ఈ వారం కథ

శ్రీరంగనీతులు

  • రాచపూటి రమేష్ ఇ.నెం: 10/585 (మేడపైన) బెల్లంమండి వీధి, కడప - 516001
  • 11/02/2012

నేడు సర్వత్రా చీడపురుగులా ఆవరించి వున్న అవినీతి మన దేశం రూపురేఖల్ని సమూలంగా నాశనం చేస్తోంది. ఇందు కలడందులేనట్లు.. ఈ అవినీతి అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో విశృంఖలంగా విలయతాండవం చేస్తోంది. ఈ రోజు కొందరు నిష్కలంక దేశభక్తులు, గాంధేయవాదులు, యోగిపుంగవులు ఈ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే అధికారంలో వున్నవారికి ఇంత ఉలికిపాటు ఎందుకో? స్విస్ బ్యాంకుల్లో కోట్లలో నల్ల డబ్బు దాచుకున్నవారిని ఈ వ్యవస్థ ఏమీ చేయలేకపోతోంది, కానీ అధికార వ్యవస్థలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న బినాయక్ సేన్ లాంటివారిని చెరశాల పాలు చేస్తోంది. ఏమిటీ దురన్యాయం? ఈ దోపిడీ వ్యవస్థకు మంగళం పాడేదెప్పుడు? చిరకాలం ఈ అన్యాయాలు, అక్రమాలు చూస్తూ సామాన్యడు వూరుకోవాల్సిందేనా, వీటికంతులేదా?’- ధారాపాతంగా సాగిపోతున్న శివశంకరం గారి ఉపన్యాసాన్ని శ్రోతలందరూ ఆసక్తిగా వింటున్నారు. వారిలో ఆయన ప్రసంగం నూతనోత్తేజం కలిగిస్తోంది.
అవినీతిపై పోరాడడానికి కొత్తగా ఆ వూరిలో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటై మీటింగ్ ఏర్పాటుచేసింది. ఇటీవలే ఓ ప్రభుత్వ శాఖలో ఉన్నతాధికారిగా రిటైరైన శివశంకరంగారు ఆ సంస్థకు జాయింట్ సెక్రటరీగా ఎంపికయ్యారు.
ఎఫేస్సీ అనే ఆ సంస్థ ఏర్పాటుచేసిన ఆ సమావేశానికి సంస్థ విస్తృతంగా ప్రచారం కల్పించడంతో జనం భారీగా తరలివచ్చారు. వేదికపై అలనాటి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న గాంధేయవాదులిద్దరున్నారు. వారితోబాటు మిగిలిన వక్తల ప్రసంగాలు కూడా ప్రేక్షకుల్లో నూతన స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ కలిగించాయి.
శివశంకరంగారి ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న కుమార్ అనే ముప్ఫై ఏళ్ళ యువకుని మనసులో ఏదో మెరుపు మెరిసినట్లయింది. ఇదివరకూ తాను శివశంకరాన్ని ఎక్కడో కలుసుకున్నట్లు తోచిందతనికి. ఐదు నిమిషాల్లోనే తానింతకు మునుపు ఆయన్ను ఎక్కడ కలుసుకున్నాడో గుర్తుకు వచ్చిందతనికి.
దాదాపు ఏడేళ్ళ క్రితం తాము కడుతున్న ఇంటి తాలూకు ప్లాన్ అప్రూవల్ కోసం మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళి అక్కడ శివశంకరంగారిని తాను అప్రోచ్ అయనట్లు గుర్తుకు వచ్చింది కుమార్‌కు.
తండ్రి మరణించడంతో పెద్ద ఆసరా పోగొట్టుకున్న కుటుంబానికి, తానే పెద్ద దిక్కై నిలిచాడు కుమార్. మరెవ్వరిమీద ఆధారపడకుండా వారికి స్థిరనివాసం కల్పించదలిచాడు. అందుకే తండ్రి పి.ఎఫ్ డబ్బులకు మరికొంత అప్పుచేసి తెచ్చిన సొమ్ము జత చేసి అప్పటికే తండ్రి కొని వున్న ఓ ప్లాట్‌లో ఇంటి నిర్మాణం చేపట్టాలనుకున్నాడు కుమార్. తాను మళ్లీ ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్లాలో ఏమో! అందుకే వెనువెంటనే ఇంటి పని ప్రారంభించాలనుకున్నాడు.
