స్పాట్ లైట్

థెరిసా తంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెగ్జిట్ వ్యవహారంలో బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే రోజుకో కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించిన తతంగాన్ని అధికారికంగా ప్రారంభించినప్పటికీ దేశానికి ప్రయోజనాన్ని కలిగించే రీతిలో ఏవిధంగా ముందుకు వెళ్లాలన్నది అంతుబట్టని వ్యవహారంగా మారింది. దేశీయంగా పలు పార్టీల నుంచి వస్తున్న వ్యతిరేకతతో తల్లడిల్లుతున్న థెరిసా మే పూర్తిస్థాయిలో ప్రజా మద్దతును సంతరించుకుని బ్రెగ్జిట్‌పై దూసుకుపోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రెగ్జిట్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో సంతరించుకునే అవకాశం లేదు కాబట్టి మధ్యంతర ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయి ప్రజా మద్దతుతోనే ఘనవిజయం సాధించాలన్న థెరిసా మే ఆలోచనలు ఏ మేరకు సాకారమవుతాయన్నది అంతుబట్టడం లేదు. అయితే మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించగలనన్న నమ్మకం ఆమెకు నిజంగా ఉందా? లేక బ్రెగ్జిట్‌పై తలెత్తుతున్న వ్యతిరేకతను చల్లార్చే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మధ్యంతర ఎన్నికలు నిర్వహించడమన్నది ప్రస్తుత పరిస్థితుల్లో థెరిసాకు ఏ రకంగానూ రాజకీయంగా ఉపయోగపడే అవకాశం లేదు. కానీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఐరోపా యూనియన్‌తో బ్రెగ్జిట్ చర్చలను మరింత బలంగా చేపట్టాలన్న ఆలోచనతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా రాజకీయ పరమైన విభేదాలు ఎలా వున్నా దేశ ప్రజలందరూ ఒక్కటిగా థెరిసాకు మధ్యంతర ఎన్నికల్లో ఓటు వేస్తే కచ్చితంగా అది ఆమెకు కొండంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నది ఎంతైనా నిజం. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న ఆలోచన నేపథ్యంలో అనుకూల ప్రతికూల వాదనలు ఎన్నో వినిపించాయి.
ఇదే జరిగితే అది బ్రిటన్ ఏకాకి కావడానికి ఐరోపా యూనియన్‌లో నిరుపమాన స్థానాన్ని కోల్పోవడానికే దారితీస్తుందన్న వాదనలూ తెరపైకి వచ్చాయి. అన్నింటికంటే మించి ఐరోపా యూనియన్ నుంచి వైదొలగడం వల్ల తనకు లభించే ప్రయోజనాలు ఏమిటన్న విషయాన్ని నిర్ధారించుకోకుండా తొందరపాటుతో దాన్నుంచి నిష్క్రమిస్తే దేశ ఆర్థిక శక్తి మరింత సన్నగిల్లుతుందన్న వాదనా అప్పట్లో వినిపించింది. అయినప్పటికీ కూడా బ్రెగ్జిట్ అమలైంది. ఈ ప్రక్రియను నిరోధించడానికి అప్పటి ప్రధాని కామెరూన్ గట్టిగా ప్రయత్నించినప్పటికీ అవి ఫలించకపోవడం, చివరకు ఆయన రాజీనామా చేయాల్సి రావడం, ఆయన స్థానంలో థెరీసా మే దేశ సారథ్యాన్ని చేపట్టడం తెలిసిందే. అప్పటినుంచీ థెరిసా మే దినదినగండం లాంటి పరిస్థితులనే ఎదుర్కొంది. ఓపక్క నిరుద్యోగ సమస్య, అంతర్గత విభేదాలు, పార్టీ పరమైన సమస్యలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి తర్వాత బ్రెగ్జిట్‌పై ఆమె ధైర్యంగా ముందుకు వెళ్లలేని పరిస్థితుల్నే కల్పించాయి. పైగా ఐరోపా యూనియన్‌కు బలమైన రాజ్యాంగం ఉంది. ఇందులో సభ్యత్వానికి ఎన్ని రకాలైన కఠిన షరతులు వర్తిస్తాయో దాన్నుంచి తప్పుకోవాలన్న అంతకుమించిన మెలికలు ఉంటాయి. ఇప్పుడీ మెలికలే థెరిసా పాలిట పెను సవాళ్లుగా మారుతున్నాయి. వీటిని ఏవిధంగా అధిగమించాలి, గరిష్ఠ స్థాయిలో బ్రిటన్ ప్రయోజనాలను అన్ని రకాలుగానూ సాధించుకోవాలన్నది ఆమెకు నల్లేరుపై నడకేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు? బ్రెగ్జిట్‌పై భావోద్వేగ రీతిలో అనుకూల ఓటు వేసినప్పటికీ వాస్తవికంగా వారి ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలంటే మధ్యంతర ఎన్నికలే మార్గమని థెరిసా మే భావించినట్లుగా తెలుస్తోంది. పైగా ఎంత బలమైన నాయకురాలైనా ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఒకటికి పదిసార్లు ఆలోచించక తప్పదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఏవిధంగానైనా ఉండవచ్చు. అది అనుకూలమూ కావచ్చు, పూర్తిస్థాయి ప్రతికూలంగానూ పరిణమించవచ్చు. అంటే అన్నీ సవ్యంగా జరిగితే థెరిసా మే బ్రెగ్జిట్‌పై దూకుడుగా ముందుకు వెళ్లగలుగుతారు. మరి ఎన్నికల్లో వ్యతిరేక తీర్పు వస్తే పరిస్థితి ఏమిటన్నది అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. అయినప్పటికీ కూడా మధ్యంతర ఎన్నికలకే థెరిసా మొగ్గు చూపడం వెనుక బ్రెగ్జిట్ చర్చల్లో జాతీయ ప్రయోజనాలను బలంగా పరిరక్షించుకోవాలన్న ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రెగ్జిట్ చర్చలు ఎలా జరిగినా తనకెందుకులే అని థెరిసా మే భావిస్తే మధ్యంతర ఎన్నికల రిస్క్‌ను తీసుకుని ఉండేవారు కాదు. హాయిగా అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వ నాయకురాలిగా 2020 వరకు అధికారంలో కొనసాగే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత సమస్యలను అధిగమించాలంటే తన అధికారం కంటే కూడా భవిష్యత్తులో బ్రిటన్ ప్రయోజనాలను తిరుగులేని రీతిలో పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందన్న విచక్షణతోనే దూరదృష్టితోనే థెరిసా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు ఐరోపా యూనియన్ అనుకూల నాయకుడు మాక్రన్‌కు పట్టం కట్టిన నేపథ్యంలో ఇ.యు నాయకత్వం బ్రిటన్ డిమాండ్లపై మరిన్ని షరతులు విధించే అవకాశాలు లేకపోలేదు.

చిత్రం..బ్రిటన్ ప్రధాని థెరిసా మే