రాష్ట్రీయం

వృద్ధిరేటు @ 15 లక్ష్యానికి చేరుకుని తీరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర విభజనతో ఆంధ్ర తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా, స్థానిక ఉత్పాదనలు, ఆర్థిక వనరులు పెంచుకుంటూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. పథకాల అమలు విషయంలో రాజీ ప్రసక్తే లేదన్నారు. జాతీయ సగటు వృద్ధిరేటు 7.3 శాతం కాగా ఇప్పటికే రాష్ట్రం 10.5 శాతం సాధించిందని, ఈ విషయంలో ఉన్నతాధికారులు, కలెక్టర్ల పాత్ర మరువలేమన్నారు. విభజన సమస్యలను ఎదుర్కొంటూనే సమష్టిగా పనిచేయటం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 15 శాతం సాధించేలా కృషి చేయాలని పిలుపిచ్చారు. సంక్షేమం లేని అభివృద్ధిని ప్రజలు హర్షించరంటూనే, అందుకే ఆర్థిక, ప్రాంతీయ అసమానతలు తొలగించేలా సంక్షేమ పాలన సాగించాలని దిశా నిర్దేశం చేశారు. విజయవాడలో రెండ్రోజులు జరిగే కలెక్టర్ల సదస్సును సోమవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన ఐదు సమావేశాలను స్టార్ హోటల్స్‌లో నిర్వహించామని, ఇకపై హోటల్స్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఫంక్షన్ హాల్ ఎంచుకున్నామని సిఎం అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జూన్ రెండో వారానికి అమరావతిలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణం పూర్తవుతాయని, ఇక అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ లోటును కేంద్రంనుంచి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నామన్నారు. కొందరు కలెక్టర్లు పథకాల అమలును తు.చ. తప్పక అమలు చేస్తున్నా, ప్రజల నుంచి సరైన స్పందన లభించటం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే పథకాల అమల్లో ప్రజలనూ భాగస్వాములను చేయాలన్నారు. పశ్చిమగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలు వృద్ధిరేటులో మంచి ఫలితాలు సాధించాయని వివరించారు. సంక్షేమంలో ఏమాత్రం రాజీపడని అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ప్రధానంగా ఫలితాలతో పాటు ప్రజల సంతృప్తి ముఖ్యమన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాల్సి వుండగా రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ఇప్పటివరకు జిల్లాకు రూ.10కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటివరకు రూ.850 కోట్లు అందాయన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తి చేయాలని నిర్దేశించామని, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 80నుంచి 100 టిఎంసిల గోదావరి నీటిని వచ్చే ఏడాదికి కృష్ణా డెల్టాకు తీసుకొస్తామని తెలిపారు. తద్వారా ఇక్కడ మిగిలే నీటిని ఎగువ ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ఏడాది కృష్ణాడెల్టాకు 8 టిసిఎంల నీటిని రప్పించి ఇక్కడి పంటలను పరిరక్షించామని చెబుతూ, నాగార్జునసాగర్ ఆయకట్టులో మాత్రం అధికారులకు ముందుచూపు లేక రెండు పంటలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవటంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్లంతా తక్షణం భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిజోమీటర్లు, రెయిన్ గన్లు, పంట సంజీవనితో జలవనరుల వినియోగాన్ని పటిష్టపరుస్తామని, నదులను అనుసంధానం చేసి ప్రాధాన్యతా క్రమంలో ఏడు ప్రాజెక్టుల సత్వర పూర్తికి పెద్దపీట వేస్తామన్నారు. వర్షపు నీటి బొట్టును భూగర్భ జలాలుగా మార్చుకునేందుకు రాబోయే నాలుగు నెలల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడతామన్నారు. రాబోయే రోజుల్లో కరవు మాట ఏ కలెక్టర్ నోటినుంచి రావటానికి వీల్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరంపై ఇప్పటివరకు ఖర్చుచేసిన రూ.2వేల కోట్లకు పైగా సొమ్మును కేంద్రం నుంచే రాబట్టాల్సి వుందన్నారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షల కింద అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆస్పత్రుల్లో అవుట్ సోర్సింగ్‌తో పరిశుభ్ర వాతావరణం తెచ్చామన్నారు. మొదటి వారంలోనే రేషన్ పంపిణీ పూర్తి చేసేందుకు సహకరించే డీలర్లకు కమీషన్ పెంచే ఆలోచన ఉందన్నారు. ఇదే సమయంలో రేషన్ పంపిణీలో జాప్యం చేసేవారిపై చర్యలు తప్పవన్నారు. వచ్చే మార్చిలోపు ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇస్తామని, మరో 50 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 4వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించి విద్య, వైద్య సంస్థల్లో బయోమెట్రిక్ విధానంతో హాజరును పర్యవేక్షిస్తామన్నారు. సమావేశం ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, మంత్రులు, 13 జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
చిత్రం... విజయవాడలో సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్ల తొలిరోజు సదస్సులో
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు