శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

పంచవటి స్థల వివాదం.. అసలు చరిత్ర (అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచవటి స్థలం ఏదనే వివాదం చిరకాలంగా అనేక మందిని బాధిస్తున్నది. భద్రాచలం దగ్గరున్న పర్ణశాల అని కొందరు, నాసిక దగ్గర అని మరి కొందరు, అభిప్రాయపడుతున్నారు. వీటిల్లో ఏది సత్యమో అనే విషయాన్ని రామాయణాన్ని బట్టి, స్థల శోధనాన్ని బట్టి నిర్ధారించాల్సి ఉంది. పంచవటి గోదావరీ తీరంలో వుందనే విషయం నిర్వివాదాంశం. పంచవటి దగ్గర గోదావరి నది ఉత్తరాన్నుండి దక్షిణానికి పారుతూ వుండాలి. ఎందుకంటే రామలక్ష్మణులు సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ గోదావరి తీరాన వెళ్లారు. ఇలా వెళ్తున్న రామలక్ష్మణులకు దక్షిణ దిక్కుగా సీత పోయిందని మృగాలు, పక్షులు చూపాయి. అప్పుడు రామలక్ష్మణులు నేరుగా దక్షిణానికి పోకుండా, నైరుతి దిశగా పోయి, గోదావరీ తీరంలో జటాయువును చూశారు. ఈ కారణాన, గోదావరి నది జటాయువు పడ్డ స్థలం దాకా, దక్షిణాభిముఖంగా పారుతుండాలి. జటాయువుకు గోదావరీ జలాలతో రామలక్ష్మణులు నివాపాలు విడిచినందున వారున్న స్థలం గోదావరి తీరమే అయ్యుండాలి. ఇక్కడి నుండి రామలక్ష్మణులు నైరుతి దిశగానే మూడు కోసుల దూరం పయనించారు. ఇంతదాకా తూర్పుగా పోవడానికి ఏరు అడ్డం వస్తుంది. కాబట్టి తూర్పుగా పోలేదు. కొంత తూర్పుగా పోతేనే కాని జటాయువు చెప్పిన దక్షిణ మార్గం కనిపించదు. కాబట్టే అక్కడి నుండి మూడు కోసులు తూర్పుగా పోయారనుకోవాలి. ఇప్పుడు ఇప్పటి భద్రాచలం దగ్గర, గోదావరి నదికి దక్షిణాన వున్నారు వారు. ఇలా వచ్చినందున వారికి గోదావరి దాటాల్సిన పనిలేదు. ఈ కారణాన పంచవటి గోదావరి నదికి పడమటి తీరాన ఉన్నదని అంగీకరించాలి. తూర్పునే వుండి ఉన్నట్లయితే, గోదావరి దాటే ఉండాలి. ఆ విషయాన్ని వాల్మీకి చెప్పలేదు.
ఇప్పటి పర్ణశాలే పంచవటి అని అనుకుంటే, వారొక వేళ నైరుతి దిక్కుగా ప్రయాణం చేసి వుంటే, ఏటిపాలు అయ్యేవారు. భద్రాచలం దగ్గర ఏరు దాటినట్లు కొందరు రాశారు కాని, అది ఆలోచించి రాసిన రాత కాదు. ఇప్పుడు అందరూ అనుకుంటున్న పర్ణశాల కాదు కాని, దానికి ఎదురు ఒడ్డున, చక్కగా పంచవటి వుండేదని చెప్పొచ్చు. అలాగే ఒకాయన నాసికను పంచవటి అని పేర్కొన్నారు. అక్కడి నుండి దక్షిణంగా వచ్చినట్లు చెప్పారాయన. ఇది రామాయణానికి విరుద్ధం. పంచవటి గోదావరీ నదీ పశ్చిమ తీరాన వున్నదనడానికి స్థలం ఆధారంగా ఉంది. పర్ణశాలకు ఎదురుగా రథగుట్ట అనేదొకటి ఉంది. ఇక్కడ రావణాసురుడు తన రథాన్ని దాచిపెట్టాడని అంటారు. ఎందుకంటే సీతాపహరణ సందర్భంలో, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని రాగానే రథం సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. సమీపంలో అది కనపడనందున ఆ పని కొనసాగింది కాని, ఏటికి ఒక ఒడ్డున రథం; సీత, రావణుడు మరో ఒడ్డున వుంటే ఇది సాగి ఉండేది కాదు. కాబట్టి పంచవటి పడమటి దిక్కునే ఉండాలి. సీతాపహరణం ఆ పక్కనే అయి ఉండాలి. అంతేకాదు.. దీనికి సమీపంలోనే, సీత గుట్టలని పెద్ద పర్వతం ఉంది. ఇక్కడ ఖరుడు యుద్ధానికి వచ్చినప్పుడు సీతాలక్ష్మణులు వున్నారని, ఆ కారణాన ఆ గుట్టలకు ఆ పేరు వచ్చిందని అంటారు. కాదనడానికి కారణం లేదు. తూర్పు ఒడ్డున వున్నట్లయితే, ఏరు దాటిపోయి, అక్కడి గుట్టల్లో వుండాల్సి వచ్చేది. ఈ గుట్ట కింద పడమటి దిక్కుగా పెద్ద బయలు ప్రదేశం ఉంది. అక్కడ పధ్నాలుగు వేల రాక్షసులు నిలిచి యుద్ధం చేయగలిగే పెద్ద స్థలం ఉండేది. సీతాలక్ష్మణులకు ఇక్కడ జరిగిన యుద్ధం గుట్ట మీద నుండి కనపడేది.
మరొకచోట వాల్మీకి రామాయణంలో పద్మ సరస్సు పంచవటికి దగ్గర్లోనే వుందని చెప్పడం జరిగింది. అది ఇప్పటిదాకా ఉందో, లేదో చెప్పడం సాధ్యపడదు కాని ఇలాంటి పెద్ద చెరువొకటి ఉన్నట్లు అక్కడుండే కోయవాళ్లు చెప్తుంటారు. ఈ చెరువుకూ, గోదావరి నదికి మధ్య పంచవటి ఉంది. వర్షాకాలంలో ఏటి నీళ్లు బురదగా ఉన్నప్పుడు ఈ చెరువు నీళ్లు సీతారామ లక్ష్మణులు వాడుకునేవారు. ఇప్పటి పర్ణశాలకు దక్షిణంగా గోదావరీ తీరంలో భద్రాచలానికి వచ్చే తోవలో, దుమ్మగూడెం అనే ఊరుంది. దీని ఎదురుగా ఏటికి ఆవలి ఒడ్డున ఒక చిన్నగుట్ట ఉంది. దీని దగ్గరలోనే జటాయువుకు, రావణుడికి యుద్ధం జరిగిందని రామాయణంలో ఉంది. ఇప్పుడు గోదావరి నది తూర్పు ఒడ్డు కోసుకొని వస్తున్నది. ఇప్పటి ఏటి మధ్యలో దుమ్మగూడేనికి చెందిన కొంత భాగం ఉండేదట. అక్కడ అలా చూసిన వారు ఆంధ్ర వాల్మీకికి చెప్పారా విషయాన్ని. వాస్తవానికి ధూమగూడెమే దుమ్మగూడెం అయింది. ఆ గుట్ట దగ్గరే జటాయువుకు సంస్కారాలు చేశాడు శ్రీరాముడు.
ఇప్పటి హంపే పంప అనీ, అక్కడే పర్ణశాల వున్నదనీ, చెప్పడానికి ఒక నిరాకరించలేని ప్రబల కారణం ఉంది. రామలక్ష్మణులు లంకకు పోయేటప్పుడు ఏ మార్గంలో వెళ్లినా, లంక నుండి తిరిగొచ్చేటప్పుడు విమానాన్ని చక్కగా వచ్చేట్లు చేశారు కాని, వంకర టింకరగా పోలేదనేది స్పష్టం. లంక నుండి సముద్రం దాటిన తరువాత, రామేశ్వరం దగ్గర నుండి, అయోధ్యకు వెళ్లారనేది అందరూ అంగీకరించిందే. అలాంటప్పుడు ఎడమవైపున కిష్కింధ, కుడివైపున పంచవటి వుండి ఉండాలి. ఈ రెండు స్థలాలను రామచంద్రమూర్తి సీతాదేవికి చూపించాడు. ఈ మార్గానికి, నాసికకు సంబంధమే లేదు. కాబట్టి పంచవటి నాసిక కాదు.. కావడానికి వీల్లేదు. నాసిక అనేది మొదటి పేరు కాదనీ, నవశిఖ అనేది నాసిక అయిందనీ, పురాణాలలో ప్రసిద్ధికెక్కిన నాసిక శూర్ఫణకదే అయినందువల్ల ఆ కథకు, దీనికి ముడిపెట్టారని కూడా కొందరు రాశారు. నాసిక పంచవటి కాదనడానికి మరి కొన్ని కారణాలున్నాయి.
సీతారామ లక్ష్మణులు చిత్రకూట నుండి దక్షిణంగా ఋక్షవంతానికి వచ్చి, అక్కడ నుండి, పశ్చిమాభిముఖంగా నాసిక చేరినట్లు కొందరంటారు. వాళ్లు చెప్పిన మార్గంలో వింధ్య పర్వతానే్న కాకుండా, నర్మద, తపతీ నదులను దాటి, విదర్భ గుండా నాసికలోకి పోవాల్సి వుంటుంది. ఇది చాలా దుర్గమ మార్గం. అదీ కాకుండా, వాల్మీకి ఎక్కడా, సీతారామ లక్ష్మణులు వింధ్యనూ, నర్మదా తపతులను దాటినట్లు చెప్పలేదు. వారు దాటే వుంటే ఆ సుప్రసిద్ధ నదుల గురించి వాల్మీకి తప్పక రాసేవాడే. రామలక్ష్మణులు దక్షిణానికి వచ్చి, ఆ తరువాత ఆగ్నేయంగా కిష్కింధకు వచ్చారనడం రామాయణానికి ప్రత్యక్ష విరుద్ధం అనాలి. వాస్తవానికి రామలక్ష్మణులు నైరుతీ మూలగా, ఆ తరువాత కొంత మేరకు నైరుతిగా పోయి, అక్కడ నుండి తూర్పుగా పోయి, కబంధుడిని చంపి, అక్కడ నుండి మళ్లీ పడమరగా పోయి, పంప (తుంగభద్ర) చేరి అక్కడికి పడమర వున్న శబరి గుహకు పోయారు. జటాయువు గుట్ట దగ్గర నుండి నైరుతిగా వస్తేనే కిష్కింధకు రాగలరు. అలా కాకుండా కొందరు చెప్పినట్లు ఆగ్నేయ మూలగా పోయి వుంటే, సముద్ర తీరానికి చేరేవారే కాని, కిష్కింధ చేరకపోయేవారు. ఆగ్నేయ మూలగా ప్రయాణం చేసినట్లు రామాయణంలో ఎక్కడా ఒక్క మాటైనా లేదు. అలాగే భద్రాచలం దగ్గర ఉష్ణ గుండం ఉందనడం, సీతాదేవి స్నానం చేసేదనడం, రేకపల్లె దగ్గర జటాయువు రెక్క పడిందనడం బహుశా కల్పితాలు కావచ్చు. -సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12