శ్రీవిరించీయం

నేలను నమ్మినవాడు - నయవంచన చేసినవాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అడపా తడపా పడ్డ తొలకరి జల్లుల మధ్య, కాలువలు కొత్త నీరోసుకుని నిండుగా వచ్చాయి. మొగి పొలాలకు దిగువ ఆకుమళ్లకి నీళ్లు వొదిలారు. మొగిమళ్లు అల్దాపల్టాగా తడుస్తున్నయ్. కొంగలు బారులు తీరి మునక్కుండా మిగిలి వున్న గడ్డల మీద కూర్చుని, నీటిలో తేలే పురుగుల్ని తింటున్నాయి. తెల్లటి ఎండా, నల్లటి భూమాత పనులు కొడుతున్న నీళ్లూ కొండలూ, గాలీ... అన్నీ ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పించాయి. గంగన్న ముఖం ఎత్తి తడుస్తున్న పొలాల వంక మరీమరీ చూశాడు. అతని కళ్లు చెమ్మగిల్లి, కన్నీళ్లు తపతపమని జారుతున్నాయ్’’- పల్లె వాతావరణం, వ్యవసాయ పనులతో బహుపరిచయం మటుకే వున్న వ్యక్తి వ్రాయగల వాక్యాలు ఇవి. తెలుగులో బాల సాహిత్యాన్ని అభ్యుదయ రచనలను సినిమా వ్యాసంగమూ వున్న శ్రీనార్ల చిరంజీవి (1925-1971) వ్రాసిన ‘కర్ర-చెప్పులూ’ అనే కథానికలో కనిపిస్తాయి రుూ వాక్యాలు. గంగన్న అనే అతను మారుమూల పల్లెలో రెండు ఎకరాల భూమి, భార్య, ఒక కూతురు, ఒక కొంప, అప్పు బాధలు లేని జీవితం గడుపుతూ వున్నవాడు. మరో గ్రామంలో షావుకారు అయిన రంగయ్య చనిపోతే అతని భార్య రావమ్మ అతన్ని పసిగట్టి అతన్ని తన ఊరుకు పిలిపించుకుని మాగాణి ముప్పయి ఎకరాలు, మెట్ట పదెకరాలు యావత్తు అతని యజమాయిషీలో పెట్టింది. కర్రా చెప్పులతో యిక్కడకు వచ్చిన గంగన్న రుూ ఆస్తిని కాపాడడమే కాకుండా కావలసిన హంగులన్నీ సమకూర్చుకుని ఇబ్బడి ముబ్బడి చేశాడు. రావమ్మ బంధువుల బలవంతానికి లొంగిపోయి యెవరేని కుర్రవాడిని దత్తత చేసుకుందామని నిర్ణయించుకుని గంగన్నను ‘పదమూడేళ్ల రాజన్న’ను ‘ఇంటర్‌వ్యూ’ చేయమని పంపిస్తుంది. దీనిలో నెగ్గిన రాజయ్య యా ఆస్తి కంతకూ ‘దత్తత పొందిన యజమాని అయిపోయాడు. బస్తీ చదువులు, సహవాసాలు యేర్పడిన తరువాత అతని నైజం అంతా మారిపోయింది. గంగన్న పరిస్థితి ఒక జీతగాడుగా మిగిలి పోయింది. తన స్వగ్రామంలో పొలం అమ్మి ఆ డబ్బుతో ఇక్కడ కొంత పొలం కొనుక్కుందామని ఊహ చేశాడు. తన డబ్బు రాజన్నకు రాతకోతలు జరపమన్నాడు. అయితే రాజన్న ‘వ్యవహర్త’ అయిపోయాడు కదా, పొలం తనపేరు మీదనే కొనేశాడు. విధి వైపరీత్యం.