ఇంటిప్లాను ఓ అనుభవజ్ఞుడైన ఇంజనీరుతో గీయించి, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు మున్సిపాలిటీకి అప్రూవల్‌నిమిత్తం సబ్మిట్ చేశాడు. నెలరోజులు గడిచినా ప్లాన్ అప్రూవల్ అయనట్లు ఆర్డర్స్ చేతికి రాలేదు. ఎంక్వైరీ చేస్తే సంబంధిత ఫైలు శివశంకరంగారి దగ్గర వున్నట్లు తెలిసిందతనికి.
కుమార్ శివశంకరంగారిని ఆఫీసులో కలిశాడు.
‘‘సార్ మీరడిగిన పేపర్లన్నీ సబ్మిట్ చేశాను గదా, ప్లాన్ ఇప్పించండి సార్’’ అని బతిమలాడాడు.
శివశంకరంగారు జర్దాపాన్ నములుతూ కుమార్ వంక చిద్విలాసంగా చూశాడు.
‘‘వచ్చే నెల తిరుపతికెళ్తున్నామోయ్. రైల్లో ఏసీ సీట్ల రేట్లు పెరిగాయి కదా. ఐనా సరే స్లీపర్‌లో వెళ్లలేము. సమ్మర్ కదా, నీకు తెలిసిన వాళ్లెవరైనా వుంటే ఓ ఆరు బెర్తులు సంపాదించు ఏసీలో. అలాగే రిటర్న్ జర్నీకి కూడా. నేను ఈ ఎండలో రిజర్వేషన్ ఆఫీసుకు వెళ్ళలేను. నువ్వు వచ్చేసరికి ప్లానుసిద్ధం చేసి వుంచుతాను’’ అన్నాడు తాపీగా.
కుమార్‌కు పదివేలు ఖర్చుపెట్టి రైల్వే టికెట్లు సంపాదించక తప్పులేదు. అవసరం తనది. అందుకోసం ఇహాన్ని చంపుకొని ఇష్టం లేని పని చెయ్యాల్సి వచ్చిందతనికి.
శివశంకరంగారు ఉద్యోగంలో ఇబ్బడిముబ్బడిగా సంపాదించాడని ఎవరో అంటుండగా తరువాత విన్నాడు కుమార్.
అలాంటి పరమనీచుడు, లంచగొండైన శివశంకరం ఈ వూరొచ్చి గాంధీ మహాత్ముడిలా బిల్డప్పిచ్చి అవినీతి వ్యతిరేక సంస్థలో చేరి, అవినీతిపై పోరాడుదామంటే నమ్మడానికి కుమార్ చెవిలో పూలేమీ లేవు.
కుమార్ పరిస్థితి ఏడేళ్ల క్రితం ఆర్థికంగా ఏమీ బాగాలేదు. అటువంటి స్థితిలో శివశకరం అడిగిన పది వేలు సేకరించడానికి అతను చాలా అవస్థ పడవలసి వచ్చింది. తననా రోజు అంత ఇబ్బందికి గురిచేసిన శివశంకరంపై కుమార్ మనసు ద్వేషంతో రగిలిపోయింది.
ఎఫేస్సీ సంస్థ త్వరలో రాజకీయ పార్టీగా అవతరించబోతోందని, ఇప్పుడందులో చేరిన వారికే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా సీట్లు దక్కుతాయన్న ప్రచారం జనంలో జోరుగా సాగుతూ వుంది.
ఏ ఎమ్మెల్యే సీటు కోసమో శివశంకరం ఆ సంస్థలో చేరి వుంటాడు. అవినీతితో తాను సంపాదించిన కోట్ల రూపాయల ఆసరాతో, ఎఫేస్సీ సంస్థకు ప్రజల్లో వున్న మద్దతు సహాయంతో ఎలక్షన్లలో సులభంగా నెగ్గుకురాగలనని ఆయన ధీమా కాబోలు.
కుమార్ మదిలో అప్పటికప్పుడు శివశంకరంపై పగ తీర్చుకోవడానికో పథకం రూపుదిద్దుకుంది.
***
‘‘హలో, నేను శివశంకరాన్ని మాట్లాడుతున్నాను. మీరెవరు?’’ అడిగాడు అప్పుడే నిద్రలోంచి లేచిన శివశంకరం బద్దకంగా.
‘‘సార్, నా పేరు దిలీప్, నేను నిన్న ఎఫెస్సీ మీటింగ్‌లో మీ ఉపన్యాసం విని ముగ్ధుడయ్యాను. మీరు నాకో సాయం చేయాలి’’ అని వినిపించింది శివశంకరానికి.
‘‘సాయమా, ఏమిటది? ఐనా నేను నీకెందుకు చేయాలది?’’ గాబరాగా అడిగాడు శివశంకరం.
దిలీప్ అనే మారు పేరుతో మాట్లాడుతున్న కుమార్ తనలో తాను నవ్వుకున్నాడు.
‘‘నేనొక యూనియన్ లీడర్ని, పైగా మీకు పనికొచ్చే మనిషిని. ఆ సాయం నాకేమీ వూరికినే చేయొద్దు. అది మీరు చేస్తే మీకు చాలా డబ్బు ముట్టే మార్గం చెబుతాను’’ అన్నాడు కుమార్.
శివశంకరంలో ఆసక్తి బాగా పెరిగింది, డబ్బు మాట వినగానే.
‘‘నేను రేపు ఖాళీగానే ఉంటాను. రేపు ఉదయం పది గంటలకు నన్ను మా ఇంటికొచ్చి కలువ్’’ అన్నాడు.
కుమార్ తనలో తాను నవ్వుకున్నాడు మళ్లీ.
***
కుమార్ వూహించినట్లుగానే శివశంకరం కుమార్‌ని గుర్తుపట్టలేదు.
‘‘చెప్పు బాబూ, ఏమిటి నీకు నేనేం చేయగలసాయం? అందుకు నీకు చాలా డబ్బు చేకూరచ్చని అన్నావే! అదెలా సాధ్యం’’ ఆసక్తిగా అడిగాడు శివశంకరం.
అతడి ఆత్రుత చూసి కుమార్‌కి కంపరం కలిగింది.
శివశంకరం గదిలో అడుగడుగునా ప్రతిఫలించే రిచ్‌నెస్‌ని కాసేపు గమనించి చెప్పాడు కుమార్.
‘‘దామోదరం అనే వాడు కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్లో పనిచేసి కోట్లు కూడబెట్టాడు. వాడికి ఈ వూర్లో, గుంటూరు, బెంగుళూరు, చెన్నైలలో విలువైన భవంతులు, ఇళ్ల స్థలాలు చాలా వున్నాయి. వాడి అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర వున్నాయి. కానీ వాడు నన్ను చూసి భయపడడు, నేను అనామకుడిని కనుక.
ఆ దామోదరం డబ్బుమదంతో నాతో గొడవ పెట్టుకొని నన్ను కొట్టాడొకసారి. అందుకే వాడంటే నాకు పగ.
మీరు అవినీతి వ్యతిరేక సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి మీరంటే వాడు భయపడుతాడు. నేను మీకు వాడిల్లు చూపిస్తాను. మీకు నా దగ్గరున్న దామోదరం, అతని బినామీల ఆస్తుల తాలూకు వివరాలు ఇస్తాను. వాటినాధారంగా పెట్టుకొని వాడినుంచి మీరు లక్షలు గుంజవచ్చు’’ చెప్పాడు కుమార్.
దామోదరం లక్షల సంగతం వినగానే శివశంకరం గుటకలు మింగుతూ కుమార్ ప్రపోజల్‌కు ఒప్పుకున్నాడు.
