స్పాట్ లైట్

విశ్వాంతరాళంల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త సాంకేతిక విజ్ఞాన పాటవం ఎప్పటికప్పుడు మానవ మేథస్సును కొంత పుంతలు తొక్కిస్తోంది. నాగరికత నేర్చిన మానవుడు తన పరిసరాలను చక్కదిద్దుకోవడంతోపాటు తన ఉనికినీ ప్రశ్నించుకుంటూ వచ్చాడు. తనలాగా ఇతర గ్రహాల్లో కూడా జీవజాతులు ఉన్నాయా? భూ వాతావరణానికి ఇతర గ్రహాల స్థితిగతులకు మధ్య ఉన్న తేడా ఏమిటి? అనే జిజ్ఞాస రోదసీ శోదనకు ప్రేరకంగా మారింది. 50వ దశకంలో రష్యా స్పుత్నిక్‌ను ప్రయోగించినా, 60వ దశకం ద్వితీయార్థంలో ఏకంగా అమెరికా చంద్రుడిపై అడుగుపెట్టినా దాని అర్థం పరమార్థం భూమికి మిలియన్‌కొద్దీ మైళ్ల దూరంలో ఉన్న గ్రహాల ఆనుపానులను తెలుసుకోవాలన్న ఆలోచనే. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన నాటినుంచి ఇప్పటివరకూ రోదసీ అధ్యయనం ఎంతగానో పదునెక్కింది. మన సౌర వ్యవస్థలోనే కాకుండా సౌర వ్యవస్థ ఆవల ఉన్న గ్రహాలు, నక్షత్ర మండలాల గురించి కూడా మనిషి అవగాహన పెంచుకున్నాడు. అంతకుముందెన్నడూ ఊహించని ఎన్నో విశ్వ రహస్యాలను కరతలామలకం చేసుకున్నాడు. అంతుబట్టని ఈ జిజ్ఞాస ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలకు దారితీయడమే గాకుండా, మన రోదసీలో ఉన్న గ్రహ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి దోహదం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే అమెరికా అంగారకుడిపైకి క్యురియోసిటీ రోవర్‌ను పంపింది. గత కొన్ని సంవత్సరాలుగా అది అందించిన వివరాలెన్నో ఇతర గ్రహ వాతావరణం గురించి అక్కడి పరిస్థితుల గురించి లోతైన అవగాహనను కలిగించాయి. ఆ ప్రయత్నంలో భాగంగా 20 ఏళ్ల క్రితం ప్రయోగించిందే కాసినీ వ్యోమనౌక. ఆ ప్రయోగ లక్ష్యం అత్యంత సుదూరమైన శనిగ్రహం లోతుల్లోకి వెల్లడం, దాని ప్రత్యేకతల గురించి తెలుసుకోవడం, అక్కడి వాతావరణం గురించి అవగాహన ఏర్పరచుకోవడం, అన్నింటికీ మించి ఈ గ్రహానికున్న అనేక ‘చంద్రుళ్ల’ గురించి తెలుసుకుని అనూహ్య రీతిలో విశ్వరహస్యాలను కళ్లకు కట్టడమే. అంతకుముదెన్నడూ లేని రీతిలో శని గ్రహానికి సంబంధించి ఎన్నో వివరాలను ఈ వ్యోమనౌక అందించింది. ఈ గ్రహానికి వలయాలు ఎందుకున్నాయి? అందుకు కారణం ఏమిటన్నదానిపైనా ఎంతో కీలక సమాచారాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు అందించింది. ఈ వ్యోమనౌక అందించిన వివరాలు ఒక్క శనిగ్రహానికి సంబంధించే కాకుండా ఎన్నో రకాలుగా ఇతర గ్రహాలను పరిశోధించడానికి, వాటి నేపథ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు రెండు దశాబ్దాలపాటు శనిగ్రహానికి సంబంధించి అత్యంత