శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సింహపురి సిగలో సీఎం వరాల పూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం
* మంత్రి సోమిరెడ్డి ధ్వజం
నెల్లూరు రూరల్, నవంబర్ 20: కేంద్రంలో పాలన సాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగ వ్యవస్థలను తమ సొంత వ్యవస్థలుగా వాడుకుంటూ నిర్వీర్యం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, కోస్టల్ కారిడార్ ఇలా విభజన చట్టంలో ఉన్న వాటి గురించి అడిగితే ఢిల్లీ నాయకులు ఐటీ దాడులు, సీబీఐ దాడులు, ఈడీ దాడులతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుభవం ఉన్న నాయకుడని, ఆకాశంలో ఉన్న నరేంద్ర మోదీని 2019లో నేలకు దింపడం తథ్యమని ఆయన అన్నారు. జిల్లాలో తొమ్మిది వందల కోట్లతో పలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్ల చొప్పున ఇవ్వవల్సి ఉండగా ఈ సంవత్సరం ఆ నిధులు 350 కోట్లను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకున్నారని ఆయన అన్నారు. అదే పక్క రాష్టమ్రైన తెలంగాణలో పది వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేశారని, ఇదెక్కడ వివక్ష అని ఆయన నిలదీశారు. త్వరలో 60 వేల ఎకరాల పైచిలుకు భూములను ఆయా రైతులకు పట్టాల రూపంలో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమస్య గడిచిన 40 సంవత్సరాల నుండి కొనసాగుతోందని, అలాంటి సమస్యను రైతుల ఆనందం కోసం పరిష్కారం చూపే దిశగా చంద్రబాబునాయుడు ముందుకు సాగుతున్నారని ఆయన అన్నారు. అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ విభజన చట్టంలో 11 విద్యాసంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 11 వేల కోట్ల విలువ చేసే భూమిని కేంద్రానికి అందించిందని, అయినప్పటికీ బీజేపీ నాయకులు అరకొరగా నిధులు విడుదల చేస్తూ తెలుగు ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అని తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎవరు కించపరిచినా తగిన రీతిలో బుద్ధి చెప్పడం తెలుగు ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. అందులో భాగమే ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని, మోదీని ఎదిరించడానికి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు చంద్రబాబునాయుడేనని అన్నారు. అనంతరం రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ, రాష్ట్రానికి మోదీ, అమిత్ షాలను రాహుకేతువుగా అభివర్ణించారు. తెలుగు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని, ఆరోజు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా దోషేనని ఆయన అన్నారు. అనంతరం మరో ఎంపీ మాగుంట బాబు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే కేంద్రాన్ని శాసించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆయన అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయవల్సిందిగా గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా పార్లమెంటులో పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకన్నా తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. ప్రజలు సంతోషంగా లేనప్పుడు ఆ పదవుల్లో ఉండాల్సిన అవసరం లేకనే మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా తయారవుతారని త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇప్పటివరకు ఎనిమిది ధర్మపోరాట దీక్షలు నిర్వహించామని, నెల్లూరులో 9వ దీక్ష చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే బీజేపీ ప్రభుత్వానికి చిన్నచూపుగా ఉందని, భారత దేశంలో ఆంధ్ర రాష్ట్రం భాగస్వామ్యం కాదా అని ఆమె ప్రశ్నించారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు అని అన్నారు. గతంలో ప్రధానమంత్రి, పార్లమెంట్ స్పీకర్, రాష్టప్రతిని నియమించిన నేత చంద్రబాబునాయుడు అని వారు పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా టీడీపీ ముఖ్యపాత్ర పోషించనున్నదని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు.

రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన బీజేపీ
* మంత్రి లోకేష్ విమర్శ
నెల్లూరు రూరల్, నవంబర్ 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిందని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఆనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వార్డు మెంబరుగా కూడా గెలవలేని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. మంగళవారం నెల్లూరులో జరిగిన ధర్మపోరాట దీక్ష సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ బీజేపీ అంటే భారతీయ జగన్, పవన్ పార్టీగా ఆయన అభివర్ణించారు. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఎన్నికైన తరువాత ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ కూడా లేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండేదని, 16 వేల కోట్ల రూపాయల లోటుతో కొత్త రాష్ట్రానికి వచ్చామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం 30 సార్లు ఢిల్లీకి వెళ్లి నాయకుల చుట్టూ తిరిగినా స్పందించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి తాను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రజలను ప్రశ్నించారు. ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు వేశామని, గతంలో ఎప్పుడూ జరగనన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబునాయుడు చేసి చూపించారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ ఢిల్లీకి మించిన రాజధాని నిర్మించుకోడానికి సహకారం అందిస్తానని చెప్పి కేవలం 12 వందల కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుభవంతో అమరావతి బాండ్ల ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు సేకరించారని, వాటితో రాజధాని నిర్మాణం శరవేగంగా జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా దత్తపుత్రుడు పవన్, దొంగ పుత్రుడు జగన్‌తో రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వారి ఆటలు రాష్ట్రంలో సాగవని ఆయన హెచ్చరించారు. నేడు దేశంలో తయారవుతున్న వంద సెల్‌ఫోన్లలో ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే సెల్‌ఫోన్లు దాదాపుగా 30 ఉన్నాయని తెలిపారు. ఐదు రూపాయలకు బిస్కెట్ ప్యాకెట్ రాని ఈ రోజులలో అన్న క్యాంటీన్ల ద్వారా పూటకు ఐదు రూపాయలకే తృప్తికరమైన భోజనం అందిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు.

సిఎం గోబ్యాక్ అంటూ బీజేవైఎం నిరసన ప్రదర్శన
* అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
నెల్లూరుటౌన్, నవంబర్ 20: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, అందువల్ల ముఖ్యమంత్రి వెంటనే వెనక్కి వెళ్ళాలంటూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మంగళవారం సిఎం రాకను వ్యతిరేకిస్తూ నగరంలోని మినీ బైపాస్ రోడ్డులోని బీజేపీ కార్యాలయం నుండి బీజేవైఎం కార్యకర్తలు విఆర్‌సి కూడలి వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన హరనాధపురం చేరుకునే లోపే పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చి ప్రదర్శనను అడ్డుకున్నారు. ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు లేవని, వెంటనే కార్యకర్తలు వెనక్కి వెళ్ళిపోవాలని పోలీసులు సూచించారు. దీంతో బీజేవైఎం కార్యకర్తలు అందుకు నిరాకరించారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, తమను అడ్డుకోవద్దని కోరారు. ఈ దశలో పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు తీవ్రవాగ్వివాదం జరిగింది. ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని నెట్టుకున్నారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బలవంతంగా అ సంఘ జిల్లా అధ్యక్షుడు పోలిచెర్ల ఉదయ్‌తో సహా పెద్దసంఖ్యలో కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్‌లోకి ఎక్కించారు. సిఎం పర్యటన కావడంతో ముందస్తుగా వారిని నగరానికి దూరంగా తోటపల్లిగూడూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు ఇవ్వకపోగా, పలు శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ, పొదుపు రుణాలు రద్దు చేయడంలోనూ రైతులను, మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. అలాంటి చంద్రబాబుకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆయన పాలనపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అన్ని జిల్లాల్లో ధర్మపోరాట దీక్షల పేరుతో నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. దీక్షల పేరుతో ఆర్టీసీ సంస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ప్రజలు చంద్రబాబు నైజాన్ని తెలుసుకుంటున్నారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పనున్నారన్నారు. అరెస్టు అయిన వారిలో నాయకులు దయాకర్‌రెడ్డి, ఫణిరాజు, సుమన్‌ప్రజాపతి, అశోక్‌నాయుడు తదితరులు ఉన్నారు.

