శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

సీతను ఎడబాసి ప్రాణాలతో వున్నా ఏమి ప్రయోజనం?( కిష్కింధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంపా పుష్కరిణిని ఇంకా ఇలా వర్ణిస్తాడు శ్రీరాముడు.
‘కొండల్లో, కోనల్లో, పుట్టిన నిండారు పూలగుత్తులతో నిండిన చెట్లు ఒకదానితో మరొకటి కలిసికొనగా కొండలన్నీ పూలకుప్పల్లాగా కనపడుతున్నాయి. పూలతో కప్పబడిన కొనలు కలిగి, ఎగురకొట్టడం వల్ల, భ్రమరం పైభాగం తల మీద పూలను ధరించి, నల్లగుడ్డ ముసుగువేసుకుని, ఆడుతూ పాడుతూ వున్న స్ర్తిలలాగా చెట్లున్నాయి. బంగారపు సొమ్ములు ధరించి, సరిగ వస్త్రాన్ని వల్లెవాటుగా పైన వేసుకున్న జనుల లాగా నిండా పూచిన గోగులున్నాయి చూశావా? వసంతం కొత్త కొత్త పక్షుల ధ్వనులతో ఆక్రమించి భార్యలేని నాకు సహించలేని మనోవేదన కలిగిస్తున్నది. భార్యను ఎడబాసిన తీవ్ర దుఃఖం అనుభవిస్తున్న నన్ను మన్మథుడు చాలా బాధిస్తున్నాడు. కోవెలలు జయఘోషతో నన్ను సంతోషంగా పిలుస్తున్నాయి. రమ్యమైన అడవి వంకలలోని నీటికోళ్లు, మిక్కిలి సంతోషంతో మనోహరమైన ధ్వనులు చేస్తూ, సహించలేని పరితాపం నాకు కలిగిస్తున్నాయి.’
‘లక్ష్మణా! మనం పంచవటి ఆశ్రమంలో వున్నప్పుడు ఇటువంటి మనోహరమైన ధ్వనులు వినపడినట్లయితే, జానకి సంతోషంగా నన్ను పిలిచి, ఆ ధ్వనులెంత ఆలస్యంగా వున్నాయో వినమని నాకు చెప్పి సంతోషించేది. తనకు సంతోషమైనా, నాకు సంతోషం అయితేనే కాని ఆమెకు సంతోషకరం కాదు కదా? అనేకమైన పక్షుల గుంపులు నానావిధాలైన మనోహర ధ్వనులు చేస్తూ తీగెల పొదల మీద వాలుతున్నాయి చూడు. ఇంపైన ధ్వనులు చేస్తూ, అతిశయించిన ఆశతో, తమ జాతికి చెందిన పోతు పక్షులతో కూడి ఆడు పక్షులు తుమ్మెదలు పాట పాడుతుంటే ఆడుతున్నాయి. నీటికోళ్ల గుంపుల ధ్వనులతో, కోయిలల ఇంపైన స్వరాలతో, చెట్లు నాకు మన్మథ తాపాన్ని ఎక్కువ చేస్తున్నాయి. అందమైన అశోక పుష్పాల గుత్తులు నిప్పులుగా, తుమ్మెదల ధ్వనులు మంటల చిటపట ధ్వనులుగా, ఎర్ర చిగుళ్లు జ్వాలల్లాగా, వసంతాగ్ని నన్ను కాలుస్తున్నది. వినపడుతున్న ఇంపైన కోయిలల ధ్వనులు, చక్కగా పూసిన వనాలు, ఈ వసంత కాలం సీతకు చాలా సంతోషమైనవి. అందమైన కళ్లు, ఇంపైన వాక్కులు, తుమ్మెదల్లాంటి ముంగురులు కలదైన సీతను ఎడబాసి తమ్ముడా! నేను ప్రాణాలతో వున్నా ఏమి ప్రయోజనం? సగం శరీరం పోగా తక్కిన సగం శరీరం ఏ పని చేయగలదు?’
