స్పాట్ లైట్

మలుపు తిరిగిన మైత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయంగా అన్ని కీలక దేశాలతో ఆర్ధిక, రాజకీయ వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకోవాలన్న భారత్ ప్రధాని నరేంద్రమోదీ ఆశయానికి ఒక స్పష్టత చేకూరుతోంది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ఇరుగుపొరుగు వైరుధ్యాలకు ఆస్కారం ఇవ్వకుండా అందరితో మనం, మనతో అందరూ అనే సామరస్య ధోరణితో సాగుతున్న నరేంద్రమోదీ విదేశీవ్యూహం మంచి ఫలితాలను ఇవ్వడమేగాక, అనన్యమైన రీతిలో ఆర్ధిక, రాజకీయ వ్యూహాత్మక ఫలితాలను అందిస్తోంది. పశ్చిమ ఆసియాలో అత్యంత శక్తివంతమైన, కీలకమైన వ్యూహాత్మకమైన దేశంగా ఉన్న ఇజ్రాయిల్‌తో భారత్‌కు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ మూడేళ్లలో ఎనలేని సాన్నిహిత్యం ఏర్పడింది. పాలస్తీనా వ్యవహారం నిరంతర అగ్నిని రాజెయ్యడం ఇజ్రాయిల్‌కు భారత్ అత్యంత సన్నిహితం కాకపోవడానికి ఇనే్నళ్లుగా ప్రధానకారణమైనప్పటికీ, తాజా పరిస్థితులు, పరిణామాలు ఒక్క అంశంతో ముడిపడి కాకుండా సమగ్ర దృక్పథంతోనే మైత్రీ బంధం అన్న భారత్ భావనకు అద్దం పట్టింది. అందుకే పాలస్తీనా వ్యవహారం ఒక కొలిక్కి రాకపోయినా, అక్కడి ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలన్న తమ ఆలోచనను, అభిలాషను మార్చుకోకుండానే ఇజ్రాయిల్‌తో లోతైన సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ సిద్ధపడింది. ఇటీవల మోదీ ఇజ్రాయిల్‌లో పర్యటించి ఇరు దేశాల సాన్నిహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన నేపథ్యంలో ఆదేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆరు రోజుల పర్యటనార్ధం భారత్‌కు రావడం ద్వైపాక్షిక సంబంధాల ప్రక్రియలో సరికొత్త శకం. నిన్న మొన్నటి వరకూ ఇజ్రాయిల్‌తో సన్నిహితంగా ఉంటే రాజకీయంగా ఇరుకున పడిపోతామనే ఆందోళనను పక్కన పెట్టి దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయిల్‌తో మైత్రికి భిన్న రంగాల్లో పరస్పర సహకారానికి మోదీ తెరతీశారు. అనేక అంశాలపై ఇరు దేశాలకు ఎన్నో విబేధాలున్నాయి, అవేవీ కూడా పరస్పర వ్యాపార వాణిజ్య సంబంధాలకు అవరోధం, ఆటకం కావన్న స్నేహ స్ఫూర్తికి నెతన్యాహు తాజా పర్యటన అద్దం పట్టింది. ముఖ్యంగా ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై పాతికేళ్లు పూర్తయిన సందర్భంలోనే నెతన్యాహు భారత్ రావడం సరికొత్త స్ఫూర్తిదాయక పరిణామంగానే భావించవచ్చు.
