స్పాట్ లైట్

శాంతి ఎండమావేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకున్నట్టుగానే పశ్చిమాసియా సమస్య అనూహ్యరీతిలో పరాకాష్ఠకు చేరుకుంది. ఈ జఠిల సమస్యకు శాంతియుత పరిష్కారం ఎండమావి చందమే అయినా దాన్ని ఇంత తీవ్రస్థాయిలో ఇటీవలి కాలంలో ఎవరూ తగిలించలేరు. ఆ పుణ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూటగట్టుకున్నారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల్లోనే కలకలాన్ని, కలవరాన్ని సృష్టించింది. దశాబ్దాల ఈ సమస్యను ఒక్కసారిగా మండించింది. అగ్రరాజ్యమైన అమెరికా ఇటు శత్రుదేశాల నుంచే కాదు.. అటు మిత్ర దేశాల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలకు గురికావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోనూ అగ్రరాజ్యానికి చుక్కెదురయ్యే పరిస్థితి ఎదురైంది.
అమెరికా ఏది చెబితే దానికి తలవూపే బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని గర్హించాయి. ఏకాకిగానే అమెరికా తన నిర్ణయాన్ని సమర్తించుకోవాల్సిన పరిస్థితి ఇంతవరకూ ఎప్పుడూ రాలేదని చెప్పడానికి జెరూసలేంపై ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయమే కారణం. మొదట్నుంచీ కూడా ప్రపంచంలోని అన్ని కీలక ప్రాంతాల్లో తన పట్టును బిగించేందుకు అమెరికా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వస్తోంది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో బలమైన దేశాలను అన్ని విధాలుగా ఆదుకుంటూ తన అవసరాలను తీర్చుకుంటుంది. పశ్చిమాసియాకు సంబంధించినంతవరకూ ఇజ్రాయెల్ ఏమి చేసినా దాని చర్యలు ఎంత వివాదాస్పదంగా ఉన్నా అమెరికా మాత్రం గుడ్డిగానే సమర్థించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా పాలస్తీనాతో ఇజ్రాయెల్ సంఘర్షణలకు సంబంధించి మొదటినుంచీ అమెరికాది ఏకపక్ష వైఖరే. పాలస్తీనా వాసుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ చేతిలో వారనుభవిస్తున్న కష్టాలపైన శీతకన్ను వేస్తూ ఈ యూదు దేశాన్ని అమెరికా గట్టిగానే సమర్థించింది. పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్ గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నా అమెరికా పల్లెత్తుమాట అనని పరిస్థితి. అంతేకాదు, భద్రతా మండలిలోనూ ఇజ్రాయెల్ జోలికి ఎవరూ పోకుండా కొమ్ముకాస్తూ వస్తున్నది అమెరికాయేనని చెప్పడం అతిశయోక్తికాదు. ఎన్ని సంక్షోభాలు తలెత్తిన ఇజ్రాయెల్ మాటే వేదంగా పరిగణించిన అమెరికా దానికి అత్యాధునిక ఆయుధాలను కూడా అందించింది. మిగతా దేశాలు ఏమాత్రం అణుబాట పడుతున్నాయని అనుమానం వచ్చినా వాటిపై నిప్పులు చెరిగే అమెరికా, అదే ఇజ్రాయెల్ విషయానికి వచ్చేసరికి నిమ్మకు నీరెత్తిన చందంగానే వ్యవహరిస్తూ వచ్చింది. ఇంతగా అగ్రరాజ్యం తనను అన్ని విధాలుగా సమర్థిస్తోంది కాబట్టే ఆ దేశానికి ఇజ్రాయెలూ అన్ని వేళలా పశ్చిమాసియాలో తిరుగులేని మిత్రదేశంగా కొనసాగింది. ఈ రెండు దేశాల సంబంధాల మాట ఎలావున్నా దానివల్ల పాలస్తీనాకు ఎలాంటి ఇబ్బందీ కలగనంతవరకు సమస్య ఉండేదికాదు. కాని జెరూసలేం అన్నది పాలస్తీనాకు అత్యంత కీలకం. రెండు దేశాలూ కూడా ఈ నగరంపై తమ హక్కులను చాటుకుంటూనే ఉన్నాయి. దీని జోలికి వెళితే పశ్చిమాసియా శాంతి కాస్తా భ్రాంతి అవుతుందన్న భయంతోనే ఇప్పటివరకూ వచ్చిన అమెరికా అధ్యక్షులెవరూ కూడా అటుగా ఆలోచించలేదు. కాని అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి వివాదమే నినాదంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్‌కు జెరూసలేంతో ముడిపడివున్న పాలస్తీనా మనోభావాలతో పనిలేకుండా పోయింది.
