స్పాట్ లైట్

చైనా గుప్పిట నేపాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్ పరిస్థితి ఇప్పుడు రెండు పెద్ద దేశాల మధ్య ఎటు తేల్చుకోవాలో తెలియని అనిశ్చితి మయంగా మారింది. ఒకపక్క చైనా, మరోపక్క భారత్ ఈ చిరు దేశానికి అత్యంత కీలకమైనవే. ఈ రెండు దేశాల సహాయ సహకారాలు లేనిదే ఈ హిమాలయ ప్రాంత దేశం స్వంతంగా మనుగడ సాగించే అవకాశం లేని పరిస్థితి. ఇప్పటివరకూ ఎలాంటి సమస్య లేకుండా కొంత అటో ఇటోగా రెండు దేశాలతోనూ బంధాన్ని నేపాల్ కొనసాగిస్తూనే వచ్చింది. కాని తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితంతో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పూర్తిగా చైనావైపు మొగ్గు చూపాలా లేక భారత్‌తో కొనసాగుతున్న అనుబంధాన్ని బలోపేతం చేసుకోవాలా అన్నది నేపాల్ నాయకత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది. అయితే అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్టు పాలకులు కాబట్టి చైనాతో లోతైన ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు, సంకేతాలు బలపడుతున్నాయి.
నేపాల్‌లో కమ్యూనిస్టులదే అధికారం కావడంతో ఆ దేశంపై మరింతగా పట్టు సాధించడానికి చైనాకు అవకాశం లభించినట్టయింది. ఇప్పటికే అనేక విధాలుగా నేపాల్‌ను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించిన చైనాకు భారత్‌కు దీన్ని దూరం చేయడం అన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
నిన్న మొన్నటివరకూ భారత్, నేపాల్ మధ్య అత్యంత బలమైన సన్నిహితమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగేవి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌కు నేపాల్ దూరం కావడం, అలాగే కొత్తగా ఆ దేశంలో కమ్యూనిస్టులదే అధికారం కావడం చైనాకు అన్ని విధాలుగా కలిసివచ్చినట్టయింది. కొత్త ప్రభుత్వం రావడంతో నేపాల్ తన విదేశాంగ విధానాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే దేశ రాజకీయాల్లో చైనా అనుకూల శక్తులు కూడా బలోపేతం కావడం ఇందుకు మరింత సానుకూలతను తెచ్చిపెట్టింది. దీన్నిబట్టి చూస్తే సమీప భవిష్యత్తులో భారత్ కంటే కూడా చైనావైపే నేపాల్ మొగ్గుచూపే అవకాశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీల కూటమి ప్రభుత్వంలోకి రావడం అన్నది భారత్ అనుకూల వర్గాల ప్రాబల్యాన్ని నీరుగార్చినట్టుగానే భావిస్తున్నారు. మొదటినుంచీ దేశంలో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న నేపాలీ కాంగ్రెస్‌కు ఇప్పుడు పూర్తిగా పట్టుతప్పే పరిస్థితి తలెత్తింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడో స్థానానికే ఈ పార్టీ పరిమితం కావడంతో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టుల నాయకత్వంపైనా, వారి నిర్ణయాలపైనా ఏ రకమైన సానుకూల ప్రభావాన్ని కనబరిచే పరిస్థితి నేపాలీ కాంగ్రెస్‌కు లేదు. ముఖ్యంగా దేశీయ, విదేశాంగ రూపకల్పనలో ప్రభుత్వానికి నేపాలీ కాంగ్రెస్ ఏ మేరకు మార్గనిర్దేశన చేయగలుకుతుందన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. కనీసం ఈ ఎన్నికల్లో రెండో పెద్ద పార్టీగా నేపాలీ కాంగ్రెస్ అవతరించి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా కమ్యూనిస్టు కూటమిదే తుది నిర్ణయం అయ్యే పరిస్థితి అనివార్యంగా మారింది. రెండు వామపక్ష పార్టీలూ విలీనం అయ్యేందుకు సంకేతాలు అందించడం కచ్చితంగా చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి దారితీసేదే అవుతుంది. ఇప్పటికే ఈ రకమైన సూచనలనే ఈ రెండు పార్టీలూ అందించాయి. పైకి