శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రెవెన్యూలో అవినీతి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 21 : జిల్లాలో రెవెన్యూ సేవలకు కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీరి అవినీతి మరకల కారణంగా ప్రభుత్వం ఎంతో ఉదాత్త ఆశయంతో ప్రవేశపెట్టిన పలు పథకాలు, సదుపాయాలు లబ్ధిదారులకు చేరడంలో ఆపసోపాలు పడుతున్నాయి. జిల్లాలో సిజెఎఫ్‌ఎస్ భూములు కలిగిన లబ్ధిదారులకు అసైన్డ్ పట్టాలు ఇచ్చేందుకు ఉద్ధేశించిన భూముల పంపిణీలో రెవెన్యూ అధికారులు, దళారులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అసలైన లబ్ధిదారులకు అందజేసేందుకు ఉద్దేశించిన ఈ క్రమబద్ధీకరణ కోసం రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు మధ్యవర్తులు, దళారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని లబ్ధిదారుల నుంచి అధిక మొత్తంలో ముడుపులు స్వీకరిస్తున్నట్లు సమాచారం. ముడుపులు ఇచ్చిన ఫైళ్లకు మోక్షం కలిగిస్తూ అలా సమర్పించని వారికి అనేక కొర్రీలు వేసి మొండిచేయి చూపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమకు పట్టాదారు పాసు పుస్తకం వస్తే ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు, మెరుగైన జీవనం లభిస్తుందని లబ్ధిదారులు కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలోని కొన్ని మండలాలు ప్రత్యేకించి ఈ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారాయనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, సిబ్బంది తమ తమ స్థాయిల్లో ప్రైవేటు వ్యక్తులను ఈ తరహా అవినీతి కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని అక్రమాలకు తెరలేపుతుండటం విశేషం. అంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుందని, మీసేవ కేంద్రాల ద్వారా అంటూ పైకి చెప్తున్నా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధిత అధికారులు, వ్యక్తులను కలవకుంటే లబ్ధిదారులకు ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. సిజెఎఫ్‌ఎస్ భూముల్లో సరైన సమాచారం పొందుపరచి లబ్ధిదారులకు చేరే పరిస్థితి కనిపించటం లేదు. ఇటీవల మర్రిపాడు మండలం తిమ్మాయపాలెం గ్రామంలో భూములకు సంబంధించిన అడంగల్ కాపీ ఉన్నా ఆ భూమికి సంబంధించిన లబ్ధిదారులను కాకుండా వేరొకరిని నమోదు చేసిన సంఘటనపై వెలుగు చూసింది. అదేమని ప్రశ్నిస్తే లబ్ధిదారులకు సంబంధిత అధికారుల నుంచి సరైన స్పందన లభించలేదు. దీంతో ఈ ఘటనపై ఏకంగా గ్రామస్థులంతా సంఘటితంగా రెవెన్యూ సిబ్బందిపై తమ అసహనం వ్యక్తం చేస్తూ తిరగబడే సరికి పరిశీలించి తప్పక చర్యలు తీసుకుంటామంటూ ముక్తసరి సమాధానంతో రెవెన్యూ సిబ్బంది తప్పించుకున్నారు. ఈ సంఘటనలో మండలస్థాయి అధికారులకు కూడా తెలియకుండా క్షేత్రస్థాయి సిబ్బంది రికార్డుల్లో పేర్లు తారుమారు చేసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఇలా తమ చేతివాటానికి అనుగుణంగా స్పందించే వారికి మాత్రం రెవెన్యూ సేవలు పుష్కలంగా అందుతున్నాయి. ఏకంగా వేరొకరి భూమిని మరొకరికి బదలాయించే యత్నాలు కూడా జరుగుతుండటం గమనార్హం. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగలేక, ఎందుకొచ్చిన బాధలే అని ముడుపులు సమర్పించిన వారికేమో సమాచారాన్ని సేకరించి మరీ నమోదు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత డివిజన్, జిల్లాస్థాయి అధికారులు మాత్రం ఈ విషయంలో అంతా పారదర్శకంగా జరుగుతోందంటూ అవినీతి, అక్రమాలపై పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సిజెఎఫ్‌ఎస్ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం రెవెన్యూ సిబ్బందికి కల్పవృక్షంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఎంతోకాలంగా సాగుచేసుకుంటున్న భూమికి పట్టాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులకు రెవెన్యూ సిబ్బంది చేతివాటం అడ్డంకిగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో పట్టాలు వస్తున్నాయనే ఆనందంలో అప్పోసొప్పో చేసి మరీ అధికారులకు లంచాలు ఇచ్చేందుకు రైతులు సిద్ధమవుతుండటం విచారకరం. ఇకనైనా ఉన్నతస్థాయి అధికారులు ఈ అవినీతి తతంగాలు, ఆరోపణలపై స్పందించి లబ్ధిదారుల జాబితాలో రికార్డులు తారుమారు కాకుండా అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగకుండా జాబితాను ముందస్తుగా అందరికీ బహిర్గతపరచి పంపిణీ చేయాలని కోరుతున్నారు.

గూడూరు డివిజన్‌లో విస్తారంగా వర్షాలు
* జలమయమైన రోడ్లు
* వాహనాల రాకపోకలకు అంతరాయం
* నీట మునిగిన పల్లపు ప్రాంతాలు
గూడూరు, నవంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాతావరణంలో గూడూరు డివిజన్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డివిజన్‌లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక రోడ్లు, వీధులు, జలమయమయ్యాయి. భారీ వర్షంతో కొద్దిసేపు ఆయా ప్రాంతాల్లో పలు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డివిజన్ పరిధిలోని మనుబోలులో భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని సముద్రతీర ప్రాంతాలైన కొలనుకుదురు, కట్టువపల్లి, పిడూరుపాళెం, బద్దెవోలు, వెంకన్నపాళెం గ్రామాల్లో అనేక వీధులు జలమయమయ్యాయి. ఈ ప్రాంతవాసులు వర్షం మూలంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అదేవిధంగా సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిట్టమూరు, ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, తడ, వెంకటగిరి, సైదాపురం, బాలాయపల్లి, డక్కిలి, చిల్లకూరు, గూడూరు రూరల్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మండలాల్లో వీధులన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఈ భారీ వర్షం గురువారం కూడా కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల మూలంగా అక్కడక్కడ కొద్దిగా ఇబ్బందులు కలిగినప్పటికీ ఈ వర్షాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఎల్దిపైర్లు వేయడం, విత్తనాలు చల్లడం లాంటి ఏర్పాట్లన్నీ రైతులు చేపట్టారు. ఈనేపథ్యంలో ఈ భారీ వర్షాల మూలంగా డివిజన్ పరిధిలోని అన్నదాతలకు ఎంతో మేలు చేకూరుతుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అయితే సముద్రతీర ప్రాంతాలైన తడ, సూళ్లూరుపేట, కోట, వాకాడు, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు అధికంగా కురిస్తే కొంతమేర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ వాతావరణంలో ఈ భారీ వర్షాల కారణంగా రైతాంగానికి అధికశాతం మేలు జరుగుతుందని ఈ వర్షాలు ఉపయోగకరమని డివిజన్ పరిధిలోని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.