స్పాట్ లైట్

ఐరాసపై పెత్తనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి.. ప్రపంచ దేశాలన్నింటికీ పెద్దదిక్కు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా, వివాదాలు చెలరేగినా, ఉగ్రవాదం పేట్రేగినా ప్రపంచ దేశాలన్నింటికీ సమాయత్తం చేసి పరిష్కార మార్గాలను తెరపైకి తెచ్చే గురుతర బాధ్యత ఐక్యరాజ్య సమితిది. వివాదాల పరిష్కారంతోపాటు లొంగని దేశాలను ఆంక్షల ద్వారా అదుపుచేయడం, నియంతలను, నియంతృత్వాలను ప్రపంచ దేశాల ఉమ్మడి గళంతో అణిచివేసి ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలు సర్వత్రా పరిఢవిల్లేలా కాపాడడం ఐరాస కర్తవ్యం. దశాబ్దాలుగా ఈ బాధ్యతను ఐరాస నిర్వహిస్తూ వస్తోంది. అయితే దీని మనుగడకు సంబంధించి అనేక సమయాల్లోనూ, సందర్భాల్లోనూ వివాదాలు రేకెత్తినప్పటికీ ఈ అంతర్జాతీయ వ్యవస్థ పూర్తిగా కొన్ని దేశాల చెప్పుచేతల్లోకే వెళ్లిపోయిందా? ఆ దేశాలు చెబుతున్నట్టుగానే నడుచుకోక తప్పని పరిస్థితి దీనికి తలెత్తిందా అన్నది లోతుగా ఆలోచించాల్సిన విషయం. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఐక్యరాజ్య సమితి, అలాయే భద్రతా మండలి అత్యంత కీలక రీతిలో ప్రపంచ వ్యవహారాలను గాడిన పెట్టేందుకు ఉమ్మడి ప్రాతిపదికన ప్రయత్నించేది. అయితే సోవియట్ యూనియన్ పతనం కావడంతో రష్యా ప్రాభవం, ప్రాబల్యం సన్నగిల్లడంతో ఏకైక సూపర్ పవర్‌గా అమెరికా గత కొన్ని సంవత్సరాలుగా తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. తన నిర్ణయం అందరికీ శిరోధార్యం అన్నట్టుగా చాలా సందర్భాల్లో అమెరికా తన పెత్తందారీ ధోరణిని ప్రదర్శించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే అగ్రరాజ్యమైన అమెరికాను ఐరాస నిలువరించలేకపోతోందా? ఇందులోని మెజారిటీ సభ్యుల ఉమ్మడి గళం సైతం అమెరికా తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను, చర్యలను నిరోధించలేకపోతున్నాయా? అన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
తాజాగా జెరూసలెం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అనేక కోణాల్లో పశ్చిమాసియా సమస్యను మరింత రగిలించేదిగానే మారింది. దశాబ్దాల తరబడి జెరూసలెం పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఎడతెగని రగడగానే కొనసాగుతూ వచ్చింది. అసలు పశ్చిమాసియాకు అత్యంత కీలకమైన శాంతి సంస్థాపనా ప్రయత్నాలకు విఘాతం కలిగించే రీతిలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇటు ముస్లిం దేశాల్లోనూ, ఇతర దేశాల్లోనూ తీవ్ర ఆగ్రహానే్న రేకెత్తించింది. పాలస్తీనాతో నిమిత్తం లేకుండా జెరూసలెం నేపథ్యాన్నీ పట్టించుకోకుండా దాన్ని ఇజ్రాయెల్‌లో భాగంగా ప్రకటించడం ద్వారా ట్రంప్ రేకెత్తించిన వివాదాల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఐరాస ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.
