శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (వాసుదాసు వ్యాఖ్యానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామలక్ష్మణులను సుగ్రీవుడి దగ్గరికి
తీసుకుపోయిన హనుమంతుడు
*
కిష్కింధకాండ
*
సుగ్రీవుడు తిరుగుతున్న ప్రాంతంలో ఒక ప్రదేశంలో రామలక్ష్మణులను దింపి, హనుమంతుడు, సుగ్రీవుడి దగ్గరకు పోయాడు. పోయి ‘సుగ్రీవా! ఈ రాముడు ఏ పాపం ఎరుగడు సుమా! నువ్వు సందేహించిన దోషం ఇతడిలో లేదు. మిక్కిలి ఆలోచనాపరుడితడు. సూర్యతేజస్సు కల తమ్ముడు లక్ష్మణుడితో యితడు నీ దగ్గరకు వచ్చాడు. ఇతడు సామాన్యుడని భావించవద్దు. విస్తారమైన సత్యం, శౌర్యం, సత్యమైన శౌర్యం, సత్యమే శౌర్యంగా కల వాడితడు. ఈయన సాక్షాత్తూ పరమాత్మ అనుకోవాలి. సూర్య వంశంలో జన్మించాడు. రామచంద్రమూర్తి ఇంద్రుడిని జయించిన తేజస్సు ఉన్నవాడు. దశరథ మహారాజు కొడుకు. ధర్మబుద్ధిలో తరుగులేనివాడు. పితృవాక్య పాలనలో దక్షుడు. ఇలాంటి వాడు అడవుల్లో తిరుగుతుంటే, రావణాసురుని వల్ల తన భార్యను కోల్పోయాడు. ఈయన తండ్రి దశరథుడు రాజసూయాది యాగాలను చేసి వేలకొద్దీ ఆవులను దక్షిణలతో దానం చేశాడు. మీరు పూజ్యులలో ఉత్తములు. ఇంతకు మించినవారు లేరు. అందమైన కీర్తి కలవారు. నీ స్నేహం కోరి ఇక్కడికి వచ్చారు. కాబట్టి నువ్వు పోయి వారిని పూజించు’.
రామలక్ష్మణులతో సంభాషించిన సుగ్రీవుడు
ఆంజనేయుడి మాటలు విన్న సుగ్రీవుడు తనకు రామచంద్రుడి వల్ల కలిగిన భయాన్ని వదిలి సంతోషంగా మనుష్య రూపాన్ని ధరించి త్వరత్వరగా వారి దగ్గరకు వచ్చాడు. నిర్మలమనస్కుడైన గురువు చెప్పిన మాటలు విని, ఆ మాటల్లో శ్రద్ధ గలవాడైన శిష్యుడిలాగా సుగ్రీవుడు ప్రవర్తించాడు. ఇలా సుగ్రీవుడు రామలక్ష్మణులను సమీపించి, అనురాగంగా పూజించి, రామచంద్రమూర్తిని చూసి ఇలా అన్నాడు.
‘మీరు వీరులనీ, గొప్ప ధర్మగుణం కలవారనీ, సమస్త జీవకోటుల మీద వాత్సల్యం కలవారనీ, ఇలా మీ లెక్కించనలవికాని గుణాలను హనుమంతుడు చెప్పాడు. ఓ రాజకుమారులారా! మహాత్ములారా! ఈ కోతితో మీరు స్నేహం చేయాలని అనుకుంటే అంతకంటే నాకు గౌరవం, ఉత్తమమైన లాభం ఇంకోటి ఉంటుందా? నేనే కృతకృత్యుడిని. అయినా ఒకటి చెప్తా వినండి. రామా! నువ్వు నాతో స్నేహం చేస్తే, రాముడి స్నేహితుడు సుగ్రీవుడు అని గౌరవ లాభం నాకే కాని, నావల్ల నీకు గౌరవ లాభాలు కలగవు. ఆ కారణాన నేనే ధన్యుడిని. నా జనే్మ సార్థకం.’
సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు
సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. ‘రామచంద్రా! నాతో స్నేహం చేయడానికి నీకు పరిపూర్ణంగా అంగీకారమైతే, నా చేతిలో నీ చేయి వెయ్యి. ఇదిగో, నా చేతిని స్నేహధర్మ మర్యాద ప్రకారం చాచాను. ఇది అభయహస్త ప్రధాన ప్రార్థన’ ఆ మాట విన్న రామచంద్రమూర్తి వీడు నిర్మల మనస్కుడని మనసులో సంతోషించి, తన అరచేతిని, సుగ్రీవుడి అరచేతిలో వుంచి, గౌరవించి నిండు మనస్సు కల స్నేహంతో కౌగిలించుకున్నాడు. ఆంజనేయుడు అప్పుడు తిరిగి తన సన్యాసి రూపాన్ని వదిలి కోతి రూపాన్ని ధరించి, చండ్రపుల్లల్ని తెచ్చి మంట చేశాడు. కణకణ మండే ఆ అగ్నిహోత్రాన్ని వారిద్దరి మధ్య హనుమంతుడు పెట్టాడు. రామసుగ్రీవులు అడవి పూలతో పూజించి, ఒకరి చేయి మరొకరు పట్టుకుని, ఆసక్తిగా అగ్నికి ప్రదక్షిణ చేశారు. ఇలా రామసుగ్రీవులు స్నేహం చేసి వారి వారి హృదయాల్లో వున్న ఆరాటాన్ని విడిచి ఇద్దరూ తమ పని జరిగినట్లే సంతోషించారు. ఒకరినొకరు ప్రేమపూరితమైన చూపులతో మరీ మరీ చూసుకుంటూ తృప్తిపడ్డారు.
రామసుగ్రీవులు అలా తన్మయంగా ఒకరినొకరు చూసుకుంటూ వుండగా, ఆ సమయంలో సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. ‘రామచంద్రా! నీ స్నేహాన్ని సంపాదించాను. మన సుఖదుఃఖాలు సమానమయ్యాయి’. ఇలా చెప్పి, సుగ్రీవుడు, నిండారా పూసిన ఒక కొమ్మను ఒకదానిని విరిచి నేల మీద వేసి, దాని మీద రామచంద్రమూర్తితో కలిసి కూర్చున్నాడు. అప్పుడు వాళ్లలా కూర్చోగా హనుమంతుడు చందన శాఖను ఒకదానిని విరిచి తెచ్చివేయగా లక్ష్మణుడు దాని మీద కూర్చున్నాడు. అప్పుడు సవినయంగా సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు.
తనకు వాలి చేసిన అపకారాన్ని
రాముడికి చెప్పిన సుగ్రీవుడు
సుగ్రీవుడు తనకు అన్న వాలి చేసిన అపకారాన్ని గురించి ఇలా చెప్పసాగాడు. ‘రామచంద్రా! నా అన్న వాలి భయంకరమైన పరాక్రమం కలవాడు. వాడు నా మీద కోపంతో నన్ను రాజ్యం నుండి పంపించి, నా భార్యను హరించి, నిర్దయుడై వెళ్లగొట్టితే, ప్రాణభయంతో కొండాకోనలలో అల్లల్లాడుతున్నాను. నన్ను కరుణార్ద్ర దృష్టులతో చూసి వాలి భయం నాకు లేకుండా చేసి నన్ను రక్షించు.’
సుగ్రీవుడిలా చెప్పగా స్నేహధర్మం తెల్సినవాడు, శరణాగత రక్షణ అంటే ప్రేమ కలవాడు, దేవతలను రక్షించే కకుథ్సుడి వంశంలో పుట్టినవాడు, శ్రీరామచంద్రుడు తాను చేయాల్సింది ఇంత అల్ప కార్యమా? అని చిరునవ్వుతో ప్రీతిగా సుగ్రీవుడితో ఇలా అన్నాడు.
వాలిని చంపడానికి ప్రతిజ్ఞ చేస్తున్నట్లు సుగ్రీవుడికి చెప్పిన రాముడు
సుగ్రీవుడితో వాలిని చంపడానికి ప్రతిజ్ఞ చేస్తూ రాముడు ఇలా అన్నాడు. ‘స్నేహితుడంటే ఉపకారం చేసేవాడని అర్థం. ఇది నేను చక్కగా ఎరుగుదును. కాబట్టి నీ భార్యను అపహరించిన ధర్మవిరుద్ధ చరిత్రుడైన వాలిని చంపుతాను. భయపడవద్దు. వాలినెలా చంపుతానంటావా? ఇదిగో చూడు. నా బాణాలు గురి ఛేదించకుండా వ్యర్థంగా పోవు. మిక్కిలి వాడికల మొనలున్నాయి. వంకర లేకుండా చక్కటి కణుపులున్నాయి. నీచపు నడవడి గల వాలిని, కోపించిన పాముల గుంపుల్లాగా చంపుతాయి.’
రాముడిలా చెప్పగా, సంతోషించిన సుగ్రీవుడు ‘రామచంద్రా! నీ అనుగ్రహం వల్ల నా భార్య, రాజ్యలక్ష్మి లభిస్తే సంతోషిస్తాను. నీ బాణాలతో వాలిని త్వరగా చంపి నా తీవ్ర దుఃఖాన్ని తొలగించి రక్షించు’ అని అంటాడు.
-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690