స్పాట్ లైట్

ఉమ్మడి శక్తితోనే సవాళ్లకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక దేశ అంతర్గత శక్తి యుక్తి అన్నది అంతర్జాతీయ వేదికలపై అది అనుసరించే వ్యూహం, విధానాలను బట్టి ఆధారపడి ఉంటాయి. కేంద్రంలో మోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు దేశాలతోపాటు సంపన్న దేశాలు, మధ్య స్థాయి దేశాలతో బలమైన, స్థిరమైన మైత్రీబంధాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి. ముఖ్యంగా భారత ప్రధానిగా ఇంతకుముందు ఎవరూ పర్యటించనంత విస్తృత స్థాయిలో ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించి, మారిన భారతదేశ విధానాలను, ఆలోచనలను చాటిచెప్పిన మోదీ ఆగ్నేయాసియా దేశాలతో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సాన్నిహిత్యాన్ని బలోపేతం చేశారు. ప్రాచ్య దృక్కోణం పేరుతో మొదలైన ఈ విధానం తాజాగా స్థిరమైన కార్యాచరణకు చేరుకుంది. ఆగ్నేయాసియా దేశాలకు చెందిన నేతలను భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథులుగా ఆహ్వానించడం ఈ దేశాలతో భారత్ ఎంత లోతైనా బంధాన్ని కోరుకుంటోందో తెలియజేసే పరిణామం. దేశాల మధ్య సంబంధాలన్నవి ఎప్పటికప్పుడు పదునుదేరకపోతే ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా అవి నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే ఆసియానే దేశాలతో భారత్ కొనసాగిస్తున్న బంధం గత 25 సంవత్సరాలుగా కొత్త శక్తిని యుక్తిని సముపార్జించుకుంటూనే వస్తోంది. అందుకు కారణం ఏటేటా ఈ దేశాలతో మైత్రిని పెంపొందించుకునే చర్యలకు ప్రాధాన్యతను ఇవ్వడం, ఒక దేశం ఒక కూటమితోకాని, ఒక కూటమి మరో దేశంతో గాని ఇంత గాఢమైన మైత్రీ బంధాన్ని కలిగివుండడం భారత, ఆసియాన్ విషయంలోనే జరిగిందని చెప్పడం అతిశయోక్తి కాదు. 2012లో ఆసియాన్ దేశాలతో వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక, భద్రతాపరమైన సంబంధాలను మెరుగుపరచుకునేందుకు కీలక ఒప్పందం కుదిరింది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకూ ఆ ఒప్పందం ఏ మేరకు పురోభివృద్ధి సాధించిందన్నది స్పష్టం కాని పరిస్థితే. వర్తమాన ప్రపంచంలో ఏ దేశం తనంతట తానుగా అంతర్జాతీయంగా రాణించే అవకాశం ఉండదు. ఉమ్మడి శక్తితోనే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చునన్న వాస్తవాన్ని ఐరోపా యూనియన్ సహా అనేక కూటములు రుజువు చేశాయి. ఆసియాన్ కూడా అదే తరహాలో తన ఉనికిని చాటుకుంటూ రావడం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగింది. ఇంత బలమైన కూటమిగా ఉన్నప్పటికీ ఆసియాన్‌తో భారత వ్యాపార, వాణిజ్య బంధం అనుకున్న స్థాయిలో సాగలేదన్నది వాస్తవం. ఈ కూటమిలోని మొత్తం పది దేశాల ఉమ్మడి జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లయితే ఈ దేశాలతో భారత వాణిజ్యం కేవలం 76 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ఈ దేశాలతో మైత్రీ బంధం కొనసాగుతున్న వ్యాపార, వాణిజ్యపరంగా మాత్రం అనుకున్న స్థాయిలో, విస్తరించాల్సిన రీతిలో ఎదుగుదల కనిపించలేదు. ఈ లోపాన్ని తక్షణ ప్రాతిపదికన భర్తీ చేసుకుని ఆసియాన్‌తో వ్యాపార వాణిజ్య బంధాన్ని పెంపొందించుకోవడం అన్నది భారత్‌కు ఎంతైనా అవసరం. ముఖ్యంగా చైనా, ఐరోపా యూనియన్‌తో పోలిస్తే ఆసియాన్‌తో భారత వాణిజ్యం నామమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇంకెంతమాత్రం జాప్యం చేయకుండా తన ప్రాచ్య దృక్పథానికి పదునుబెట్టి దాన్ని కార్యాచరణ దిశగా మళ్లించాల్సిన అవసరం భారత్‌కు ఎంతైనా ఉంది. ముఖ్యంగా దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంతాన్ని, తూర్పు చైనా