పూర్వాపరాల గురించి ఆలోచించే
సహనం కూడా
లేకపోయిందతనికి.
‘‘అయతే ఒక షరతు, మీరెంత వసూలు చేసినా, అందులో సగభాగం నాకు అందజేయాలి’’ అన్నాడు కుమార్.
శివశంకర్‌కు అరికాలి మంట నెత్తికెక్కింది.
‘‘నీకెందుకివ్వాలి? ఆ దామోదరాన్ని కష్టపడి బెదరగొట్టి, చచ్చీ చెడీ డబ్బులు వసూలు చేసేది నేను, అందులో ఉద్దరగా ఫిఫ్టీ పర్సెంట్ నొక్కేసేది నువ్వా? ఎంత మాత్రం కుదరదు’’ అని కుమార్‌పై చిందులు తొక్కాడు.
‘‘అయతే మీరు దామోదరం విషయం మరచిపోవచ్చు’’ చేతిలోని ఫైలుతో కుర్చీలోంచి పైకి లేచాడు కుమార్.
శివశంకరం తత్తరపడ్డాడు.
‘‘రిలాక్స్ బాబూ, ఏదో తొందర పడ్డాను, కావాలంటే ఓ టెన్ పర్సెంట్ నీకు ఇస్తానులే’’ అని కుమార్‌ను కాళ్లా వేళ్లాపడ్డాడు. ఆఖరుకు పాతిక పర్సెంట్‌కు కుదిరింది బేరం.
దామోదరం ఆస్తుల వివరాలున్న ఫైలు శివశంకరానికి అందజేశాడు కుమార్.
***
‘‘అదే.. దామోదరంగారి ఇల్లు. వాడిప్పుడు ఇంట్లోనే వున్నాడు. మీరు త్వరగా వెళ్లి పని కానిచ్చుకుని రండి’’ పోష్ కాలనీలోని ఓ డూప్లెక్స్ హౌస్‌ని శివశంకరానికి చూపించి చెప్పాడు కుమార్.
శివశంకరం ఆత్రుతతో దామోదరం ఇంటివైపు నడిచాడు. కుమార్ ఆ జంక్షన్‌లో వున్న టీ కొట్టు వైపు నడిచాడు.
***
‘‘ఇప్పుడు చెప్పండి. ఎవరు మీరు. నాతో మీకేం పని?’’ ఆత్రుతగా అడిగాడు దామోదరం.
శివశంకరం తన విజిటింగ్ కార్డ్ అతని చేతికిచ్చి తాను అవినీతి వ్యతిరేక సంస్థ కార్యవర్గ సభ్యుడని తనను తాను పరిచయం చేసుకున్నాడు.
‘‘సంతోషం. నాతో ఏం పనిబడి వచ్చారు?’’ విసుగ్గా అడిగాడు దామోదరం, టైం చూసుకుంటూ.
‘‘మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదించారని మా సంస్థకు ఉప్పందింది. అది నిజం కాదంటారా?’’ డైరెక్టుగా పాయింట్‌లోకి దిగాడు శివశంకరం.
‘‘మీరు చెబ్తున్నది అబద్ధం, నేనలాంటివాడిని కాను’’ జేవురించిన మొఖంతో అన్నాడు దామోదరం.
‘‘మా దగ్గర ఆధారాలు కూడా వున్నాయి. వాటికేం చెబుతారు?’’ తన దగ్గరున్న ఫైలును దామోదరం ముందుకు తోసి అన్నాడు శివశంకరం.
దామోదరం ఆత్రంగా ఆ ఫైలు తీసుకొని తిరగేశాడు. అతడి మొఖంలో రంగులు మారాయి.
‘‘ఇవన్నీ మీ చేతికెలా వచ్చాయి?’’ భయంతో పాలిపోయిన ముఖంతో అడిగాడు దామోదరం.
‘‘అది మీకనవసరం. వీటిని
విజలెన్సుకు పంపాలో లేక సిబిఐకి పంపాలో, ప్రజలముందే వుంచాలో మా సంస్థ నిర్ణయిస్తుంది’’ కటువుగా చెప్పాడు శివశంకరం.