నెల్లూరు, నవంబర్ 20: ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకు నెల్లూరుకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలు అభివృద్ధి, సంక్షేమ పనులను జిల్లాలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించే సమయంలో సభకు హాజరైన ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది.
* త్వరలో సుమారు రూ.6,600 కోట్ల విలువ చేసే 66వేల ఎకరాల భూములకు పట్టాల పంపిణీ
* జిల్లాలో 2,600 కిమీ మేర గ్రామీణ అంతర్గత రోడ్లకు నిధులు
* జిల్లాలో త్వరలో 50వేల జీప్లస్ 3 పక్కా గృహాల గృహప్రవేశం
* నెల్లూరు నెక్లెస్ రోడ్డుకు రూ.30 కోట్లు మంజూరు
* వింజమూరులో తాగునీటి వ్యవస్థకు రూ.35 కోట్లు
* నగరంలో సుమారు వెయ్యి కోట్లతో నిర్మితమవుతున్న భూగర్భ డ్రైనేజీ,
సమగ్ర తాగునీటి వ్యవస్థలు ఫిబ్రవరిలో జాతికి అంకితం
* జువ్వలదినె్నలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఫిషింగ్ హార్బర్
* సోమశిల ఎడమకాలువ ఫేస్-2 పనులకు త్వరలో శ్రీకారం
* డిసెంబర్‌లో దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన
* మెప్మా తరపున ఎంఎస్‌ఎంఐకి 50 ఎకరాలు
----------------

సీఎం సభలో పదనిసలు
* మాగంటి బాబు ప్రసంగిస్తూ చివరలో పొరపాటున మహాకూటమిని ఓడించాలని తెలంగాణాలోని తమ బంధువులకు చెప్పాలని అనడంతో సభలో నవ్వులు విరిశాయి.
* మురళీమోహన్ తన ప్రసంగంలో బాలకృష్ణ సింహా సినిమా డైలాగ్ ‘ఒక వైపే చూడు, రెండో వైపు చూడకు’ అనడంతో సభ చప్పట్లతో మారుమోగింది.
* లోకేష్ మరోసారి తెలుగులో మాట్లాడేందుకు తడబడ్డారు. నామస్మరణ అనడం బదులు నామసమరణ అన్నారు.
* చంద్రబాబు ప్రసంగాన్ని కాసేపు ఆపి మోదీ పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలను ప్రదర్శించమని సభ నిర్వాహకులకు తెలిపారు. వారు ప్రదర్శించేందుకు సమయం తీసుకోవడంతో చంద్రబాబు ‘టెక్నాలజీని సరిగా ఉపయోగించుకోకపోతే అప్పుడప్పుడు ఇలానే ఉంటుంది’ అనడంతో సభలో నవ్వులు వినిపించాయి.
* కర్నూలు ఎంపి బుట్టా రేణుక ప్రసంగిస్తూ మంత్రి సోమిరెడ్డి పేరును సోమిరెడ్డి వెంకట మోహన్‌రెడ్డి అని ఆ వెంటనే సరిదిద్దుకుని ప్రతిసారి ఇలాగే పొరపాటు జరుగుతోందంటూ అనగానే సోమిరెడ్డి ముసిముసిగా నవ్వుకున్నారు.
* సభను ఆద్యంతం ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఉత్సాహంగా నిర్వహిస్తూ, మధ్యమధ్యలో డప్పు కళాకారులను ఉత్తేజపరుస్తూ సభలో డప్పుల హోరు కొనసాగేలా చూశారు. ముఖ్యంగా సీఎం వస్తున్న సమయంలో సభా ప్రాంగణం మొత్తం డప్పుల మోతతో దద్దరిల్లింది.

ముగిసిన చంద్రబాబు దీక్ష
ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న చంద్రబాబు సాయంత్రం 5.15 గంటలకు తన ప్రసంగాన్ని ముగించి తిరుగు పయనమయ్యారు. తొలుత అనుకున్న సమయం కంటే ఆలస్యంగా 3.30 గంటలకు సభాస్థలికి చేరుకున్న ఆయన సాయంత్రం 5.15 వరకు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ కవాతు మైదానంలోని హెలిపాడ్ వద్దకు రోడ్డు మార్గాన చేరుకుని అక్కడ్నుంచి హెలికాప్టర్ ద్వారా రేణిగుంటకు పయనమయ్యారు. హెలిప్యాడ్ వద్ద ఆయనకు ఇన్‌చార్జ్ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ వీడ్కోలు పలికారు.