శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

పర్ణశాలలో సీత లేకపోవడం చూసి థుఃఖపడ్డ శ్రీరాముడు (అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడు తాను చెప్పదలచుకున్న మాటలను లక్ష్మణుడికి చెప్పి, త్వరత్వరగా ఆశ్రమం వైపు అడుగులు వేస్తుంటే, ఎడమకన్ను కింది భాగంలో అదిరింది. కాళ్లు కూలబడ్డాయి. దేహం వణకడం మొదలైంది. ఆయన తనకు కలుగుతున్న అపశకునాలకు వ్యాకులపడుతూ, ‘సీతాదేవి ఇంకా క్షేమంగా ఉన్నదా? నేనామెను చూడగలనా?’ అనుకుంటాడు. ఇలా అనుకుంటూనే తన ఆశ్రమంలో ప్రవేశిస్తాడు. అక్కడ సీత లేకపోవడం చూసి దుఃఖంతో భ్రమ చెందినవాడై, చేతులు జోడించి ఆశ్రమాన్ని పరికించి చూశాడు. గృహలక్ష్మి లాంటి స్ర్తిరత్నం సీత లేని కారణాన కమలాలు లేని కొలనులాగా, వాడిపోయి ఏడుస్తున్న వృక్షాలలాగా, కాంతిహీనమైన వనంలాగా, పాడుబడ్డ తన ఆశ్రమం ప్రవేశించి వెదికి చూసిన రాముడు సీత లేదని నిశ్చయించుకుని, మనసు కలత చెందగా ఆమెను తలచుకుని ఏడ్చాడు.
సీత ఏమైందోనని రకరకాల ఆలోచించడం మొదలెట్టాడు. ‘సీతను రాక్షసులు పగబట్టి ఎత్తుకుపోయారా? క్రూరమృగాలు భక్షించాయా? ఏదైనా కారణాన ఎక్కడికైనా పోయిందా? పరిహాసం కోసం ఎక్కడైనా దాక్కున్నదా? ఒక్కతే ఆశ్రమంలో వుండలేక అడవుల్లోకి పోయిందా? పూలు పళ్లు తేవడానికి ఎటైనా పోయిందా? సరస్సు దగ్గరికి స్నానానికి పోయిందా? మంచినీళ్లు తేవడానికి వెళ్లిందా? ఎక్కడికి పోయి ఉంటుంది? నేనేం చేయాలి? ఎక్కడ వెతకాలి? ఎలా వెతకాలి? ఈ పాడు అడవిలో ఎవరిని అడగాలి?’ అనుకుంటూ, సీతను వెతికి వెతికి కళ్లు వుబ్బేట్లు రామచంద్రమూర్తి ఏడ్చాడు. దుఃఖం ఎక్కువవుతుంటే ఎర్రగా అవుతున్న కళ్లతో, వికారమైన చూపులతో, పిచ్చిపట్టిన వాడిలా, మూర్ఖుడిలాగా ఏడ్చాడు. తనకెవరు దిక్కని అనుకున్నాడు.
సీతాదేవి దాక్కున్నదేమో అని చెట్టు చెట్టు దగ్గరకూ పరుగెత్తాడు రాముడు. గుట్ట గుట్టకూ పరుగెత్తాడు. బాగా ఏడ్చాడు. తనను ఇలా చిక్కులు పెట్టడం తగునా ప్రియురాలా అనుకున్నాడు తనలో. దీనంగా ఏడ్చాడు. ఏడుస్తూ.. ‘దొండతీగా, దొండపండు లాంటి పెదవి కలదానివి చూశావా? కడప చెట్టా, నీ పూలంటే ఇష్టపడే నా ప్రియురాలిని చూశావా? చిలుకా, నీలాగా పలికే దాన్ని చూశావా? మారేడు పండా, నీలాంటి స్తనాలు కలదానిని చూశావా? మద్ది, నీ పండ్లంటే ఇష్టమైన దాన్ని వీక్షించావా? జింకల మందలారా, మీ కళ్లలాంటి కళ్లున్న దాన్ని వీక్షించారా? కకుభమా, నీ లాంటి తొడలు కలదాన్ని కాంచారా? ఏనుగా, నీలాగా నడిచే దాన్ని తిలకించావా? తిలకమా, స్ర్తిలలో శ్రేష్టురాలైన నా ప్రియురాలిని కంటివా? నేరేడా, నీవైనా నిజం చెప్పు.. నీ పళ్లలాగా నున్నగా, మినమిన మెరిసే దేహకాంతి కల దానిని ఈ అడవిలో చూశావా? అశోకమా, నువ్వు శోకాన్ని పోగొట్టే దానివి కాబట్టి నీకా పేరు వచ్చింది. నేను శోకంతో బాధపడుతున్నాను. సీతాదేవి వృత్తాంతాన్ని చెప్పి నన్ను నీ పేరు కలవాడిగా చేయి’ అని అంటాడు రాముడు.
ఇంకా ఇలా సాగింది రాముడి వెతికే ప్రక్రియ. ‘ఓ తాటిచెట్టా, నా మీద నీకెందుకీ కోపం? నీ ఫలాల లాంటి కుచాలున్న స్ర్తి నీ దగ్గరకు రాలేదా? మామిడీ, నీ దయ ఎలాంటిదో చూస్తాను. నీ క్రొంజిగురు వంటి అరచేయి కలదానిని నువ్వు చూడలేదా? ఓ నీపమా, నువ్వు చెట్లకు రాజువి. నీ పూలలాంటి పెదవి కలదానిని చూడలేదా? నిమ్మా, ఎందుకు నీకింత కోపం? పిలిచినా పలకవేంటి? నీ పండ్ల లాంటి పాలిండ్లు కలదానిని చూశావా? పాటలమా, నీ పువ్వుల లాంటి ఎర్రటి పెదవులు కలదానిని చూశావా? కొత్త ఉసిరికా, కొత్త వయసులో వున్న దాన్ని నువ్వు చూశావా? సరళమా, సరళమైన హృదయం కలదాన్ని చూడలేదా? మల్లె తీగా, తీగెలాంటి శరీరం కలదాన్ని చూశావా? ఆడ ఏనుగా, ఏ ముక్కులాంటి తొడలు కలదానిని, ఆడజింకా, నీ కళ్లలాంటి కళ్లు కలదానిని, తుమ్మెదా, నీలాగా నల్లనైన వెంట్రుకలు కలదానిని, సింహమా, నీ నడుం లాంటి నడుం కలదానిని, మీరేనుగులాగా నడిచే దానిని చూడలేదా?’
ఇంకా ఇలా కొనసాగుతుంది రాముడి వెతకడం. ‘మనోహరమైన జింకలారా, జింక కళ్లలాంటి కళ్లు కలది మీ దగ్గరున్నదా? మీరైనా చెప్పండి. గజరాజమా, ఏనుగులాగా నడిచే దాని పోయిన జాడ నీకు తెలిసే ఉండవచ్చు. చెప్పు. పులీ, ఎందుకు నీకు సందేహం? నువ్వు మింగావని నేననలేదు. సీత ఎక్కడికి పోయిందో చెప్పు. ఓసీ కోకిలా, నీ కంఠం లాంటి కంఠం కలది ఎక్కడికి పోయిందో చెప్పు. నీకు తెలిసే వుండాలి. చిలుకా, నీలాగా పలికే దాన్ని చూశావా? హంసమా, హంస గమనను నువ్వు చూశావా? తుమ్మెదా, తుమ్మెదల లాంటి జడకల దాన్ని చూశావా? అయ్యో, నా మీద దయవుంచి సీత ఏమైందో చెప్పండి. కాంతా, పోవద్దు.. నిలు నిలు. మన్మథ పుష్ప బాణమా, నీ హృదయం ఇంత దయలేనిదా? ప్రాణ సఖీ, ఎందుకు నా మీద అలిగావు? ఇది పరిహాస సమయమని కులుకుతూ కులుకుతూ పరుగెత్తుతున్నావు. నేనది చూశాలే! నీ చీరే నాకు కనిపించింది. నల్లటి వెంట్రుకలు కలదానా, ఇలా నేను చూసి పిలిచినా పలకవేంటి? కోపమా? నన్ను రక్షించు’
ఇలా అడిగిన దానే్న అడిగి, చెప్పిన మాటే చెప్పి, పోయిన చోటుకే మళ్లీ పోయి, అక్కడ సీత లేనందున మనసులో తల్లడిల్లుతూ మూర్ఛపడి, లేస్తూ, సొక్కుతూ, ఆరాటపడుతూ, ఆ అడవిలో సీతను వెతికినా ఎక్కడా కనపడలేదామె.