దామోదరం దిగ్గున లేచి శివశంకరం చేతులు పట్టుకున్నాడు.
‘‘అంత మాట అనకండి. పిల్లలు కలవాడిని. దయచేసి నా మీద దయ వుంచండి’’ అన్నాడు దీనంగా.
‘‘ఎంత మాత్రం వీల్లేదు. మేము అవినీతిని సహించే మనుషులం కామని మిమ్మల్ని హెచ్చరించడానికే వచ్చాను’’ అన్నాడు శివశంకరం దామోదరాన్ని ఉగ్రంగా చూసి.
‘‘ఓకే, ఈ ఆధారాలను నాకిచ్చి ఈ విషయం మరచిపోవానికి మీకెంత కావాలి? లక్షా? రెండు లక్షలా?’’ బేరం మొదలుపెట్టాడు దామోదరం దీనంగా.
‘‘మేము మీకంటికింత చీప్‌గా కనిపిస్తున్నామా? మమ్మల్ని నువ్వు కొనలేవు’’ కోపంగా చెప్పాడు శివశంకరం.
‘‘ఓకే, లాస్ట్ వర్డ్, ఐదు లక్షలిస్తాను. ఈ కేసు ఇంతటితో క్లోజ్ చేయండి’’ అన్నాడు దామోదరం.
శివశంకరం మెత్తబడ్డట్టు కనిపించాడు. కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్లుగా వౌనంగా కూర్చున్నాడు.
‘‘మా సంస్థ నిప్పువంటిది. అందులోని సభ్యులను కన్విన్స్ చేయడం కష్టం. కానీ మీరింతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి ఓకే. మా సంస్థకు పది లక్షలు విరాళంగా ఇవ్వండి’’ కఠినంగా చెప్పాడు శివశంకరం.
‘‘పది లక్షలా, టూమచ్, నేనంత ఇచ్చుకోలేను’ బతిమాలుతున్నట్లు అన్నాడు దామోదరం.
‘‘ఓకే, అయతే నేను చేయగలిగిందేమీ లేదు. శెలవు పుచ్చుకుంటాను’’ కుర్చీల్లోంచి లేస్తూ అన్నాడు శివశంకరం దామోదరం చేతుల్లోంచి ఫైలు తీసుకొని.
‘‘కూర్చోండి కూర్చోండి’’ కంగారుగా అన్నాడు దామోదరం.
‘‘సరే, ఎలాగో నా తిప్పలు నేడు పడతాను, నా పేరు బయటకు పొక్కకపోవడమే నాకు కావలసింది. మీకు కావాల్సిన డబ్బుని అరేంజ్ చేస్తాను వారం రోజుల్లోగా’’ అన్నాడు.
‘‘మీ మాట నమ్మేదెలా? ఇప్పుడు కనీసం రెండు లక్షలు అడ్వాన్సు ఇవ్వండి’’ అన్నాడు శివశంకరం.
దామోదరం లోనికెళ్లి పది నిమిషాల్లో ఓ చిన్న బ్రీఫ్ కేసు తీసుకొచ్చి శివశంకరానికందించాడు. దాన్ని ఓపెన్ చేసి చూశాడు శివశంకరం. అతడి కళ్లు జిగేలుమన్నాయి.
‘‘్థ్యంక్స్, మిగతా డబ్బు కోసం వారంరోజుల్లో వస్తాను. మీకిక ఏ భయమూ అక్కర్లేదు, డబ్బు ముట్టంగానే ఈ ఆధారాలన్నింటిని మీ ముందే తగలబెట్టి మీ విషయం మరచిపోతాము’’ కుర్చీలోంచి లేస్తూ అన్నాడు శివశంకరం.
‘‘కూర్చోండి శివశంకరంగారూ, ఎక్కడికి వెళతారు?’’ చిరునవ్వుతో లోపలికి వస్తూ అన్నాడు కుమార్.
‘‘కుమార్, ఏమిటిది? నువ్వెందుకొచ్చావ్’’ కంగారుగా అడిగాడు శివశంకరం.