ప్రాంతాన్ని చైనా కబళించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్న నేపథ్యంలో భారత్ ఈ పది దేశాల కూటమితో మరింత సాన్నిహిత్యంతోపాటు భద్రతాపరమైన బంధాన్ని పెంపొందిచుకోవడం అన్నది తక్షణ అవసరంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా తన పట్టును బిగించేందుకు ప్రయత్నించిన చైనా అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదు. అటు ఫిలిప్పీన్స్ ఇటు వియత్నాం తదితర దేశాల విషయంలో దుందుడుకు స్వభావానే్న కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియాన్‌లో భాగమైన ఈ దేశాలతో భారత సంబంధాలు ఎంత దృఢంగా ఉంటే అంతగానూ ఉమ్మడి శక్తితో చైనాను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంతంలో చైనా ఆట కట్టించాలంటే భారత-ఆసియాన్ దేశాలు ఉమ్మడి దృక్పథంతో ముందుకు వెళ్లడం అన్నది ఎంతైనా అవసరం. చైనా తమ తీరప్రాంతాల విషయంలో రెచ్చిపోతున్నప్పటికీ ఫిలిప్పీన్స్ ఏమీ చేయలేని నిస్సహాయతలో పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంతో భారత్ ఎంత సన్నిహితమైతే అంతగానూ వ్యూహాత్మక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చైనా ఆదిపత్య ధోరణివల్ల, భారత్‌కు మిత్రదేశాలుగా ఉన్నవాటిని తమవైపు తిప్పుకునేందుకు చేపడుతున్న చర్యల వల్ల కలిగే నష్టం ఇప్పటికిప్పుడే కనిపించకపోయినా, రానున్న కాలంలో అది చాలా తీవ్రంగానే ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చైనా ధోరణి విషయంలో అనేక సందర్భాల్లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో బలమైన, స్థిరమైన శాంతియుత పరిస్థితి నెలకొనాలంటే భారత్ క్రియాశీలక రీతిలో వ్యవహరించక తప్పదన్న సంకేతాలను ఆయన అందించారు. ఇందులో భాగంగానే భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో కలిసి ఇటీవల వాడ్రిలాటిరల్ ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆసియాన్‌లో ఉన్న చిన్న దేశాలకు బలమైన ధీమాను అందించే అవకాశం ఉంటుందన్నది ఎంతైనా వాస్తవం. గతంలో ఎన్నడూ లేని రీతిలో అంతర్జాతీయంగా భారత్ తన సత్తాను చాటుకుంటోంది. ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఎదగడమే కాకుండా అనేక అంతర్జాతీయ విషయంలోనూ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ తన స్థాయిని, హోదాను, పలుకుబడిని పెంచుకుంటూనే వస్తోంది. పర్యావరణ పరిరక్షణతోపాటు అనేక అంతర్జాతీయ కీలక అంశాలపై భారత్ వ్యూహాన్ని ప్రపంచ దేశాలు అనుసరించడం ఇందుకు నిదర్శనం. చైనా ఎంతగా భారత్ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేసినా భారత్ మిత్రదేశాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినా అవి అంతిమంగా ఎలాంటి ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే భారత నాయకత్వం నిర్ణయాత్మక రీతిలో వ్యవహరించాలి. ఆ రకమైన సంకేతాలనే ఎన్డీయే సర్కార్ ప్రపంచ దేశాలకు అందిస్తోందని చెప్పడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. పది ఆసియాన్ దేశాల నేతలను భారత గణతంత్ర వేడుకలకు పిలవడం అన్నది ఓ చారిత్రక పరిణామమే కాదు.. రాబోయే కాలంలో భారత శక్తియుక్తుల విస్తృతికి అద్దం పట్టేదే అవుతుంది. ఆసియాన్‌తో ఏర్పడ్డ ఈ పాతికేళ్ల బంధం మరింత ముందుకు సాగాలంటే ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను కార్యాచరణ దిశగా మళ్లించడం ఒక్కటే మార్గం. దీనివల్ల ఉభయతారకమైన రీతిలో ప్రయోజనాలు ఒనగూర్చుకునే అవకాశం ఉంటుంది. మరోపక్క చైనాను నిలదీయడానికి ఎత్తుకు పైఎత్తు వేసి దాని కుయుక్తులను చిత్తు చేయడానికి భారత వ్యూహం దోహదం చేస్తుంది.

బి.రాజేశ్వర ప్రసాద్