శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెల్లూరు టిక్కెట్‌పైనే అందరి మనసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 10: నెల్లూరు అసెంబ్లీ స్థానం పైనే నేతలందరూ మనసు పెట్టి ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. మంత్రి పొంగూరు నారాయణకు నెల్లూరు నగరం నుండి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆయన పేరు దాదాపు ఖరారయిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రితో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నెల్లూరు నగరం నుండి అసెంబ్లీ టిక్కెట్ కోసం గత కొంతకాలంగా అబ్దుల్ అజీజ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నారాయణ పేరు ఖరారయిందనే ప్రచారంతో మేయర్ కాస్త అసంతృప్తికి గురికావడం, కొందరు టీడీపీ సీనియర్ నేతలు ఆయన్ను బుజ్జగించడం తెలిసిందే. అలాగే మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖులు, మతపెద్దలు ఇటీవల నగరంలో సమావేశం ఏర్పాటు చేసుకొని నెల్లూరు నగర టిక్కెట్ అబ్దుల్ అజీజ్‌కు ముఖ్యమంత్రి కేటాయించాలని డిమాండ్ చేశారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలో ఒక స్థానం తప్పక కేటాయించాలనేది వారి వాదన. వీరికి తోడుగా క్రైస్తవ మతపెద్దలు కూడా మేయర్‌ను కలిసి టిక్కెట్ విషయంలో తమ మద్దతు ప్రకటించడం గమనార్హం. దీంతో మేయర్‌కు టిక్కెట్ విషయంలో పార్టీపైన కూడా ఒత్తిడి వస్తుందని భావించిన నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సీఎం కార్యాలయం నుండి పిలుపు రావడంతో మేయర్ అబ్దుల్ అజీజ్ హుటాహుటిన శనివారం అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. అయితే ఈ భేటీ ప్రధానంగా ఆదివారం జరగనున్న మంత్రివర్గ విస్తరణ గురించి, మైనార్టీ నేతకు మంత్రిగా అవకాశం ఇస్తున్న విషయాన్ని అజీజ్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మరో పది మంది పార్టీ మైనార్టీ నేతలకు సీఎం వెల్లడించినట్లు తెలిసింది. ఇదే సమయంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తగు సలహాలు ఇవ్వాలని కోరడంతో అబ్దుల్ అజీజ్ తన మనసులోని మాటను సీఎం ముందు వెల్లడించినట్లు తెలిసింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న నెల్లూరు నగరం, రూరల్ స్థానాల్లో ఏదో ఒకచోట తనకు అవకాశం కల్పించాలని ఆయన సీఎంను కోరారు. ఈ విషయమై ఆయనకు ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినప్పటికీ సోమవారం మరోసారి కలవాలని సూచిస్తూ అపాయింట్‌మెంట్ ఖరారు చేశారు. పార్టీ నిర్వహించే సర్వేలను బట్టి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, తొందరపడి ఎవరూ ఒక నిర్ణయానికి రావొద్దని సీఎం నేతలకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రితో మేయర్ భేటీ నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. భేటీ తర్వాత మరోసారి వెంటనే భేటీకి ముఖ్యమంత్రి మేయర్‌కు అవకాశం ఇవ్వడంతో జిల్లా పార్టీలోనూ ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నెల్లూరు నగరం నుండి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న మంత్రి నారాయణ కూడా మేయర్ భేటీ విషయాలపై ఆరా తీసినట్లు సమాచారం. సోమవారం ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని మేయర్ వర్గీయులు భావిస్తున్నారు. విద్యావంతుడైన మైనార్టీ నేతకు అవకాశమివ్వడం ద్వారా జిల్లాలోని 10 స్థానాల్లో మైనార్టీలు టీడీపీ మరింత అనుకూలంగా మారే అవకాశముందని మైనార్టీ నేతలు భావిస్తున్నారు. నెల్లూరు నగరం ఖరారైన పక్షంలో నెల్లూరు రూరల్ అయినా అబ్దుల్ అజీజ్‌కు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ నేతల్లోనూ వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

అక్రమాస్తుల మధుసూదనుడు
* రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తులు
* ఏసీబీ సోదాలతో నగరంలో సంచలనం
నెల్లూరు, నవంబర్ 10: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దాసరి మధుసూదన్‌రావు అక్రమాస్తులు సంపాదించారంటూ నగరంలోని దర్గామిట్టలో ఉన్న ఆయన నివాసంలో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు ఏసీబీ డిఎస్పీ శాంతో నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో సుమారు రూ.10 కోట్ల వరకు ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. జిల్లాస్థాయి అధికారి ఆస్తులపై ఏసీబీ సోదాలు నిర్వహించడం నగరంలో సంచలనం రేపింది. గతంలో జడ్పీ సిఇఓగా ఉన్న రామిరెడ్డిపై ఇదే తరహాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ జిల్లాస్థాయి అధికారి ఏసీబీ సోదాలకు చిక్కారు. దాసరి మధుసూదన్‌రావు 2004లో చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. అదే హోదాలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పని చేశారు. అనంతరం 2010 ఏప్రిల్ 6న డీడీగా పదోన్నతి పొంది కడప, కృష్ణా జిల్లాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తున్న ఆయన నెల రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న మధుసూదన్‌రావు ఇక్కడి బాధ్యతల నుండి రిలీవయ్యారు. అయితే తూర్పుగోదావరి జిల్లా డీడీగా ఉన్న వ్యక్తి ఆ బాధ్యతల నుండి రిలీవ్ కాకపోవడంతో ఆయన ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్లు సమాచారం. ఒక సామాన్య ఉద్యోగిగా ప్రభుత్వ శాఖలో చేరిన ఆయన కోట్లకు పడగలెత్తడం వెనుక సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతే కారణంగా స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పనితీరుపై సర్వత్రా విమర్శలున్నాయి. వార్డెన్లతోనూ, శాఖ తరపున వివిధ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతోనూ డీడీ సఖ్యతగా మెలిగేవారని, వారి నుండి ఎంతో లబ్ధి పొందినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. నెల్లూరుతో పాటు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, ఒంగోలు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో పలు ఆస్తులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ధరల ప్రకారం రూ.కోటి విలువ గల ఆస్తులు గుర్తించారు. అయితే బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.10 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ సోదాలో ఏసీబీ డిఎస్పీ శాంతోతోపాటు సిఐలు రామకృష్ణ, శ్రీహరి, శివకుమార్‌రెడ్డి, సిబ్బంది మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు.