స్పాట్ లైట్

సిరియాపై సై అంటే సై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరియాపై జరిగిన రసాయన ఆయుధ దాడి ఇటు అమెరికా అటు రష్యాల మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణలకు ఆజ్యం పోస్తోంది. దశాబ్దాలుగా అంతర్వుద్ధంలో అట్టుడుకుతున్న సిరియాను రష్యా వెనకేసుకురావడం, తాజా ఘటన నేపథ్యంలోనూ బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో అమెరికా రంగంలోకి దిగాల్సి వచ్చింది. నిన్నమొన్నటి వరకూ సిరియా విషయంలో అంటీముట్టనట్టు వ్యవహరించిన అమెరికా ఒక్కసారిగా అసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు క్షిపణులు దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా క్షీణించింది. మొదటి నుంచీ రష్యాతోపాటు ఇరాన్ కూడా సిరియాకు మద్దతుగా నిలుస్తూ వచ్చింది. ఇప్పటికే సిరియాకు సంబంధించి అమెరికా చేపట్టిన చర్యలు దాని సార్వభౌమత్యాన్ని భంగపరిచేలే ఉన్నాయని మళ్లీ ఈ తరహా ఘాతుకాలకు ఒడిగడితే ప్రతిచర్యలూ తీవ్రంగానే ఉంటాయని ఇటు రష్యా అటు ఇరాన్‌లు ఏకకాలంలో హెచ్చరించడం మరోసారి ఒకప్పటికి అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధానికి ఆజ్యం పోసేదే అవుతుందా?అన్న అనుమానాలకు ఆస్కారం అవుతోంది. అమెరికా చర్యలు ఇప్పటికే ‘రెడ్‌లైన్’ దాటేశాయని ఇక ఏ మాత్రం అలాంటి వాటిని సహించేది లేదని కూడా సిరియా అధ్యక్షుడు అసాద్‌ను బలపరుస్తున్న కూటమి ఓ ప్రకటనలో స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయడం తగదని, ఆ దేశ అధ్యక్షుడు ఈ తరహా చర్యలకు పాల్పడితే తమ సత్తాచూపిస్తామని ఈ కూటమి హెచ్చరించింది. మరోపక్క సిరియాను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న లక్ష్యంతో రష్యాకూడా తమ యుద్ధనౌకను మధ్యదరా సముద్రం ద్వారా ఆ దేశ తీరాలకు చేర్చడం కూడా ఆందోళన కలిగించే పరిణామం. కేవలం అమెరికానే కాకుండా బ్రిటన్,ఫ్రాన్స్‌లు కూడా అసాద్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాల దాడికి పాల్పడినందునే అనేక మంది పిల్లలు సహా 70 మంది మరణించినట్టుగా స్పష్టం చేశాయి. సిరియాకు వ్యతిరేకంగా అమెరికా సారధ్యంలో పశ్చిమ దేశాలు సంఘటితమవుతున్నాయో అంతగానూ అసాద్‌ను వెనకేసుకొచ్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ నాయకుడు హసన్ రోహానీలు సన్నద్ధమవుతున్నారు.
సిరియాలో ఉన్న రసాయన ఆయుధాలు అన్నింటినీ ధ్వంసం చేస్తామని నాలుగేళ్ల క్రితమే రష్యా హామీ ఇచ్చిందని, ఆ చర్యలు చేపట్టకపోగా తాజా దాడిని సమర్ధించడం విడ్డూరంగా ఉందంటూ అమెరికా మరింత తీవ్ర స్వరంతోనే స్పష్టం చేసింది. ఎప్పుడు సిరియా వ్యవహారం వేడెక్కిన అది అమెరికా, రష్యాల మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణలకు ఆజ్యం పోసేదే అవుతోంది. ముఖ్యంగా ఈ తాజా దాడి గనక రష్యా హస్తం ఉందని కూడా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ చెప్పడం ఒక్కసారిగా పరిస్థితి తీవ్రతను పెంచింది. అంతర్జాతీయంగా ఇతర దేశాలు జోక్యం చేసుకుని సిరియా విషయంలో రాజీ ప్రయత్నాలను, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించకపోతే అది అమెరికా, రష్యాల మధ్య కచ్చితంగా సంఘర్షణలకు దారితేసేదే అవుతుందని వాస్తవం. ఇరుదేశాల మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్నాయని చెప్పడానికి అనేక క్షిపణులతో కూడిన యుద్ధ నౌకను రష్యా తరలించడమే నిదర్శనమంటున్నారు. రష్యాకు చెందిన ఆరు యుద్ధ నౌకల్లో అడ్మిరల్ గ్రిగోరిక్‌గా పేర్కొనే ఈ యుద్ధనౌక అత్యంత శక్తివంతమైంది. ఇప్పటికే మధ్యదరా సముద్రంలో నాలుగు యుద్ధ నౌకలను రష్యా మోహరించింది. ఈ ప్రాంతంలో మోహరించిన యుద్ధ నౌకల నుంచే అమెరికా సిరియాపై క్షిపణి దాడులకు ఒడిగట్టింది. అనేక విమానాలు, భవనాలను ధ్వంసం చేసింది.

చిత్రాలు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,
*సిరియా తీరంవైపు వెళుతున్న రష్యా యుద్ధనౌక అడ్మిరల్ గ్రిగోరిక్
*రష్యా అధ్యక్షుడు పుతిన్

-బి.రాజేశ్వరప్రసాద్