స్పాట్ లైట్

విశ్వశోధనలో కొత్తపుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వ ఆవిర్భావం ఓ మిస్టరీ. శతాబ్దాలుగా, దశాబ్దాలుగా సాగుతున్న రోదశీ పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. బిగ్‌బ్యాంగ్ అనంతర కాలంలో సమస్త జీవకోటి ఆవిర్భవించిందన్నది శాస్త్ర ప్రపంచం చెబుతున్న విషయం. అయితే శతాబ్దాలపాటు ఈ భూమీదే కాకుండా ఇతర గ్రహాలపై జీవజాతులున్నాయా లేదా అన్నది శాస్తవ్రేత్తలకు ఎనలేని ఉత్కంఠను, ఆసక్తిని కలిగిస్తూనే వచ్చింది.. వస్తోంది కూడా. గత రెండు దశాబ్దాల కాలంలో విశ్వశోధన, పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. కేవలం మన సౌర వ్యవస్థకు సంబంధించే కాకుండా, దీని ఆవల కూడా వేలాది గ్రహాలున్నాయని, లక్షలాది నక్షత్రాలు ఉన్నాయని, ఆ నక్షత్రాల చుట్టూ మన సౌర వ్యవస్థ సూర్యుడు మాదిరిగానే ఆయా గ్రహాలు పరిభ్రమిస్తూనే ఉన్నాయని శాస్తవ్రేత్తలు, ఖగోళవేత్తలు, ఖగోళ భౌతికవేత్తలు తమ పరిశోధనల సారాంశంగా వెలుగులోకి తెచ్చారు. ఎప్పటికప్పుడు ఎన్ని వివరాలను, విషయాలను ఆవిష్కరిస్తున్నా కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నా రోదశీ లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఎన్నో అద్భుతాలు విస్మయకర వాస్తవాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి. మన భూమిని పోలిన గ్రహాలెన్నో రోదశీలో ఉన్నాయని, వాటిలో చాలామటుకు జీవజాతి మనుగడకు ఆస్కారాన్నిచ్చే సానుకూల పరిస్థితులున్నాయని కూడా శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ఒక్క గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి ఎంత దగ్గరగా ఉంటే అందులోని వాతావరణం అంత భయానకమైన వేడితో అట్టుడికిపోతుంది. అలాగే ఈ గ్రహాలు ఆ నక్షత్రానికి ఎంత దూరంగా ఉంటే అంతగానూ అతి శీతల పరిస్థితులు వాటిలో కనిపిస్తాయి. అంటే ఓ నక్షత్రానికి చాలా దగ్గరగా లేదా చాలా దూరంగా కాకుండా మధ్యస్థ స్థాయిలో ఉండే గ్రహాల్లోనే సమశీతోష్ణత ఉంటుంది. అలాంటి గ్రహాల్లోనే జీవానుకూల వాతావరణం కనిపించే ఆస్కారం ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
తాజాగా కెప్లెర్-90ఐ, కెప్లెర్-8జి అనే రెండు మర సౌర వ్యవస్థ ఆవల ఉన్న గ్రహాలను శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఎప్పటికప్పుడు ఈ రకమైన సుదూర గ్రహాలు బయటపడడం, వాటి గురించి అధ్యయనం జరిపి వాటి స్థితిగతుల గురించి శాస్తవ్రేత్తలు వెల్లడించడం షరా మామూలే అయినప్పటికీ తాజాగా వెలుగుచూసిన ఈ రెండు ఎక్సో ప్లానెట్స్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ఈ రకమైన గ్రహాలను దాదాపు మూడువేలకు పైగానే శాస్తవ్రేత్తలు గుర్తించగలిగారు. కాని ఈ రెండు గ్రహాలకు ప్రత్యేకత ఉండడానికి కారణం ముఖ్యంగా కెప్లెర్-90ఐ అనే గ్రహం కెప్లెర్-90 అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న విషయాన్ని శాస్తవ్రేత్తలు గుర్తించారు. దీన్నిబట్టి మరో సూర్యుడ్ని పోలిన నక్షత్రమూ ఉందన్న వాస్తవాన్ని ఖగోళవేత్తలు వెల్లడించగలిగారు. ఈ పరిశోధనలన్నీ కూడా కృత్రిమ మోధోపరికరాన్ని (ఏఐ) ఉపయోగించే శాస్తవ్రేత్తలు సాగించారు. ఈ ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది దాదాపు మన మెదడు పనిచేసినట్టుగానే, తాము ఆలోచించినట్టుగానే ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన కెప్లెర్ అనే స్పేస్ టెలిస్కోప్ రోదశీ లోతులకు సంబంధించి అందించిన సంకేతాలను ఈ కృత్రిమ ఇంటెలిజెన్స్ పరికరం ద్వారా శాస్తవ్రేత్తలు విశే్లషించారు. కెప్లెర్ స్పేస్ టెలిస్కోప్ 2009-10 మధ్యకాలంలో దాదాపుగా రెండు లక్షల నక్షత్రాలను సర్వే చేయగలిగింది. అదే విధంగా మరో 35వేల గ్రహాలకు సంబంధించిన సంకేతాలను కూడా అందిపుచ్చుకోగలిగింది. వీటిని మిళితం చేసిన శాస్తవ్రేత్తలు కెప్లెర్-90ఐ, కెప్లెర్-80జి అనే రెండు కొత్త సౌర వ్యవస్థ ఆవలి గ్రహాలను నిర్ధారించగలిగారు. కెప్లెర్ టెలిస్కోప్ అందించిన సంకేతాల్లో కొన్ని బలంగానూ, కొన్ని లేశప్రాయంగానూ, మరికొన్ని నామమాత్ర స్థాయిలోనే ఉన్నప్పటికీ కూడా ఆ సంకేతాలు వేటి గురించి అనే దానిపై విస్త్రృత స్థాయి పరిశోధన జరిగింది. వీటి ఆధారంగానే దాదాపు 670 నక్షత్ర వ్యవస్థల నుంచే ఈ సంకేతాలు వచ్చి ఉండవచ్చునని భావించిన శాస్తవ్రేత్తలు ఆ దిశగానే మరింతగా ముందుకు సాగి ఈ తాజా ఆవిష్కరణ చేయగలిగారు. వీటిలో కెప్లెర్-80జి అన్నది దాదాపుగా భూమి పరిమాణం కలిగిన ఓ ఎక్సో ప్లానెట్. ఈ గ్రహం కెప్లెర్-80 అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు నిర్ధారించగలిగారు. అంతరిక్ష పరిశోధన తొలిదశలో కేవలం మన సౌర వ్యవస్థకు సంబంధించిన వివరాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మన సూర్యుడు, మన గ్రహాలు, మన నక్షత్రాలు అన్నదే ఆనాటి పరిశోధనలోని సారాంశం. కాని ఎప్పుడైతే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కిందో మనిషి ఆలోచనలు విశ్వలోతుల్లోకి చొచ్చుకువెళ్లి మన సౌర వ్యవస్థే సర్వస్వం కాదన్న వాస్తవాన్ని నిర్ధారించగలిగాయి. తాజాగా కెప్లెర్ టెలిస్కోప్ అందించిన లేశప్రాయమైన సంకేతాలను సైతం కొత్త టెక్నాలజీ సాయంతో అవగతం చేసుకోగలిగామంటే, అదికూడా కృత్రిమ మేథస్సు ఆధారంగానే వాటికి సంబంధించిన అంచనాలను వేయగలిగామంటే కచ్చితంగా విశ్వశోధన కొత్తపుంతలు తొక్కినట్టే. సాంకేతిక విజ్ఞానం ఆలంబనగా రానున్న కొన్ని రోజుల్లోనే మరిన్ని అద్భుత రోదశీ వాస్తవాలు, మన సౌర వ్యవస్థ ఆవలి సౌర కుటుంబాల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇతర గ్రహాల్లో జీవానుకూల వాతావరణానికి సంబంధించి ఎనలేని పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంగారక గ్రహం పైకి క్యూరోసిటీ రోవర్‌ను పంపిన అమెరికా, ఆ గ్రహానికి సంబంధించిన అనేక వివరాలను వెలుగులోకి తెచ్చింది. ఈ అరుణ గ్రహ తొలి దశలో నీటి ప్రవాహం ఉండేదని నిర్ధారిస్తూ అందుకు సంబంధించిన ఛాయాచిత్రాలను కూడా నాసా కళ్లకుకట్టింది. అదే విధంగా మన సౌర వ్యవస్థలోని అనేక గ్రహాలకు సంబంధించి కూడా ఎన్నో వివరాలను ఈ సాంకేతిక విజ్ఞాన సముపార్జన ఫలితంగా మానవాళి అవగతం చేసుకోగలిగింది. ఇప్పటికీ విశ్వం ఎలా ఏర్పడిందన్నదానిపై తొలినాటి అంచనాలను నిర్ధారిస్తూ, ధ్రువీకరిస్తూ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మినీ బిగ్‌బ్యాంగ్‌ను సృష్టించడం ద్వారా విశ్వఆవిర్భావానికి దోహదం చేసిన దైవకణ ఉనికిని (గాడ్స్ పార్టికల్) కనిపెట్టగలిగాం. ఇప్పటికీ ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత లేని నేపథ్యంలో మానవాళి విశ్వశోధన అన్నది అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉంది. కొత్త ఆవిష్కరణలతో, సరికొత్త అద్భుత అంశాలను ఎప్పటికప్పుడు కళ్లకు కడుతూ మన సౌర వ్యవస్థనే కాకుండా దీనికి ఎన్నోరెట్లు పెద్దవిగా ఉన్న ఎక్సో సోలార్ ప్లానెట్ వ్యవస్థను శాస్తవ్రేత్తలు కరతలామలకం చేసుకోగలుగుతున్నారు. ఈ తాజా పరిశోధన తదుపరి జరిగే విశ్వశోధనకు మరింత ప్రేరణ, స్ఫూర్తి కాగలిగితే, అన్య గ్రహాల గురించి అనన్యమైన సమాచారాన్ని అందిపుచ్చుకోగలుగుతాం.