స్పాట్ లైట్

లంక రూటు మార్చగలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీర్ఘకాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టనున్న శ్రీలంక పర్యటనకు అనేక విధాలుగా వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే అత్యంత ప్రాధాన్యతతో, విస్తృత లక్ష్యాలతోనే మోదీ 12న లంకకు వెళుతున్నారన్నది స్పష్టం. ఎల్‌టిటిఇ సమస్య లంకలో అంతమైనప్పటి నుంచీ అక్కడ మైనార్టీ తమిళుల ఇబ్బందులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయన్నది వాస్తవం. ఇది ఇరు దేశాలకు సంబంధించిన అంశమే అయినప్పటికీ మొదటి నుంచి భారత్‌కు బలమైన మిత్ర దేశంగా ఉన్న శ్రీలంక ఇటీవలి కాలంలో చైనా వైపు మొగ్గు చూపుతోందన్న వాదన ఆందోళన కలిగిస్తోంది. భారత్‌ను అంతర్జాతీయంగానే కాకుండా ప్రాంతీయంగా కూడా దెబ్బతీసే లక్ష్యంతో చైనా ఎప్పటికప్పుడు పావులు కదుపుతోంది. భారత్‌కు మిత్ర దేశాలుగా ఉన్న లంక సహా పలుదేశాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో ముమ్మరం చేసింది. సిరిసేన దేశాధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచీ లంక రాజకీయ వ్యూహాల్లోనూ, ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. భారత్‌తో కంటే చైనాకు అనుకూలంగా ఉండటం వల్లే ఆర్థికంగానూ, రక్షణ పరంగానూ లబ్ధి పొందవచ్చునన్న లంక డోలాయమానాన్ని ఆసరా చేసుకున్న చైనా అందుకు అనుగుణంగానే పాచికలు విసురుతోంది. పైగా అన్ని విధాలుగా రుణకూపంలో చిక్కుకున్న లంకను చేరదీయడం, తాయిలాలతో తనవైపు తిప్పుకోవడం అన్నది డ్రాగన్‌కు మరింత సులభంగా మారింది. లంక ఆలోచనల్లో వచ్చిన మార్పులకు అద్దం పట్టే పరిణామాలెన్నో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మోదీ పర్యటన ప్రాధాన్యత మరింత పెరిగిందనే చెప్పాలి. ఐక్యరాజ్య సమితి ఉత్సవాల్లో పాల్గొన బోతున్న ఆయన భారత్‌కు ఉన్న బౌద్ధమత వారసత్వాన్ని బలంగా ఉపయోగించుకుని ఆసియా దేశాలతో బలమైన బంధాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు ఏమీ కుదరక పోవచ్చునన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల లంక ప్రధాని రనిల్ విక్రమసింఘే భారత పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహనా ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లే వీలు కనిపిస్తోంది. ఇవి ఒకరకంగా లంకకు భారత్ చేరువ కావడానికి, చైనావైపు మొగ్గు చూపకుండా చూసేందుకు ఎంత మేరకు ఉపయోగపడతాయన్నది అనుమానమే! దక్షిణాసియాలో ఉన్న దేశాలన్నింటికంటే భౌగోళికంగా, రాజకీయంగా అత్యంత ప్రభావశీలత కలిగిన దేశం భారతే కాబట్టి లంకతో పాటు ఇక్కడి ఇతర దేశాలను అన్ని విధాలుగా ఆదుకోగలిగితే ఇవి గాడితప్పే అవకాశం ఉండదు.దౌత్య నీతిలోనూ, రీతిలోనూ ఆరితేరిన నరేంద్ర మోదీ ఎంత మేరకు తన పర్యటనను విజయవంతం చేసుకోగలగుతారు..చైనా ప్రభావం నుంచి లంకను తప్పించేందుకు ఎలాంటి ద్వైపాక్షిక బంధాన్ని ఆవిష్కరించబోతున్నారన్నది ఆసక్తి కలిగిస్తోంది.