స్పాట్ లైట్

సిరియా శాంతికి పుతిన్ పాచిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దాలుగా ఎనలేని సంక్షోభానికి కారణమవుతున్న సిరియా అంతర్యుద్ధ పరిస్థితులకు అడ్డుకట్ట వేసే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రియాశీలకంగా ముందుకు సాగుతున్నారు. సిరియా వ్యవహారంలో అమెరికా, రష్యాలది భిన్న ధోరణి కావడంతో ఈ సమస్యకు ఏ రకంగా పరిష్కారం అందించాలన్నది అంతుబట్టని పెద్ద సమస్యగానే మారుతూ వచ్చింది. మొదట్లో సిరియా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతికూలంగా వ్యవహరించినప్పటికీ దీంతో తమకు సంబంధం లేదన్నట్లుగా వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందుకు వచ్చి సిరియా అధ్యక్షుడు అసాద్‌తో మంతనాలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిరియాకు సంబంధించి శాంతియుత ఒప్పందాన్ని కుదిర్చే దిశగా అంతర్జాతీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించాలన్నదే లక్ష్యంగా పుతిన్ పావులు కదుపుతున్నారు. ఎప్పుడైతే సిరియాకు సంబంధించి అమెరికా దూరంగా జరిగిందో పుతిన్ క్రియాశీలత మరింతగా పెరిగింది. గత రెండు సంవత్సరాలుగా ఎన్నడూ లేని రీతిలో రష్యా జోక్యం పెరగడంతో అంతర్జాతీయంగా ఏకాభిప్రాయానికి ఆస్కారం మెరుగవుతోంది. ఇప్పటివరకు అసాద్‌కు ప్రతికూలంగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా ఆయనకు అనుకూలంగా మారింది. సిరియాపై అంతర్జాతీయ ఏకాభిప్రాయ ప్రయత్నాల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్, టర్కీ దేశాధినేతలతో కీలక భేటీకి సిద్ధమవుతున్నారు. వీరితోనే పుతిన్ మాట్లాడటానికి కారణం సిరియా సంక్షోభం విషయంలో ఇది రెండు దేశాల శాంతియుత పరిస్థితులు ముడివడి వుండటమే. ఈ రెండు దేశాధినేతలతో తాను జరిపే చర్చలను సిరియా సంక్షోభ పరిష్కారానికి దారితీసేలా చూసేందుకు పుతిన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ చర్చల వివరాలను సిరియా అధ్యక్షుడితోనూ, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోనూ ఇతర మధ్యప్రాచ్య దేశాధినేతలతోనూ పంచుకోవడం ద్వారా ఏకాభిప్రాయ సాధనకు బలమైన పునాది పడగలదని పుతిన్ భావిస్తున్నారు. సిరియా అంతర్గత సంక్షోభమన్నది అనేక కోణాలతో ముడివడి ఉంది. ఓ చిన్న కారణంతో ఒక్కసారిగా పెను సమస్యగా మారిన ఈ సంక్షోభ పరిష్కారం త్వరితగతిన జరగకపోతే ఇరుగు పొరుగు దేశాల్లోనూ అశాంతి రగులుకునే పరిస్థితులు తీవ్రమవుతాయన్న హెచ్చరికలు వస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ సవాళ్లనూ అధిగమిస్తూ తనదైన రీతిలోనే సిరియాను ముందుకు తీసుకువెళ్తున్న అసాద్ మనుగడ రష్యా అందించే మద్దతుపైనే ఆధారపడి వుంది. సిరియా ఉగ్రవాదులను అణచివేయాలన్నా, అక్కడ శాంతియుత పరిస్థితులను త్వరితగతిన పాదుకొల్పాలన్నా అనేక దేశాలతో కూడిన అంతర్జాతీయ కూటమిని ఏర్పాటుచేయడం ద్వారానే సాధ్యమవుతుంది. అయితే అది ఇప్పటికిప్పుడే సాధ్యమయ్యేదే కాబట్టి ఒక్కొక్క అడుగు ముందుకు సాగడం ద్వారా అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలన్నది పుతిన్ ఆశయంగా కనిపిస్తోంది. అవసరమైతే మిలిటెంట్ల అణచివేతకు సైన్యాన్ని దింపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను అసాద్‌కు పుతిన్ అందించినట్లుగా చెబుతున్నారు. కేవలం సైనికపరంగా కాకుండా రాజకీయంగానే సిరియా సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా త్వరితగతిన శాంతియుత పరిస్థితులను పాదుకొల్పవచ్చునన్న అంతర్జాతీయ అభిలాషను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. సిరియాలో సత్వర శాంతిని అలాగే ఈ జటిల సమస్యకు తక్షణ పరిష్కారాన్ని కోరుతున్న దేశాలన్నింటితోనూ అసాద్ కలిసిమెలిసి పనిచేస్తేనే సంక్షోభానికి తెరదించడం సాధ్యమవుతుందన్నది నిపుణుల వాదన. గతంలో కూడా సిరియా సమస్య పరిష్కారంపై ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ సంక్షోభంతో సంబంధం ఉన్న దేశాలు భిన్నస్వరాలు వినిపించడంతో ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. ముఖ్యంగా ఇరాన్, రష్యా, హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ అసాద్‌కు మద్దతుగా నిలిచాయి. అమెరికా, టర్కీ, గల్ఫ్ తదితర దేశాలు అసాద్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలకు మద్దతు ఇవ్వడంతో శాంతి ప్రయత్నాలు ఏ కోశానా సఫలం కాలేదు. అయితే అమెరికా ఆలోచనలో మార్పు రావడం, అలాగే అసాద్‌నే కొనసాగించి తీరాలన్న తమ పట్టుదలను సడలించేందుకు రష్యా అంగీకరించడంతో కొంత సానుకూలత ఏర్పడింది. అసాద్ అధికారంలో వున్నా లేకపోయినా సిరియా పాలనా వ్యవస్థలకు ఏవిధంగానూ నష్టం కలగకపోతే అలాంటి పరిష్కారానికి తాము సిద్ధమన్న సంకేతాలను రష్యా అందించింది. ఈ ప్రక్రియ ముందుకు సాగితే దశాబ్దాల సిరియా సంక్షోనానికి తెరపడే అవకాశంతో పాటు ఆ కల్లోల దేశంలో శాంతి కపోతాలు ఎగిరే అవకాశమూ ఉంటుంది. అందుకు అన్ని దేశాలు క్రియాశీల రీతిలో సహకరించాల్సి ఉంటుంది. గతంలో కూడా ఈ రకమైన శాంతి ప్రయత్నాలు జరిగినా అవి ఎందుకు విఫలమయ్యాయో దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడమే ప్రస్తుతం సిరియా శాంతికి ఏకైక మార్గం. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితే ఉంటుంది.

బి.రాజేశ్వర ప్రసాద్