కుమార్ వెనుకే నలుగైదుగురు మనుషులు లోనికి వచ్చారు. వారందరి చేతుల్లో వీడియో కెమెరాలున్నాయి. వారి మెడల్లో ఐడెంటిటీ కార్డులను బట్టి వాళ్లు పత్రికా ప్రతినిధులు, టీవీ చానెల్ రిపోర్టర్స్ అని గ్రహించాడు శివశంకరం భయంతో వణికిపోతూ.
‘‘శివశంకరం, నీ ఆట కట్టింది! ఎఫ్యేసి సంస్థ కళంకం లేని మనుషుల కోసమే. నీ నీచ బుద్ధితో ఆ సంస్థను అడ్డం పెట్టుకొని గడ్డి తినాలనుకున్నావు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది, అడ్డంగా దొరికిపోయావు’’ అన్నాడు కుమార్.
‘‘అసలిదంతా నీ మూలానే, నాకీ తలనొప్పి తెచ్చి పెట్దింది వీడే సార్...’’అని ఏదో చ్పెబోయాడు శివశంకరం.
‘‘షటప్, అతనెవరకున్నావు? ఓ చానెల్ చీఫ్ రిపోర్టర్. పెద్ద మనుషుల ముసుగులో దురాగతాలకు పాల్పడుతున్న కొందరి ఆట కట్టించడానికి నా సహకారం అడిగాడు. అటువంటి ధర్మకార్యాలకు నా సహకారం ఎప్పుడూ వుంటుందని సరే అన్నాను’’ తాపీగా చెప్పాడు దామోదరం. శివశంకరం అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు.
‘‘ఔను, దామోదరం ఆస్తులన్నీ అతడికి జమిందారులైన అతని తండ్రి, మామగార్లనుండి సంక్రమించాయి. ఉదారబుద్ధితో ఎన్నో దానాలు చేస్తూ వుంటాడతను. ఉద్యోగం ద్వారా అతనికి ముట్టేది జీతం మాత్రమే’’ చెప్పాడు ఓ రిపోర్టర్.
‘‘సరే, ఈ వీడియో టేప్ మా కందజేయడానికి మీకెంతకావాలి?’’ కంగారుగా అడిగాడు శివశంకరం.
‘‘డోంట్ టాక్ రబ్బిష్! మేము నీలాగా మేకవనె్న పులులం కాము. ఎఫ్యేసీ సంస్థకు ఈ టేపులందజేసి నీవంటి గోముఖవ్యాఘ్రాలు అవినీతి ఉద్యమంలో దూరకుండా జాగ్రత్త పడమంటాం. అన్ని చానెళ్లకు, పేపర్లకు ఈ సంభాషణ వివరాలనందజేస్తాం. నీలాంటివారికి అదే తగినశిక్ష..’’ కోపంగా చెప్పాడు మరో కెమెరామెన్.
‘‘వృద్ధనారీ పతివ్రతా...’’అన్నట్లు సర్వీసులో వుండగా అడ్డదారుల్లో అక్రమంగా బొక్కి, రిటైరైన తరువాత సత్య హరిశ్చంద్రుడిలా నటించబోయి బోల్తాపడ్డావు పాపం...’’ వెటకారంగా అన్నాడు కుమార్.
కుమార్ ఎవరైంది శివశంకరానికి లీలగా గుర్తుకువచ్చింది. కానీ తానిప్పుడు చేయగలిగిందేమీ లేదు. పత్రికలు, టీవీల్లో వార్తలు చూసి ప్రజలు తనను ఏవగించుకోవడం ఖాయం. అలాగే ఎఫ్యేసీ సంస్థలో తన పదవి వూడుతుంది. తను నలుగురిలో తలెత్తుకు తిరగలేడు. పరువు పోతుంది.
దెబ్బతిన్న పులిలా బుసలు కొడుతూ చేతిలోని బ్రీఫ్ కేసును వదలి ఆ ఇంటి బయటకు నడిచాడు శివశంకరం, రాబోయే గడ్డు రోజుల్ని తలచుకుంటూ.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading