స్పాట్ లైట్

షింజో కింకర్తవ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ అనుకున్నట్లుగానే జపాన్ ప్రధాని షింజో అబే తిరుగులేని విజయాన్ని సాధించారు. ఇటు ఉత్తర కొరియా నుంచి, అటు చైనానుంచి ఎడతెగని రీతిలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్ల విషయంలో ఆయన తీసుకోబోయే తదుపరి చర్య ఏమిటన్నది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప సమకాలీన భద్రతాపరమైన సవాళ్లను జపాన్ పటుత్వంతో ఎదుర్కొనే పరిస్థితి లేదన్న వాదన నేపథ్యంలో షింజో అబే వేయబోయే అడుగు ఎలా ఉంటుందన్నది ఉత్కంఠను రేకెత్తించేదే. ఇప్పటివరకు కూడా రాజ్యాంగంలోని తొమ్మిదవ అధికరణ సవరణ విషయంలో దేశ రాజకీయ నాయకత్వంలో సైద్ధాంతిక విభేదాలు తీవ్ర స్థాయిలో వ్యక్తీకృతం కావడం వల్ల దీని జోలికి ఎవరూ వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ప్రపంచం మారిందని, దానికి అనుగుణంగానే జపాన్ కూడా మారాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ తొమ్మిదో ఆర్టికల్ విషయంలో నెలకొన్న సందిగ్ధతను తొలగించి తాజా సవాళ్లకు దీటుగా జపాన్‌ను కార్యోన్ముఖం చేయడానికి షింజో అబే తీసుకోనున్న చర్యలు ఏమిటన్నది ఒక జపాన్‌నే కాదు, ఎడతెగని సవాళ్లు విసురుతున్న ఉత్తర కొరియా, చైనాను, అలాగే ఇతర కీలక ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఎందుకంటే ఆర్టికల్ -9 అన్నది జపాన్‌కు సంబంధించినంతవరకు అత్యంత వౌలికమైన, కీలకమైన అంశం. కాలం చెల్లిన ఈ అధికరణను ఇంకా కొనసాగించడమన్నది ఎంతమాత్రం సరైనది కాదన్న వాదన కూడా ఇటీవల పదునెక్కింది. జపాన్ వర్తమాన ప్రపంచానికి దీటుగా ముందుకు వెళ్లాలంటే సవాళ్లను ధాటిగా ఎదుర్కోవాలంటే ఈ అధికరణను సవరించడం ఒక్కటే మార్గమన్న వాదనకే షింజో అబే మొగ్గు చూపుతారా అన్నది వేచిచూడాల్సిందే. ఓపక్క చైనా విస్తరణవాదం, మరోపక్క ఉత్తర కొరియా అణు కవ్వింపుల నేపథ్యంలో జపాన్ ఏమాత్రం తన సన్నద్ధత విషయంలో తటపటాయించినా అది అనేక రకాలుగా విపరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. మరోపక్క గతంలో మాదిరిగా జపాన్‌కు అన్నివిధాలుగా తిరుగులేని వత్తాసు పలికే విషయంలో అలాగే ప్రాంతీయ భద్రతా పరిస్థితుల పరిరక్షణకు సంబంధించి కూడా ట్రంప్ సారథ్యంలోని అమెరికా గతంలో కనబరచిన ఉత్సాహాన్ని వ్యక్తం చేయడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే జపాన్ సర్వసన్నద్ధతను సంతరించుకోకపోతే పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదం ఉంటుంది. ఒకప్పుడు అమెరికా సారథ్యంలో ప్రాంతీయ భద్రతకు సంబంధించి తిరుగులేని ధీమా ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కాస్తా ఆవిరైపోయే పరిస్థితి తలెత్తడంతో జపాన్ స్వయంగా ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుత భద్రతా పరిస్థితులు యథాతథంగా కొనసాగాలన్నా వాటిని మరింత సురక్షితం చేయాలన్నా జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించక తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. జపాన్ సైనికీకరణ విషయంలో ఒకప్పుడు ఆగ్నేయాసియా దేశాలకు, ఆస్ట్రేలియాకు ఎడతెగని ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సవాళ్లు పెను సవాళ్లుగా మారడంతో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్నివిధాలుగా భద్రతను పటిష్టం చేసుకోక తప్పని పరిస్థితి జపాన్‌కు ఏర్పడింది. పైగా భద్రత విషయంలో ఇతర దేశాలకు అన్నివిధాలుగా సాయపడే ఒపిక, తీరిక అంతర్గత సమస్యలతో తల్లడిల్లుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంకెంతమాత్రం లేదు. అంటే ఎవరి భద్రతా అవసరాలు వారే తీర్చుకోవాలన్న పరోక్ష సంకేతాన్ని జపాన్ వంటి దేశాలకు ఇప్పటికే అమెరికా అందించింది.
తాజా ఎన్నికల్లో మెజారిటీ సాధించిన షింజో అబేకు దిగువ సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం, ఆమోదింపజేసుకోవడం అన్నది సునాయాసమే అయినప్పటికీ ఆర్థికంగా విస్తృత స్థాయి మార్పులు జరిగే అవకాశం లేదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.