శ్రీవిరించీయం

వివేకవతి - వయోధికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అసలు చదువుకోకుండా కవిత్వాన్ని వెక్కిరించేవాళ్లు లేరూ! విద్య వేయి విధాలగు రావచ్చు. జ్ఞానం రావాలంటే సంస్కారం పరిపక్వం అవాలి. జ్ఞానం ఎంత ఉంటే అంత సహృదయం వుంటుంది. సహృదయులకే సత్య గ్రహణమూ సదభిప్రాయమూ వుంటాయి. మూకాభిప్రాయాలు మందికోసం. మంది బుద్ధికి స్థిరత్వం లేదు. చంచలానికి అంజలి చేసేకన్నా ముంజలమ్ముకోవడం మంచిది’ అంటాడు ‘రావు’ అనే మిలటరీ ఆఫీసర్. ఆయన చిలకపూడి జమీందారుకు తమ్ముడు. లెఫ్టినెంట్ తులసి తండ్రికి గొప్ప స్నేహితుడు అతని తండ్రి. మిలిటరీ ఉద్యోగంతోపాటు రసాస్వాదన, కవిత్వ ఆపేక్ష ఎక్కువ అతనికి.
సెలవులో వచ్చిన లెఫ్టినెంట్ తులసి ఆయనతో అంటుంది: ‘మిలిటరీ ఆస్పత్రిలో ఉద్యోగం అయింతర్వాత ఆ సిపాయిలూ, వారి బాధా, వారి కష్టాలూ చూసి చూసి నాకు అదే ఒక విద్యశాలగా అనుభవం కలిగింది. మీరనే అనుభవానికి తేడా యేమైనా వుందా? అని అడుగుతుంది లెఫ్టినెంట్ తులసి అమాయకంగా.
శిష్టా ఉమామహేశ్వరరావు రాసిన ‘లెఫ్టినెంట్ తులసి’ కథలోని సన్నివేశం ఇది. శ్రీ శిష్టా కథారచయితే కాక, కవి కూడా. ఆయన వ్రాసిన ‘సిపాయి కథలు’ ‘తెలుగు సాహిత్యానికి ఒక నూతన అలంకారం’ అన్నారు శ్రీ శ్రీరంగం నారాయణబాబు. ‘కడు నేర్పుతో సిపాయిల దైనందిన జీవిత రస ఘట్టాలను ఎంతో ప్రతిభతో రచించాడు’.
మిలటరీలో చేరిన ఒక సంవత్సరం తర్వాత, తులసిని సెలవు యిచ్చి వెళ్లి రమ్మంటారు, స్వగ్రామానికి. ఆమెకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చి, మేనత్త ఇంటికి వెడుతుంది, మద్రాసుకు. ఆమెకు యిప్పుడు యిరవయి యేళ్ళు మటుకే. ఇరవై ఒకటి దాటితేగాని స్వతంత్రురాలు కాదు. ‘నేను ఎంబిబియస్ చదవడమే మా మేనత్తకు యిష్టంలేదు. మా నాయన వీలులో వ్రాయకపోతే నా స్కూలు ఫైనలు పరీక్షతోనే పెండ్లి చేసేది. తను మాత్రం డ్యాన్స్‌లు, పార్టీలు అంటూ తిరగాలి. నన్ను చూస్తే తనకు యిష్టమైన వార్నెవర్నయినా నాకు పెళ్లి చేయాలి’- ఇదీ తులసి యిరుక్కున్న దురవస్థ.
మేనత్త ఆమెకు డాక్టర్ మహీపతి అతన్ని యిచ్చి పెళ్లి చేయాలనీ, తను మాత్రం ‘రావు’తో స్థిరపడాలనీ సంకల్పం చేసుకుంటుంది. తులసి ఆ డాక్టర్‌ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడదు. తన స్నేహితురాలుకు అతను అన్న. తనకు కూడా అన్నలు లేని లోటు తీరుస్తున్నాడని సంబరపడుతుంది. ఈ విషయమే అతనికి స్పష్టంగా చెబుతుంది. అయినా ఆ డాక్టర్ మాత్రం తన ఆశ వదులుకోలేదు. మేనత్త రాంబాయి రుూ విషయంలో తులసిని దాదాపు బలవంతం చేస్తుంది. ఆమెకు కెప్టెన్ రావును తన వలలో వేసుకోవాలని వుంది. తులసి రావుపట్ల సుముఖంగా వుండడం ఆమెకు కంటకంగా తయారయింది. ‘నాకు తెలుసులే. రావును పెళ్లిచేసుకుందాం అని వున్నట్లుంది నీకు. రావు ఆరితేరినవాడు. నీకన్నా పదిహేడేళ్లు పెద్దవాడు. నీ బోటివాళ్లను ఎంతమందిని చూచాడో!.. బుద్ధిమాంధ్యం కలిగించుకోక, డాక్టర్‌ను పెండ్లాడు, మంచిది. ఆలోచించుకో’ అని బలవంతం చేసి చెబుతుంది.
తులసి మాత్రం తనకు ఇష్టంలేనివాడిని పెండ్లి చేసుకోగూడదని నిశ్చయించుకుంటుంది. ఆమెకు సలహాదారు కాంతాబాయి అనే సీనియర్ నర్స్. ఇప్పుడామె మిలటరీ సర్వీస్ వదులుకుని, పాత స్కూలు మేనేజర్ పని మళ్లీ తీసుకుని మద్రాసులోనే ఉంది. ‘నీ ఇష్టం లేని పని నీవు చేయవద్దు. నీ ఇష్టంలేని వరుణ్ణి నీవు పెండ్లాడవద్దు. నీవు చిన్నపిల్లవు కాదు. ఓర్పుతో వుండు. మీ మేనత్త దగ్గరికేవెళ్లు. ఆమె ఏం చేయగలదు నిన్ను? ఏమీ చేయలేదు. నూటిలో ఒకతెవు నీవు. నీ వంటివారు ......... తులసీ! అయితే ప్రపంచానికి ఝడిసిపోగూడదు. ఎదుర్కోవాలి. నా మాటలు మళ్లీ ఆలోచించుకో అని భరోసాగా సలహా ఇస్తుంది.
జమీందారు యింట్లో పార్టీకి వెళ్లగా అక్కడ భవనంలోని గది ‘షార్ట్ సర్క్యూట్’ వల్ల దగ్ధమయిపోయి, అదృష్టవశాత్తు కెప్టెన్ రావు తులసిని ప్రమాదం నుంచి తప్పించి, చికిత్స కోసం డాక్టర్‌రావుకు అప్పగిస్తాడు డాక్టర్ మహీపతి, రాంబాయి సలహాతో తనను తులసికి రికమెండ్ చేయమని కెప్టెన్ రావును కోరతాడు. రావు రాయబారం చేయబోతే, తులసి ‘నల దమయంతుల కథ’ నలుడు రాయబారం చేయబోవడం గుర్తుచేస్తుంది. ‘మీరు రాయబారం చేయకండి. మీ సంగతి మీరు చెప్పుకోండి’ అని కెప్టెన్ రావుకు హెచ్చరిక చేస్తుంది. కెప్టెన్ రావు నాలుగు పూలు కోసుకువచ్చి ఆమె కొప్పులో ముడుస్తాడు. ‘నేను కెప్టెన్‌ను. నీ పర్మిషన్ అవసరం లేదు’ అంటూ ఒక చేతితో కౌగిలించుకుని మెల్లిగా తల వంచి చిరునవ్వుతో ముద్దు పెట్టుకుంటాడు. రావు కవిత్వ పంక్తులతో ఆమెను పూర్తిగా కైవశం చేసుకుంటాడు. సిపాయి కథలు ఎక్కువగా రాసిన శిష్ట్లా మధ్యలో మిలటరీకి సంబంధించిన వ్యక్తులతోనే రుూ కథానికను వివరంగా కాంతివంతం చేస్తూ వయసుకు - మనసుకు సంబంధం కుదురుస్తాడు. అతని యితర సిపాయి కథలను చదవాలనే ఉత్సుకతను చదువరులలో ప్రేరేపింపచేస్తాడు. సామాజిక సంస్కరణను సూచించే ఈ కథానిక అతని రచనలు అన్నిటిలోనూ మణిపూసలాంటిది.

-శ్రీవిరించి