‘విస్తారంగా పూసిన పూపొదలు అన్ని చోట్లా కనపడుతున్నాయి. చకోరాల్లాంటి కళ్లు కల సీత మాత్రమే కళ్ళారా చూద్దామంటే కనపడటం లేదు. అనురాగం కారణాన మన్మథుడితో పుట్టి, వసంతుడితో పెంచబడిన ఈ శోకాగ్నితో కమ్ముకున్న మనస్సు శుష్కిస్తుంటే నేనెలా సహించి వుండగలను? సీతాదేవి కనబడక నాకు శోకం కలిగించింది. ఈ వసంతుడు కనబడి చెమట బిందువులను ఆర్పివేస్తున్నాడు. సీతాదేవిని వదిలి తాపం వల్ల మాడుతున్న నన్ను, నిర్దయుడైన గాలి దహిస్తున్నాడు. రెపరెప గాలి వీస్తుంటే, స్ఫటికపు గవాక్షాలలాగా విచ్చుకున్న పురులు ప్రకాశిస్తుంటే, ఆడ నెమళ్లు తమను చుట్టుకుని సేవిస్తుంటే, మత్తుతో పరవశించి మగ నెమళ్లు సీతావియోగంతో మన్మథ పీడితుడనైన నన్ను, మరింత మన్మథార్తికి పాల్చేసి నాట్యం చేస్తున్నాయి. ఆడుతున్న మగ నెమలిని చూసి, ఆడ నెమలి సంభోగ ఇచ్ఛ ఎక్కువవుతుంటే, మగ నెమలితో అదీ ఆడుతుంటే, వదలని మదన తాపంతో రెక్కలు విచ్చి ఆడుతూ, ఆడ పక్షిని చేరబోతూ, మెల్లగా ధ్వనులు చేస్తూ మగ నెమలి భార్యలేని నన్ను పరిహాసం చేసేదానిలాగా, నా వంక చూసింది లక్ష్మణా! చూశావా ఇది?’
‘ఈ మగ నెమలి ప్రియురాలిని, రాక్షసుడు, అడవుల్లో అపహరించి దాచిపెట్టలేదు కాబట్టి, ఇది ప్రియురాలితో వేడుకగా వినోద క్రీడలు చేస్తున్నది. ఔరా! ఈ వసంతకాల మహిమ గొప్పదనం? దాని మహిమ వల్లే కదా! పక్షి జాతుల్లో పుట్టినా, ఆ ఆడ నెమలి అనురాగాతిశయంతో మగ నెమలి దగ్గరనే వుంది. రావణాసురుడు హరించకపోతే నా సీత కూడా ఈ విధంగా నన్ను చేరేది కదా! అలాంటి నా ప్రియురాలు జానకిని వదలిపెట్టి ఈ వసంతాన్ని ఎలా దాటుతాను? తేనెలు కారుతున్న పూల గుంపులతో అడవులు నిండినా, నా పూలు సంతోషం కలిగించలేక నా పాలిట వ్యర్థమయ్యాయి. ఈ పూలు మంచి కాంతిగా వున్నప్పటికీ, తేనె కోసం తుమ్మెదలు వస్తున్నా నా విషయంలో వ్యర్థమై నేల రాలుతున్నాయి. పక్షుల గుంపులు నాకు కామాన్ని పెంచడానికా అన్నట్టు మనోహర, అవ్యక్త ధ్వనులు చేస్తూ ఒకదానిని మరొకటి పిలుస్తూ సల్లాపాలు ఆడుతున్నాయి. నా ప్రియురాలు సీతాదేవి ఎక్కడ ఉందో అక్కడ కూడా ఈ వసంతకాలం ఉంటే ఆమె కూడా నాలాగే మదనతాపాతిశయంతో వియోగ కారణాన బాధపడుతుండవచ్చు.’
‘జానకి వున్నచోట వసంతకాలం లేదు. రావణుక్కెడో రహస్య స్థలంలో దాచిపెట్టితే అక్కడ వసంత కాలం ఎలా వస్తుంది? అక్కడ కూడా ఇలాగే వుంటే ఆమె ఈ విరహ తాపం ఎలా సహించగలదు? ఒకవేళ ఇలాగే అక్కడ కూడా వసంత కాలం వుంటే, రాక్షసులు చుట్టుముట్టి, ‘చంపుతాం.. కోస్తాం.. నిన్ను పీక్కు తింటాం..’ అని బెదిరించే మాటలు అంటుంటే ముఖం వెలవెలబోయి ఆవెఔ ఏం చేయగలదు? శృంగార రసానుభవం ఎలా కలుగుతుంది? మధ్య వయస్కురాలు, మెల్లగా మృదువుగా మాట్లాడే కోమల హృదయం కలది. సౌందర్యానికి స్థానమైనది. కొత్తగా వికసించే తామర రేకుల్లాంటి కళ్లు కలది. కాబట్టి ఈ వసంత సమయంలో కామం అతిశయించగా సహించలేక శరీరం వదులుతుందా? సీతాదేవి వయసులో వుంది. అందునా పతివ్రత కాబట్టి కామం తీర్చుకునే వీలులేక నా వియోగాన్ని సహించలేదు. లోకంలో భార్యాభర్తలు లేరా? ఎందుకు ఇంత తపిస్తున్నావు భార్యకై అంటావా? సీతాదేవి మనస్సు ఎల్లప్పుడూ నా మీదే నిలిచి ఉంటుంది. ఏ దశలోనూ దానికి విరుద్ధంగా జరగదు. ఆ కారణాన స్మరణకు రాకుండా ఎలా ఉంటుంది? నన్ను నేను మరువగలనా? స్నేహం దూరమైన కొద్దీ దగ్గరవుతుంది. సమీపిస్తే తగ్గుతుంది.’
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12