భారత్, చైనాలతో ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తామని ఈ పార్టీలు చెబుతున్నప్పటికీ అంతర్గతంగా చైనా అనుకూల ధోరణే ప్రభుత్వ విదేశాంగ విధానంలో ప్రస్పుటం అయ్యే అవకాశం కనిపిస్తోంది. పైగా మొదటినుంచీ దక్షిణాసియా వ్యవహారాల విషయంలో భారత్ ధోరణిని చైనా కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తూనే వచ్చారు. భారత్ పెద్దన్న ధోరణిని కనబరుస్తోందని పేర్కొన్న ఈ పార్టీలు ఆ దిశగానే తమ విధానాలను, ఆలోచనలనూ ముందుకు తీసుకెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో కంటే కూడా చైనాతోనే సన్నిహిత, రాజకీయ, ఆర్థిక, ద్వైపాక్షిక బంధాలను, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడంవల్ల తమ మనుగడకు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న అభిప్రాయం కూడా తాజా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీల్లో స్పష్టమవుతోంది. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య ఉండడంవల్ల అన్ని విధాలుగా తమ వ్యూహాత్మక, భద్రతాపరమైన ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రస్తుతం నేపాల్ నాయకత్వానికి ఎంతైనా ఉంది. స్నేహపూర్వక సంబంధాల విషయంలో అన్ని విధాలుగా కలిసివచ్చే చైనాతోనే ముందుకు వెళ్లాలని నేపాల్ పాలకులు నిర్ణయించినప్పటికీ ఈ దేశ భౌగోళిక ఏర్పాటు దృష్ట్యా చూస్తే భారత ప్రాధాన్యతను విస్మరించడం అన్నది ఎంతమాత్రం సాధ్యం కానిదే. పైగా తరతరాలుగా భారత్, నేపాల్ మధ్య భౌగోళిక, సాంస్కృతిక, మత, సామాజిక అనుబంధాలు పెనవేసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో సంబంధం లేకుండా నేపాల్ మనుగడ సాగించడం అన్నది దాదాపుగా అసాధ్యం. భారత్, నేపాల్ మధ్య బహుముఖీయ రీతిలో అన్ని రకాలుగానూ సంబంధాలు పెనవేసుకుపోయాయి. భారత్‌తో కంటే కూడా భౌగోళికంగా చైనాతో నేపాల్‌కు ఎంతో వ్యత్యాసం ఉంది. భారత ప్రజలతో నేపాలీ ప్రజలు సాంస్కృతికంగా, రాజకీయంగా కలిసిపోయినంతగా చైనా, నేపాల్ ప్రజల మధ్య సంబంధాలు లేవు. అయినప్పటికీ కూడా తన సైనిక బలాన్ని, ఆర్థిక బలాన్ని ఎరగా వేసి నేపాల్‌ను తనవైపు తిప్పుకునేందుకు చైనా గట్టి ప్రయత్నాలే చేసే అవకాశాలు తాజా పరిణామాల నేపథ్యంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనావైపు మొగ్గుచూపడం వల్ల ఇటు నిధుల పరంగానూ దేశ భద్రతకు సంబంధించిన అవసరాలు తీసుకోవడంలోనూ కృతకృత్యులు కావచ్చన్నది నేపాల్ పాలకుల తాజా ఆలోచనలా కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలను కేవలం ఆర్థిక కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. భద్రతాపరమైన అంశాలు కూడా ఈ విషయంలో కీలక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. దీని దృష్ట్యానే నేపాల్‌పై వ్యూహాత్మక రీతిలోనే చైనా తన పట్టును బిగించేందుకు సమయత్తం అవుతోంది. అయితే ప్రస్తుతానికి చైనాతో సంబంధాలు ఆసక్తికరంగానూ, ప్రయోజనకరంగానూ కనిపించినా రాను రాను డ్రాగన్ విశ్వరూపాన్ని చవిచూడాల్సిన పరిస్థితి కూడా నేపాల్‌కు తలెత్తుతుందని ఎంతైనా వాస్తవం. కేవలం నేపాల్‌ను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆ దేశానికి చైనా నిధులిచ్చే అవకాశం ఉండదు. పెట్టుబడిగా పెట్టే ప్రతి పైసాకూ పదింతలు వసూలు చేసుకుంటే తప్ప చైనా వదలదన్నదీ వాస్తవమే. ఒకవేళ చైనావైపే నేపాల్ మొగ్గుచూపితే ప్రభుత్వ విధానాలను కూడా డ్రాగన్ అనుకూల రీతిలో మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా నేపాల్‌కు తలెత్తుతుందన్నది కళ్లకు కడుతున్న నిజం.

- బి. రాజేశ్వర ప్రసాద్