స్పాట్ లైట్

అఫ్గాన్‌ను..దండుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతిరూపంగా ఉన్న అమెరికా సాయం చేసినా దాని వెనుక ఓ స్వార్థం ఉంటుంది. ఓ చేతకాని దేశానికి చేయూతనిచ్చినా అందుకు ఓ బలమైన కారణమూ ఉంటుంది. 9/11 దాడి నేపథ్యంలో అమెరికా ఏకకాలంలో రెండు యుద్ధాలు చేసింది. ఓపక్క ఇరాక్‌పైనా, మరోపక్క అఫ్గాన్ పైనా సంకీర్ణ దళాల సాయంతో విరుచుకుపడింది. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ పాలనను అక్కడి ప్రజలచేతే అంతం చేయించిన అమెరికా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకుండానే చేతులెత్తేసింది. అంటే నడిసముద్రంలో నావ చందంగా ఇరాక్ పరిస్థితి ఏర్పడింది. ఆ అనిశ్చితినుంచి పుట్టుకొచ్చిందే ఐసిస్ అనే అల్‌ఖైదాను తలదనే్న ఉగ్రవాద సంస్థ. దాని ప్రకంపనలు, ప్రతిరూపాలు, ఉగ్ర చేష్టలు ప్రపంచ దేశాలు అనేక కోణాల్లో ఇప్పటికీ చవిచూస్తూనే ఉన్నాయి. తాజా బార్సిలోనాలో జరిగిన దాడి కూడా ఐసిస్ ప్రాబల్యానికి మరో ఉదాహరణ. ఇరాక్‌లోని కీలక పట్టణాలనుంచి దాన్ని తరిమేసిన ఇతర ప్రాంతాలకూ అది విస్తరిస్తోంది. అవకాశం చిక్కినప్పుడల్లా ఉనికిని చాటుకుంటోంది. ఇరాక్ పరిస్థితి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కొనసాగుతున్న నేపథ్యంలో పదహారేళ్లపాటు అఫ్గాన్‌లో చేసిన యుద్ధం వల్ల తనపై పడ్డ భారాన్ని మరో రకంగా దించుకునేందుకు ఆర్థిక నష్టాన్ని అఫ్గాన్ వనరులను చేజిక్కించుకోవడం ద్వారా పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పదహారేళ్ల యుద్ధానికి అఫ్గాన్ పునర్నిర్మాణ ప్రయత్నాలకు అమెరికాకు ఏకంగా 117 బిలియన్ డాలర్ల ఖర్చయింది. దీన్ని రాబట్టుకోవాలంటే అఫ్గాన్ నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి అక్కడి వనరులను చేజిక్కించుకోవడం ద్వారానే కాగల కార్యాన్ని చక్కబెట్టాలని అమెరికా భావిస్తోంది. అయితే అమెరికా అనుకున్నంత తేలికగా అఫ్గాన్ వనరులు దానికి అందుతాయా? ఒకవేళ అందిపుచ్చుకున్నా వాటిని అభివృద్ధి చేసే లాభదాయకంగా మలుచుకునేందుకు ఇనె్వస్టర్లు ముందుకొస్తారా? ప్రపంచలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా భావిస్తున్న అఫ్గాన్‌లో మనుగడే కష్టమయ్యే పరిస్థితుల్లో వందలకోట్ల పెట్టుబడులతో వ్యాపారాన్ని చేయడానికి ఎవరో వస్తారనుకుంటే అది పగటికలేనన్నది వాస్తవం. అయితే ఇనె్వస్టర్ల మాట ఎలా ఉన్నా అమెరికా మాత్రం అసలు అఫ్గాన్‌లో అందుబాటులో ఉన్న వనరులు ఏమిటి? వాటిని ఏవిధంగా వ్యాపారాత్మకంగా మార్చుకోవచ్చునన్నదానిపై సర్వే జరిపింది. పదేళ్ల క్రితమే అమెరికా భౌగోళిక సర్వే సంస్థ అఫ్గాన్‌లో ఉన్న అనేక రకాల నిక్షేపాల పరిమాణాన్ని వాటి విలువను అంచనా వేసింది. దాదాపుగా ఇవి ఒక ట్రిలియన్ డాలర్ల మేర ఉండవచ్చునని సంకేతాలు అందించింది. అఫ్గానిస్తాన్ కూడా ఈ వనరులపైనే తన ఆర్థిక భవితవ్యాన్ని ముడిపెట్టుకుంది. బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ముడి ఖనిజం యురేనియం, జింక్, బాక్సైట్, బొగ్గు గనులు, సహజవాయు నిక్షేపాలు కూడా అఫ్గాన్‌లో అపారంగా ఉన్నాయి. ముఖ్యంగా తగరపు నిల్వలు అత్యంత గణనీయమని కూడా ఈ సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తగరం నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో ఇవి అఫ్గాన్‌లో అపారంగా ఉండటమే అక్కడి వనరులపై అమెరికా దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల్లో వినియోగిస్తున్న లిథియం నిల్వలు కూడా అఫ్గాన్‌లో అపారంగా ఉన్నాయి. ఇంతగా ప్రకృతి వనరులు మేట వేసినా అన్నివిధాల ఆర్థిక శక్తిని పుంజుకునేందుకు అవసరమైన నిక్షేపాలు ఉన్నా వాటిని అఫ్గానిస్తాన్ సద్వినియోగం చేసుకోలేకపోవడానికి కారణం దశాబ్దాలుగా కొనసాగుతున్న అనిశ్చితి, అరాచక పరిస్థితులే. సరైన రహదారులు లేకపోవడం, అవినీతి తీవ్రం కావడం, అదుపులోకి రాని తీవ్రవాదం, ఇటు తాలిబన్, అటు అల్‌ఖైదాలు చాలా ప్రాంతాల్లో పట్టును కలిగి వుండటం ఈ ప్రకృతి వనరులను వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తింది. నిజానికి 1980 దశకంలో అఫ్గానిస్తాన్‌ను సోవియట్ యూనియన్ ఆక్రమించుకున్న సమయంలోనే అక్కడి వనరులకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు బయటపడ్డాయి. అసలు అఫ్గాన్‌లో గనుల తవ్వకాలే జరగడం లేదని, ఒకవేళ అటువంటి తవ్వకాలు చేపట్టినా అవి ఏదో ఒక దశలో ఆగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక సంస్థలు అఫ్గాన్‌లో ప్రకృతి వనరుల నిక్షేపాలను తవ్వి తీసేందుకు ఉత్సాహాన్ని చూపించినా అక్కడి పరిస్థితులు అందుకు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి అఫ్గాన్‌పై పడింది. పదహారేళ్లపాటు అఫ్గాన్ యుద్ధం పేరిట ఖర్చు చేసిందంతా ఈ వనరులను చేజిక్కించుకోవడం ద్వారా రాబట్టుకునేందుకు బలమైన పథకమే వేస్తున్నారు. అయితే అఫ్గానిస్తాన్ ఆర్థిక శక్తిని పునరుద్ధరించాలన్నదే ట్రంప్ ఆలోచన వెనుకనున్న ఉద్దేశమని చెబుతున్నప్పటికీ అది అనుకున్నంత నిష్పాక్షికంగా ఉండదన్నది ఎంతైనా వాస్తవం.

బి.రాజేశ్వర ప్రసాద్