స్పాట్ లైట్

ఫ్రాన్స్ కొత్త కెరటం మాక్రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకున్నట్టే ఫ్రాన్స్‌లో సరికొత్త రాజకీయ శకం ఆవిష్కృతమైంది. ప్రధాన రాజకీయ పార్టీలను తిప్పికొట్టిన ప్రజలు ఐరోపా యూనియన్ అనుకూల ఇమాన్యుయెల్ మాక్రన్‌కు పట్టం కట్టడం ఊరట కలిగించే అంశం. ఇమిగ్రేషన్ వ్యతిరేక లీపెన్‌ను ఎన్నుకుని ఉంటే రాజకీయంగా గందరగోళ పరిస్థితి తలెత్తి ఉండేది. ఇప్పటికే సభ్య దేశాల నిష్క్రమణ హెచ్చరికలతో అట్టుకుతున్న ఐరోపా యూనియన్ మరింత ఇరకాటంలో పడి ఉండేది. మాక్రన్ ఎన్నికతో ఈ సమస్య తీరినా ఇప్పుడాయన ఏమి చేయబోతున్నారన్నదే కీలకం. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకోగలుగుతారు..ఐరోపా యూనియన్‌కు పొంచి ఉన్న సవాళ్లను ఎలా తిప్పిగొట్టగలుగుతారన్నదీ ప్రపంచ దేశాలకు తలెత్తుతున్న ప్రశ్న.
*
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఐరోపా యూనియన్ అనుకూల వ్యాపారవేత్త ఇమ్మానుయేల్ మాక్రన్ ఎన్నిక కావడం దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులకు ఆస్కారం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ మాక్రన్ కాకుండా నేషనల్ ఫ్రంట్ నాయకురాలు లీపెన్ ఎన్నికయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్నదానిపై అనేక రకాలుగా విశే్లషణలు సాగుతున్నాయి. మొత్తం మీద చివరి క్షణం వరకూ డోలాయమానంలో ఉన్న ఫ్రాన్స్ ప్రజలు మొత్తం ఐరోపా యూనియన్ ఊపిరి పీల్చుకునే రీతిలోనే మాక్రన్‌కు అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఎలాంటి ఒడిదుడుకులూ లేని పరిపాలనకు ఆస్కారం ఇవ్వడంగానే భావిస్తున్నారు. చివరి క్షణం వరకూ కూడా ఏదో అద్భుతం జరిగి లీపెన్ ఎన్నికయితే ఐరోపా యూనియన్ గతి ఇంతేనా అన్న ఆందోళన అందులోని భాగస్వామ్య దేశాలు అన్నింటినీ పరుగులు పెట్టించింది. మాక్రన్ ఎన్నిక అనేక రకాలుగా ఫ్రాన్స్ రాజకీయాల్లో సరికొత్త మార్పులను ఆవిష్కరించింది. దశాబ్దాలు తరబడి దేశాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీల నేతలకు పక్కనబెట్టి ఇమ్మానుయేల్‌కు ప్రజలు పట్టంగట్టడం తమ ఆశలు, ఆకాంక్షలను కొత్త అధ్యక్షుడు ఈడేర్చగలడన్న నమ్మకంతోనేనని విశే్లషకులు చెబుతున్నారు. మొదటి నుంచీ కూడా ఫ్రాన్ అధ్యక్ష ఎన్నికలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఉత్కంఠను రేకెత్తించాయి. ఓ పక్క అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలోనే ఆయన విధానాలనే అనుసరిస్తూ నేషనల్ ఫ్రంట్ నాయకురాలు లీపెన్ ఫ్రాన్ అధ్యక్ష ఎన్నికల సమరంలోకి దిగారు. ఓ రకంగా చెప్పాలంటే మేక్రాన్‌కు రాజకీయాలు కొత్త. అయినప్పటికీ కూడా తన ఆలోచనలు, విధానాలు ఆర్థిక వ్యూహాలతో దేశ ప్రజలను విశేషంగానే ఆకట్టుకోగలిగారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా లీపెన్ సారధ్యంలో నేషనల్ ఫ్రంట్ అద్భుతమైన ఫలితాలనే సాధించింది. మాక్రన్‌కు సరిసమానంగా లీపెన్ కూడా ఈ ఎన్నికల్లో దూసుకువెళ్లారని చెప్పడానికి ఎన్నో దుష్టాంతాలున్నాయి. ఆమెకు వచ్చిన ఓట్లు 34 శాతమే అయినప్పటికీ దేశ ప్రజల్లో లీపెన్ పట్ల బలమైన విధేయతే ఉందని చెప్పడం అతిశయోక్తి ఏమీకాదు. ఈ ఎన్నికల ఫలితాలు ఫ్రాన్‌కంటే కూడా ఐరోపా యూనియన్‌కే ఎక్కువ ఊరటను అందించాయి. ఐరోపా యూనియన్‌కు విధేయంగానే ఫ్రాన్స్ ఉంటుందని, దాని విలువలను, ఆలోచనలను మరింత బలోపేతం చేస్తుందని విశే్లషకులు చెబుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో కూడా ఫ్రాన్స్ అనుకూల వైఖరినే మాక్రన్ బలంగా చాటిచెప్పారు. ఆయనకే ప్రజలు పట్టంగట్టడం ఒక రకంగా ఐరోపా యూనియన్ ఐక్యతను ఫ్రాన్స్ ప్రజలు మరింత బలపరచడమే అని భావించకతప్పదు. మొదటి నుంచీ కూడా దేశ రాజకీయాలను పునశ్చరణ చేయడం ద్వారా బలమైన భవితవ్యాన్ని అందించగలమన్న నమ్మకాన్ని ఆయన అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా హోలాండ్ సారథ్యంలోని సోషలిస్టు ప్రభుత్వం పట్ల ఏ కారణాల వల్ల ప్రజలు ప్రతికూలంగా మారారో లోతుగా గమనించిన మాక్రన్ దానికి విరుగుడుగా ప్రజలను ఆకట్టుకునే విధానాలనే తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు పట్టం గట్టిన ప్రజలను మాక్రన్ ఏ విధంగా ఆకట్టుగలుగుతారు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెట్టుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తానని, కార్మికులకు మరింత ఊరట కల్పించేలా చట్టాలను సవరిస్తానని చెప్పిన ఆయన పెన్షన్ వ్యవస్థను కుడా ప్రజలకు మరింత మేలు చేసే రీతిలోనే తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అయితే ఐరోపా యూనియన్ ఐక్యతకు ఆయన ఎంత అనుకూలంగా ఉన్నారో నాటో విషయంలోనూ అంతే పట్టుదలగా ఉన్నారు. విదేశాంగ విధానం, రక్షణ వ్యూహాలకు సంబంధించి మాక్రన్ దూకుడుగా వెళ్లే అవకాశం కనిపించడలేదు. అంతే ఇప్పటి వరకూ ఏఏ దేశాలతో ఫ్రాన్స్ సత్సంబంధాలను ఆర్థిక, రాజకీయ, వ్యాపార బంధాన్ని కొనసాగిస్తుందో అదే పంథాలో మాక్రన్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మాక్రన్ ఎన్నిక పాత రాజకీయ ముఖాలతో దశాబ్దాలుగా విసుగెత్తిపోయిన ఫ్రాన్స్ ప్రజలకు ఓ కొత్త కెరటమే. ప్రస్తుతం ఉన్న ఏడు పారిశ్రామిక దేశాల(జి-7) అధ్యక్షులు అందరికంటే కూడా ఆయనే పిన్న వయస్కుడు.

చిత్రం..మాక్రన్ దంపతుల అభివాదం

-బి.రాజేశ్వర ప్రసాద్