అగ్రస్థానానికి సంబంధాలు
ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైరుతిలో ఈజిప్టు దేశాలతో కలిసి ఉన్న నైరుతి ఆసియా దేశం ఇజ్రాయిల్. భారత్‌తో సత్సంబంధాల్లో అగ్రస్థానానికి చేరుకుంటోంది. సాంస్కృతిక, సంప్రదాయ, పురాతన చరిత్రలో భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉన్న ఇజ్రాయిల్‌తో వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష పరిశోధన, నీటి యాజమాన్యం, విదేశాంగ విధానం, రక్షణ రంగాల్లో భారత్ సరికొత్త సంబంధాలకు తెరతీసింది. దశాబ్దాలుగా పట్టించుకోని దేశం భారత్‌కు అత్యంత ఆత్మీయంగా మారింది. ఆర్ధిక, సాంకేతిక రంగాలకు కీలకమైన ఇజ్రాయిల్ పట్టణం టెల్ అవివ్‌తో భారత్ కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. 1950 నుండి 1990 వరకూ ఇజ్రాయిల్‌తో భారత్‌కు మంచి సంబంధాలు లేకున్నా , 1992లో అప్పటి ప్రధాని పివి నర్సింహారావు హయాంలో భారత్- ఇజ్రాయిల్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. 1992 నుండి నేటి వరకూ ఇజ్రాయిల్- భారత్ అనేక అంశాల్లో కలిసి పనిచేస్తున్నాయి. భారత్‌కు అతిపెద్ద మిలటరీ వస్తువుల విక్రయదారుల్లో ఇజ్రాయిల్ కూడా ఒకటి. రష్యా, అమెరికా తర్వాత ఇజ్రాయిల్ భారత్‌కు అతిపెద్ద మిలటరీ సరఫరాదారుగా మారింది. రక్షణ రంగంలో ఇజ్రాయిల్ సహకారాన్ని ఎపుడూ భారత్ కోరుకుంటోంది. ఆయుధాల సరఫరాతో పాటు భారత్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న ఇజ్రాయిల్ నిఘా సమాచారం అందించడంలోనూ కీలకంగా మారింది. ఇస్లామిక్ తీవ్రవాదానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్న ఇరు దేశాలు పరస్పర చర్చలతో మరో అడుగు ముందుకు వేశాయి. రక్షణ రగంలో భారత్ ఇజ్రాయిల్ మధ్య బంధం ఇప్పటికే పటిష్టం అయింది. ఇజ్రాయిల్‌తో సుమారు 17వేల కోట్ల రూపాయిల భారీ ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. మధ్య తరహా క్షిపణుల కొనుగోలుకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. ఇజ్రాయిల్ ఇండస్ట్రీతో కలిసి భారత్ రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ వీటిని అభివృద్ధి చేస్తుంది. ఈ క్షిపణుల ద్వారా భారత గగన తలం వైపు చొచ్చుకు వచ్చే శత్రు విమానాలు , ద్రోన్లు , గస్తీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూల్చేయవచ్చని రక్షణ శాఖ చెబుతోంది. భారత నేవీకి సంబంధించి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టం పేరుతో మరో కార్యక్రమం కూడా చేపట్టనుంది. ఐదు విభాగాల్లో 40 ఫైరింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేస్తారు. అనుమతి లేకుండా భారత గగనతలంలోకి ప్రవేశించే శతృవిమానాలు, ద్రోన్లను అడ్డుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ఆకాశంలో 50 నుండి 70 కిలోమీటర్లు దూరంలోని శత్రు దేశాల నిఘా విమానాలను ఈ క్షిపణులతో కూల్చి వేసేందుకు వీలుంటుంది. ఇంకో పక్క వ్యవసాయం, ఫార్మా రంగాల్లో కూడా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి.
ప్రోటోకాల్ పక్కన పెట్టి నెతన్యాహుకు స్వాగతం
భారత ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు భారత ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు. బెంచిమన్ నెతన్యాహుతో ఆయన సతీమణి సారా, వివిధ రంగాలకు చెందిన 300 మంది నిపుణులు, ప్రతినిధులు, అధికారుల బృందం కూడా భారత్‌కు వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం భారత్‌కు చేరుకున్న నెతన్యాహు బృందం విదేశాంగ మంత్రితో భేటీ అయింది. రెండోరోజు రాష్టప్రతితో భేటీ అనంతరం మహాత్మాగాంధీ స్మారకస్థూపాన్ని సందర్శించింది. భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం మరోమారు రాష్టప్రతిని సందర్శించి చర్చలు జరిపింది. మూడో రోజు ఆగ్ర సందర్శించి తాజ్‌మహల్‌ను తిలకించారు. అక్కడే కాసేపు అమర్ విలాస్‌లో విశ్రాంతి తీసుకుని యుపి ముఖ్యమంత్రితో కలిసి చర్చలు జరిపి నాలుగో రోజు అహ్మదాబాద్‌కు చేరుకుంది. సబర్మతీ ఆశ్రమం సందర్శించి అనంతరం ఐ క్రియేట్ సదస్సులో ఈ బృందం పాల్గొంది. 18వ తేదీన ముంబైలో పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతుంది. నారీమన్ హౌస్‌ను సందర్శించి, సలాం బాలీవుడ్ కార్యక్రమంలో పాల్గొంటుంది. అనంతరం ఇజ్రాయిల్ ప్రధాని పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనతో ఇరు దేశాలు సరికొత్త చరిత్ర సృష్టించనున్నాయి.

- బి వి ప్రసాద్