అయితే అమెరికా నిర్ణయాన్ని తిప్పికొట్టే శక్తి సామర్థ్యాలు ఐక్యరాజ్య సమితికి ఉన్నాయా? తన ఉనికిని బలంగా అన్నది పక్కనబెడితే జెరూసలెం విషయంలో జరిగిన ఓటింగ్‌లో మాత్రం అమెరికా, ఐరాసల మధ్య దూరం మరింత పెరిగిందన్న వాస్తవాన్ని తెరపైకి తెచ్చింది. ఐక్యరాజ్య సమితికి అత్యధిక స్థాయిలో విరాళాలు అందిస్తున్న దేశం అమెరికా అయినప్పటికీ ఆ దేశం చెప్పు చేతల్లోనే ఐరాస నడుచుకోవాల్సిన అగత్యం ఉన్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఐక్యరాజ్య సమితి విషయంలో మొదటినుంచీ కూడా అమెరికాకు నిలకడైన అభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా వెన్నుదన్ను లేకుండా ఐక్యరాజ్య సమితి మనుగడ సాగించే అవకాశం ఉందా అన్నది కీలకంగా మారింది. ఐక్యరాజ్య సమితి భవన సముదాయాలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. దాని మనుగడకు అవసరమైన నిధులను భారీ పరిమాణంలో అమెరికాలో అందిస్తోంది. జెరూసలెంపై చేపట్టిన తీర్మానంపై ఐరాసలో ఓటింగ్ జరగడానికి ముందే అమెరికా సీనియర్ అధికారి ఒకరు దాదాపుగా హెచ్చరిక స్వరానే్న వినిపించారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఆ తీర్మానం కొట్టివేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన నిక్కీ హేలీ ఐక్యరాజ్య సమితికి తాము భారీగా నిధులు సమకూరుస్తున్నామని, అలాంటిది తాము తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా తిరస్కరిస్తారు అన్న విధంగా మాట్లాడారు. ఆ నేపథ్యంలోనే ఐరాసకు తాము అందించబోతున్న నిధుల్లో కోత తథ్యమన్న సంకేతాలనూ అందించారు. ఏ విధంగా చూసినా కూడా 1950 దశకంలో ఆనాటి పశ్చిమ దేశాలు తమ అంతర్జాతీయ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితిని రూపొందించాయి. 60వ దశకం వచ్చేవరకూ కూడా ఐరాస పూర్తిగ పశ్చిమ దేశాల చెప్పుచేతల్లోనే సాగింది. ఆనాడు వలసవాద నిరోధనకు తనపై 17 కొత్త దేశాలు ఓ తీర్మానాన్ని చేపట్టడం, దాన్ని ఆమోదించడంతో ఐరాస నిజమైన స్ఫూర్తితో మనుగడలోకి రాగలిగింది. అయితే ఎప్పటికప్పుడు అమెరికా తన ఏకపక్ష నిర్ణయాలతో ఐరాసపై పట్టు బిగించేందుకు, తన ఆదిపత్యాన్ని చెలాయించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటోంది. అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఆమోదంతో నిమిత్తం లేకుండానే అమెరికా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సమసిపోయిన నేపథ్యంలో ఐరాస పూర్తి స్థాయిలో తన అంతర్జాతీయ బాధ్యతలను నిర్వహించగలుగుతుందన్న భావన అనేక దేశాల్లో వ్యక్తమైంది. ప్రపంచవ్యాప్తంగా సుపరిపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, మానవ హక్కుల పరిరక్షణ దిశగా ఐరాస మరింత నిగ్గుతేలుతుందని భావించారు. కాని ఆ రకమైన పరిస్థితి ఏదీ ఇప్పటివరకూ కనిపించిన దాఖలాలు లేవు. 1945 నుంచీ కూడా అత్యధిక స్థాయిలో ఐరాసకు అమెరికాయే నిధులు అందిస్తున్న మాట వాస్తవమే అయినా, ఈ విషయంలో ఇతర దేశాల విరాళాలను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐరాస బడ్జెట్‌లో ప్రధాన వాటా అమెరికాదే అయినప్పటికీ ఇతర దేశాలు సైతం ఇతోధిక సాయంతో ఈ అంతర్జాతీయ సంస్థను ఆదుకుంటున్నాయన్న వాస్తవాన్ని విస్మరించడానికి వీలు లేదు. ఐరాస శాంతిదళాల్లో భారత్ సహా అనేక దేశాలు పాల్గొంటూనే వస్తున్నాయి. చాలా సందర్భాల్లో తన ప్రయోజనాలను, తన నిర్ణయాలను కాపాడుకునేందుకే అమెరికా వ్యవహరిస్తోందన్నది కళ్లకు కడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల ప్రయోజనాలకే కొమ్ముకాసే వ్యవస్థగా మారకుండా, మారుతున్న ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగానే ఈ వ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నం జరగాలి. అంతర్జాతీయంగా తన ఉనికిని బలంగా చాటుకుంటున్న భారత్ ఈ విషయంలో క్రియాశీలక భూమికి పోషించాలి. అమెరికా భారీగా నిధులు ఇస్తున్నందున ఆ దేశ ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఈ ప్రపంచ సంస్థకు లేదన్న వాస్తవికత సర్వత్రా నిగ్గుదేలాలి. ఐరాస అన్నది అమెరికా గుత్తసొత్తు కాదని, ఆ దేశం నిధులను తగ్గించినంతమాత్రాన దాని మనుగడకు ఏ రకమైన ఇబ్బందీ ఉండదన్న నిజాన్ని కూడా చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. జెరూసలెం విషయంలో అమెరికా నిర్ణయాన్ని తిరస్కరిస్తూ చేపట్టిన తీర్మానమే ఇందుకు మార్గనిర్దేశం చేయాలి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐక్యరాజ్య సమితి సంస్కరణకు ఎలాంటి జాప్యం లేకుండా పెద్దపీట వేయాల్సిన అవసరం నేటి సంక్లిష్ట పరిస్థితిలో మరింతగా పెరిగింది. ఐరాస అందరిదీ అన్న నినాదంతో ముందుకు వెళితేనే ఈ ప్రపంచ సంస్థను కాపాడుకోగలుగుతాం. మారుతున్న పరిస్థితులు, సవాళ్లకు అనువుగా ఆ స్ఫూర్తితోనే దానిని తీర్చిదిద్దగలుగుతాం.

బి.రాజేశ్వర ప్రసాద్