భూమిని నమ్ముకున్నవాడు ఎవరూ చెడిపోలేదు అనేది సామెత. అయితే మనిషిని నమ్ముకున్న వాడిని గురించి యిలా చెప్పుకోలేం. మనిషి ఎక్కడున్నాడో అక్కడ ‘మంచితనం’ దిగజారిపోతుంది. మనుగడ కోసం ప్రయత్నించే మనిషి, మంచి, మర్యాద, కృతజ్ఞత,గౌరవభావం... యిటువంటి సద్లక్షణాలన్నీ మరచిపోతాడు, నాలుగు రాళ్లు చేతిలో అదనంగా చేరగానే. తాను కొనుక్కుందాం అనుకున్న భూమిని కళ్లతో చూచి కన్నీళ్లు కార్చడమే తప్ప మరింకేమీ చేయలేని దుస్థితిలో పడిపోయాడు గంగన్న. ‘నీకు రావలసిన దేమిటో అది తీసుకుని నీ దోవన నీవు పోరాదూ?? అనిపించుకున్నడు రాజయ్య చేత. ఆఖరకు తన చేతి కర్ర, కాళ్ల చెప్పులూ కూడా అక్కడే వదిలేసి తన పాకకు వెళ్లిపోయాడు. గంగరావిచెట్ల పొలం విషయం అడిగితే రాజయ్య యేం జవాబు చెప్పాడో చూడండి. ‘ఏమీ లేదు. ధరలు పడిపోతున్నాయి. అంచేత, అది నీ పేరనే కొంటే తీరా ధరలు పడిపోతే నువ్వు చింతిస్తావు. అంచేత- అది నా పేరనే రాయించాను’ అన్నాడు నిర్మొహమాటంగా. పొలం కాగితాలు కాదుకదా, యిక దానికోసం పెనుగులాడి ప్రయోజనం లేదని గంగన్నకు ఖరారయిపోయింది.
అతను తన పొలం సరిహద్దు-తనపొలం అనుకున్న సరిహద్దు- దగ్గరకు వెళ్లాడు. చీకటి పడిన అక్కడి నుండి కదలలేదు. పొలం చుట్టూ తిరుగుతూ పెద్ద కేకలు వేస్తూ ఎన్నో ప్రదక్షిణలు చేయడం పక్క పొలాల రైతులు విన్నారు. కానీ ఎవరికీ ఆనవాలు చిక్కలేదు. ‘తెల్లారి పొలంలో ఎత్తయిన మట్టి దిబ్బను వాటేసుకుని, నెత్తురు కక్కి పడివున్న గంగన్నను చూచి ఊళ్లో వాళ్లు కన్నీళ్లు తుడుచుకున్నారు’.
మోసం, దగా చేసిన ‘రాజయ్య పంచాయతీ బోర్డ్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక అయ్యాడు’ అన్న వాక్యంతో కథ ముగుస్తుంది.
యాభయి సంవత్సరాల క్రితం వ్రాసిన కథే అయినా- యిప్పటికీ మనిషి ప్రవర్తనలో మార్పు రాకపోవడం మనం గమనిస్తూనే వున్నాం. మనిషి మంచితనాన్ని మర్చి పోయినంతవరకూ యిటువంటి కథలు ఎన్నయినా జరుగుతాయి, కల్పనకు మించిన వాస్తవికతలను ప్రసరిస్తాయి. భూస్వాములు, కార్మికులను కర్షకులను రక్షించే వెనకటి మంచిరోజులు రావాలని కోరుకోవడం తప్ప, ప్రస్తుతానికి మనం చేయవలసింది యేమీ లేదు.
శ్రీ నార్ల చిరంజీవి బహు తక్కువ సంఖ్యలో కథలు వ్రాశారు. వాటిలో ‘కర్ర-చెప్పులూ’ ప్రధానమయినది అనిపిస్తుంది. అవి కూడా మిగలకుండా దుర్మరణం పాలయిన రైతు కథ! బాలగేయాలు, సాహిత్యం నిర్మించిన చిరంజీవి ‘టాల్‌స్టాయ్’ను తలపిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ‘మనిషికి ఎంత భూమి కావాలి’ అన్నది టాల్‌స్టాయ్ కథల్లో మిన్న అయినది. ‘ఆరు అడుగుల స్థలం’ సరిపోయే మనిషి కూడా ఆకాశానికి ఎగరాలనుకోవడం, ఉన్న దానిని సరిపుచ్చుకోలేక పోవడం అందులో వస్తువు.మనిషిని మనిషి అన్యాయం చేయడం- అకారణంగా తక్కువ చేయడం ఈ కథానికలో ముఖ్యాంశం.

- ‘శ్రీవిరించి’