స్పాట్ లైట్

యమకూపం.. యెమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అత్యంత భయానకమైన కరవు కాటకాలు తాండవిస్తున్న దేశంగా యెమన్ అణగారిపోతున్నా ప్రపంచ దేశాలకు పట్టించుకునే తీరికగాని, ఈ దేశాన్ని ఆదుకోవాలన్న యోచన గాని ఏ కోశానా కనిపించడం లేదు. గత 33 నెలలుగా పశ్చిమ దేశాలతో కలిసి యెమన్‌పై సౌదీ అరేబియా బాంబు దాడుల పరంపరను కొనసాగిస్తున్నా మానవీయ కోణంలో ఈ దేశ ప్రజల స్థితిగతులను పట్టించుకునే పరిస్థితే కనిపించడం లేదని చెప్పడానికి తాజాగా ఐక్యరాజ్య సమితి కళ్లకు కట్టిన వాస్తవాలే నిదర్శనం. కనీవినీ ఎరుగని రీతిలో యెమన్‌లో అత్యంత ఘోరమైన కరవు కాటక పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పటికే ఈ దేశ ప్రజలు పూర్తిగా ఆహార అవసరాలు, మందులకోసం ఇతర దేశాల సహాయంపైనే అణుక్షణం ఆధరాపడాల్సి వస్తోందన్న వాస్తవాన్ని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల కనీస పక్షంగానైనా మానవీయ కోణంలో ఆదుకోకపోవడం వల్ల దాదాపు 17 మిలియన్ జనాభా కలిగిన యెమన్ అన్నివిధాలుగా అణగారిపోతోంది. ఇప్పటికే కలరా వీరవిహారం చేస్తోంది. 33 నెలలపాటు ఎడతెరిపి లేకుండా బలమైన దేశాలు ఈ చిరుదేశంపై తమ కండబలాన్ని, ఆయుధ శక్తిని ప్రదర్శించడం వల్ల ఈ దేశ ప్రజలు అతలాకుతలమైపోయారు. కనీసపక్షంగా తాగేనీరుగానీ, పౌష్టికాహారం కాని అందుబాటులో లేకుండా పోయాయి. ప్రభుత్వ సేవలు పూర్తిగా గడుగంటిపోయాయి. ఓ పక్క ఎడతెగని రీతిలో బాంబుల వర్షం గుండెలు పిండేస్తోంటే, అంతర్యుద్ధం వల్ల చెలరేగిన భయానక పరిస్థితులు ఇక్కడి ప్రజల దయనీయ జీవనానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇవన్నీ మూకుమ్మడిగా యెమన్‌ను విఫలదేశంగా, అల్‌ఖైదా వంటి ఉగ్రమూకలు వీరవిహారం చేసేందుకు అన్ని విధాలా అనుకూలమైన వేదికగానే మారుస్తాయని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే తాము యెమన్‌పై దాడులు చేయడానికి కారణం న్యాయబద్ధంగా ఎన్నికైన మన్సూర్ హాదీ సారథ్యంలోని యెమన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్న ఆలోచనే అని సౌదీ అరేబియా చెబుతోంది. కాని దీనికి సంబంధించిన వాస్తవాలు మాత్రం గందరగోళమయంగా, ఎవరి వాదన ఏమిటో, వాటిలో నిజమేమిటో తెలియని అయోమాయనే్న కలిగిస్తోంది. 2012లో అధ్యక్ష పదవి నుంచి అబ్దుల్లా సలె రాజీనామా చేసినప్పటిక నుంచీ యెమన్ పరిస్థితి సంక్షుభితంగా మారింది. దాన్ని ఆసరాగా తీసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు దేశ రాజధానిని హస్తగతం చేసుకున్నారు. అలాగే దేశంలోని అనేక కీలక భాగాలను తమ పిడికిలో బిగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే యెమన్‌తో సుదీర్ఘ సరిహద్దు కలిగిన సౌదీ అరేబియాకు ఈ పరిణామాలు ఏమాత్రం మింగుడుపడడం లేదు. షియాలుగా భావిస్తున్న హౌతీల ప్రభావం తమ దేశంపై ఎక్కడ పడుతుందోనన్న ఆందోళనతోపాటు ఈ మిలిటెంట్ కూటమి వెనుక ఇరాన్ హస్తం ఉందన్న అనుమానాన్ని సౌదీ అరేబియా వ్యక్తం చేస్తూ వచ్చింది. ఆ కారణంతోనే హౌతీ వ్యతిరేక సున్నీ గ్రూపులను ఏకంచేసి వారికి అన్ని విధాలుగా ఆయుధాలను, నిధులను అందించడం మొదలుపెట్టింది. అదే క్రమంలో దేశంలోని హౌతీ మిలిటెంట్ స్థావరాలన్నింటిపైనా ఎడతెగని దాడులకు ఒడిగడుతూనే వస్తోంది. 