అందుకే ఉరుమి ఉరిమి మీదపడినట్టుగా ప్రపంచ దేశాల ఆగ్రహావేశాలతో నిమిత్తం లేకుండా అసలు జెరూసలేం నేపథ్యంతోనూ పనిలేకుండా దాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించేశారు. ‘తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి’ అన్న చందంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెనుమంటలు రగిలిస్తోంది. అంతర్జాతీయ అభిప్రాయాలను ఈ అంశంతో ముడిపడివున్న రాజకీయ, నైతిక భావాలను దృష్టిలో పెట్టుకునే అమెరికా అధ్యక్షులెవరూ జెరూసలేం జోలికి పోలేదన్న వాస్తవాన్ని ట్రంప్ విస్మరించారు. అలాంటిది ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కుతూ పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న వాస్తవాన్నీ విస్మరిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసేసుకున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న నిరసనలపాట ఎలావున్నా ఇజ్రాయెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో భాగంగానే తామీ నిర్ణయం తీసుకున్నామని అమెరికా చెప్పడం విడ్డూరంగా ఉన్నది.
ఒక దేశ ప్రయోజనాలను విస్మరిస్తూ అక్కడి ప్రజల ఆశలూ ఆకాంక్షలూ మనోభావాలనూ దెబ్బతీస్తూ మరో దేశ మెప్పుకోసం నిర్ణయం తీసుకోవడం అన్నది ఎంతమాత్రం క్షంతవ్యం కాదు. అందుకే ఇటు పోప్ నుంచి అటు ఐరాస వరకూ, అలాగే అనేక ముస్లిం దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగానే ప్రతిఘటించడంతోపాటు దీనివల్ల పశ్చిమాసియా సమస్య మరింత ముదురుపాకాన పడే అవకాశం ఉందని తీవ్ర స్వరంతో హెచ్చరించాయి కూడా. అయితే ఇప్పటివరకూ వచ్చిన అమెరికా అధ్యక్షులకు తాను భిన్నమని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వెనకాడే తత్వం తనకు లేదని జెరూసలేం వ్యవహారంలో ట్రంప్ నిరూపించుకున్నప్పటికీ దానివల్ల తలెత్తే పరిణామాలకు, పర్యవసానాలకు ఎవరిది బాధ్యతో కూడా ఆయన చెప్పాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసినా జెరూసలేం విషయంలో అమెరికా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌ను మరింత సన్నిహితం చేసుకోవడానికి ఓ భారీ వరానే్న ప్రసాదించింది. ప్రస్తుతం పాలస్తీనాలో జరుగుతున్న అమెరికా వ్యతిరేక నిరసనలు, అల్లర్లు ఇప్పట్లో సద్దుమణిగే అవకాశం లేదు. ఇరాన్, టర్కీ సహా అనేక దేశాలు పాలస్తీనాకు వంతపాడుతున్నాయి. ఎందుకంటే జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రపంచ దేశాలే గుర్తించనప్పుడు అమెరికా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఏకపక్ష నిర్ణయానికి ఒడిగట్టకుండా పాలస్తీనా, ఇజ్రాయెల్‌లను చర్చలకు పిలిచి సామరస్యపూర్వక రీతిలో సమస్యను పరిష్కరించి ఉంటే అమెరికా పెద్దరికం మరింత నిలబడేది. కాని అందుకు భిన్నంగా వ్యవహరించడం ద్వారా ట్రంప్ ఒక ప్రాంతానికి అన్యాయం చేశారు. మరో బలమైన దేశం మద్దతును మరింతగా చూరగొనే ప్రయత్నం చేశారు. దీనివల్ల ఏళ్లతరబడి బలపడుతూ వస్తున్న పశ్చిమాసియా శాంతి ప్రక్రియ కుప్పకూలిపోయింది. మళ్లీ దీనిని నిలబెట్టడం ఎవరి తరమూ కాదు. ఇప్పుడు అనేక ముస్లిం దేశాలు కూడా పాలస్తీనాకు అనుకూలంగా మారడం వల్ల ఇది కచ్చితంగా మరో సుదీర్ఘమైన అంతర్జాతీయ సమస్యగా ఎలాంటి చర్చలకు, దౌత్య ప్రయత్నాలకు లొంగనంత జఠిలత్వాన్ని సంతరించుకునే ప్రమాదం ఉంటుంది. ఏ విధంగా చూసినా ఇజ్రాయెల్‌తో పాలస్తీనా సరితూగే అవకాశం లేనప్పటికీ అంతమాత్రాన ఓ తటస్థ ప్రాంతాన్ని ఏకపక్షంగా మరో దేశానికి అప్పగించేయడం అన్నది సభ్య ప్రపంచం ఎంతమాత్రం అంగీకరించదు. ఇప్పుడు జారూసలేం విషయంలో అమెరికా తీరు భవిష్యత్తులో ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలకు అది ఏకపక్ష రీతిలో ఒడిగడుతుందోనన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఎంతగా బుజ్జగించినా పాలస్తీనీయుల ఆగ్రహం చల్లారే అవకాశం లేదు. వారిని అణచివేసే చర్యలకు పాల్పడితే అది సమస్య మరింత జఠిలం కావడానికి దారితీస్తుందే తప్ప శాంతియుత వాతావరణానికి దోహదం చేసే అవకాశం లేదు. మరి ఐక్యరాజ్య సమితి, అలాగే భద్రతా మండలి ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకోబోతున్నాయి? పాలస్తీనా ప్రాంతంలోనూ, అలాగే అనేక ముస్లిం దేశాల్లోనూ, నాటో కూటమిలోనూ తలెత్తిన విభేదాలను ఏ విధంగా చల్లార్చే అవకాశం ఉందన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

బి.రాజేశ్వర ప్రసాద్