయం ఆగింది. మళ్లీ ఇప్పుడు పరిస్థితి ప్రతికూలించింది కాబట్టి, అమెరికా సాయం పొందక తప్పదు కాబట్టి పాకిస్తాన్ మళ్లీ అగ్రరాజ్యానికి తలవంచింది. ఈ పరిస్థితి భారత్‌కు ఏ రకమైన సంకేతాలు అందిస్తోంది? వాటిని ఎదుర్కోవడంతోపాటు అమెరికాతోపాటు తన సంబంధాలను పరిరక్షించుకోవడానికి భారత నాయకత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందన్నది ఇప్పుడు అత్యంత కీలకం. పాక్ విషయంలో అమెరికా సానుకూలత పట్ల దేశంలో రాజకీయ వ్యంగ్యోక్తులు మొదలయ్యాయి. ‘ట్రంప్‌ను మోదీ మరోసారి ఆలింగనం చేసుకోవాలేమో..’ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. మొత్తం మీద పాక్ విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరి భారత్‌కు ఏమాత్రం ప్రయోజనాన్ని కలిగించేది కాదన్న విస్మరించడానికి వీల్లేదు.

బి.రాజేశ్వర ప్రసాద్