కీలక సమాచారాన్ని, ఛాయాచిత్రాలను అందించిన కాసినీ వ్యోమనౌక ఈ గ్రహ వాతావరణంలో మసైపోయినా అది చివరిక్షణం వరకూ అందించిన వివరాలు మాత్రం మనిషి తన రదసీ అధ్యయన సౌధాన్ని నిర్మించుకోవడానికి కచ్చితంగా ఉపయోగపడేవే అవుతాయి. ఈ వ్యోమనౌక అనుకున్న లక్ష్యాలను సాధించగలిగిందా? ఏ ఉద్దేశంతో ఈ ప్రయోగ లక్ష్యాన్ని చేపట్టారో అవి నెరవేరిందా? అన్నది కచ్చితంగా చెప్పలేకపోయినా అది అందించిన సేవలు మాత్రం నిరుపమానమైనవే. ఏ విధంగా చూసినా ఇప్పటివరకూ జరిపిన రోదసీ ప్రయోగాలన్నింటిలోనూ కాసినీ వ్యోమనౌక ప్రయోగం అన్నది అత్యంత ఘనమైన, నిరుపమానమైన రోదసీ అధ్యయమేనని చెప్పాలి. 1997లో కేప్ కనేవరల్ నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. ఏడు సంవత్సరాలపాటు ప్రయాణం చేసి ఇది శనిగ్రహాన్ని చేరుకుంది. మొదట్లో కేవలం శనిగ్రహాన్ని దాని చంద్రుళ్లను అధ్యయనం చేయడానికి మూడేళ్ల కాలవ్యవధిపాటే పని చేస్తుందన్న ఉద్దేశంతో ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. అందులోని ప్రతి పరికరం చెక్కుచెదరకుండా పనిచేయడంతో మరో పదేళ్లపాటు దీని పరిశోధనా గడువును పొడిగించారు. ఇనే్నళ్ల పరిభ్రమణలో ఈ వ్యోమనౌక మానవాళి ఊహకే అందని ఏడు కొత్త చంద్రగ్రహాలను కనిపెట్టింది. వీటిలో ఆరంటికి పేర్లు పెట్టారు కూడా. అలాగే శనిగ్రహ ఉపరితలంపై ఉప్పెనలు, ఉత్పాతాలు ఏ విధంగా చెలరేగుతాయి అన్న అంశంపైనా ఇది కీలక సంకేతాలను అందించింది. అన్నింటికంటే మించి అత్యద్భుతమైన గ్రహ వలయాలకు సంబంధించి కూడా పరిశోధన జరిపింది. గత కొంత కాలంగా ఇతర గ్రహాల్లో మానవాళి జీవించడానికి ఏ రకమైన అవకాశం ఉందన్న దానిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. భూమి మాదిరిగా సమశీతోష్ణత కలిగిన వాతావరణం ఏ గ్రహాల్లో ఉందన్న దానిపై ఇప్పటికే శాస్తవ్రేత్తలు ఎంతో సమాచారాన్ని సేకరించారు. శనిగ్రహంపై కాకుండా శనిగ్రహ చంద్రుడైన ఎనె్సలాడస్ ఉపరితల లోతుల్లో ఓ మహాసముద్రమే ఉందన్న వాస్తవాన్ని కాసినీ వ్యోమనౌక అందించింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యోమనౌక సాధించిన లక్ష్యాల్లో శాస్తవ్రేత్తలు తదుపరి పరిశోధనలు చేయడానికి దోహదం చేసే పరిణామమిది. ఈ శని గ్రహ అధ్యయనంలో అనేక దేశాలు పాల్గొన్నాయి. ఈ అద్భుతమైన శాస్త్ర పరిశోధనా విజయానికి ప్రతి ఒక్కరి సహకారం, తోడ్పాటు ఉండడం వల్లే సమీకృత రీతిలో తదుపరి రోదసీ అధ్యయనాలు చేపట్టడానికి బలమైన బాట పడింది. శనిగ్రహ వాతావరణంలో ఈ వ్యోమనౌక అంతమైనా అది అందించిన రోదసీ పరిశోధనా వెలుగులు మాత్రం మానవాళి అంతరిక్ష జిజ్ఞాసకు ఎప్పటికప్పుడు ప్రేరణే అవుతాయి.