2015లో మొదలైన ఈ దాడి ఇప్పటికవరకూ కొనసాగుతూనే వస్తోంది. అయితే హౌతీ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని తాము చేస్తున్న దాడుల వల్ల యెమన్ ప్రజలు ప్రత్యక్ష నరకానే్న అనుభవిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించిన సౌదీ మరో తీవ్ర నిర్ణయానికే ఒడిగట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని విధాలుగా ఆహార, వైద్య అవసరాలపై ఇతర దేశాల సాయంకోసం అర్రులు చాస్తున్న యెమన్ ప్రజలపై ఏకంగా ఆర్థిక ఆంక్షలు విధించేందుకూ సమాయత్తం అవుతోంది. మొదట్లో ఈ నిర్ణయాన్ని అమలు చేసినప్పటికీ యెమన్ ప్రజలను మానవీయ దృక్కోణంతో ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇతర దేశాలు సౌదీపై ఒత్తిడి తెచ్చాయి. దాంతో ఈ ఆర్థిక ఆంక్షలను కొంతమేర సౌదీ సడలించింది. కానీ బాంబు దాడులను మాత్రం అవిశ్రాంతంగా కొనసాగిస్తూనే వస్తోంది. ఇలా ఎడతెగని యుద్ధంవల్ల నష్టపోయేది ప్రజలేనన్న వాస్తవాన్ని ఇటు యెమన్ మిలిటెంట్లు, అటు సంకీర్ణ కూటమితో దాడులు చేస్తున్న సౌదీ అరేబియా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యెమన్ హౌతీలకు షియాల నుంచి బలమైన మద్దతే ఉంది. అదే విధంగా ఇరాన్ నుంచి కూడా సాయం అందుతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంత మద్దతు ఉన్నా మొత్తం యెమన్‌ను ఈ మిలిటెంట్ గ్రూపు నియంత్రించ గలుగుతుందా? మొత్తం జనాభాను ఒకే తాటిపైకి తేగలుగుతుందా అన్నది అనుమానమే. ఇన్ని నెలలుగా దాడులు చేస్తున్నా కూడా ఇటు పదాతి దళాలతోనూ, అటు వైమానికంగానూ వీరవిహారం చేస్తున్నా హౌతీలను ఏమాత్రం సౌదీ అరేబియా నియంత్రించలేకపోయింది. దీన్నిబట్టి చూస్తే యెమన్ పరిస్థితి మరింతగా చేతులు జారిపోకుండా ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత అంతర్యుద్ధం కారణంగా అనేక రకాలుగా పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఎంతటి జటిల సమస్యనైనా శాంతియుత చర్చలతో, దౌత్య ప్రయోజనాలతో పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి యెమన్ వైరి వర్గాలు ఇందుకు సన్నద్ధం కావాలి. అందుకు సౌదీ అరేబియా కూడా పెద్దరికంతో తనవందు చేయూతను అందించాలి. ఇప్పటివరకూ ప్రపంచ దేశాలన్నీ యెమన్ సంక్షోభంపై శీతకన్ను వేశాయి. ఇదే ధోరణి కొనసాగితే అత్యంత హేయమైన, అమానుషమైన పరిస్థితుల్లోకి అమాయక యెమన్ ప్రజలు జారుకుంటారని చెప్పడం అతిశయోక్తి కాదు.