రాష్ట్రీయం

సీతారామకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సమాచారం పంపించింది. ఎకో సెన్సిటివ్ జోన్‌లోని 443 హెక్టార్లలో ప్రాజెక్టు పనులకు అభ్యంతరం లేదని స్పష్టం చేసిన వన్యప్రాణి బోర్డు ఫారెస్ట్ డివిజన్‌లోని 257.1154 హెక్టార్లు, పాల్వంచ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 185.8437 హెక్టార్లకు అనుమతి ఇచ్చింది. వన్యప్రాణి బోర్డు నుంచి అనుమతి లభించడంతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికున్న అవరోధాలు తొలిగిపోయాయి. ఖమ్మం, మహబాబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు కీలకమైన వన్యప్రాణి బోర్డు నుంచి అనుమతి లభించడం పట్ల నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేసారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశకు అటవీ అనుమతులు గత జనవరి 19న లభించాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 3,781 ఎకరాలు సేకరించడానికి కేంద్ర అటవీశాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్‌లోని 1201 హెక్టార్లు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఖమ్మం డివిజన్లలో 330 హెక్టార్ల అటవీ భూమిని సాగునీటి శాఖకు బదలాయించేందుకు జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టు రెండవ దశకు కూడా అటవీ అనుమతులు త్వరలో లభించనున్నాయని ప్రభుత్వ అంచన వేస్తోంది. సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితే 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుంది. వన్యప్రాణి బోర్డు నుంచి అనుమతి లభించడంతో ప్రాజెక్టు పనులను ఇక వేగవంతం చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.