రాష్ట్రీయం

ప్రత్యేక రాష్టమ్రే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 24: రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని, రాయలసీమ రాష్టమ్రే లక్ష్యంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పని చేస్తోందని ఆ పార్టీ ప్లీనం సమావేశం తీర్మానం చేసింది. మంగళవారం కడప నగరంలోని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ప్లీనం సమావేశం నిర్వహించారు. రాయలసీమ నాలుగుజిల్లాల నుండి పార్టీ ప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాసులు, సీనియర్ నేత లింగమూర్తి మాట్లాడారు. స్వాతంత్య్రం రాకముందు భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారికి రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి, భాషా ప్రయుక్తరాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోనూ రాయలసీమకు అన్యాయాలు, మోసాలే మిగిలాయన్నారు. 1937లో రాయలసీమవాసులను నమ్మించేందుకు రాసుకున్న శ్రీబాగ్ ఒప్పందాన్ని, 1953లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును మూన్నాళ్లముచ్చటగా రాజధానిని చేసి హైదరాబాద్‌కు తరలించారన్నారు. తిరిగి 1953 నాటి రాష్టమ్రే ఇప్పుడు ఉన్నా, న్యాయంగా రాయలసీమలో ఏర్పాటుచేయాల్సిన రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. కృష్ణ, పెన్నార్, సిద్దేశ్వరం ప్రాజెక్టులను త్యాగం చేసిన రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదని తీవ్రంగా ఆక్షేపించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదని, వెయ్యి మంది కార్మికులు పనిచేసే ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ నిర్మించలేదని వారు విమర్శించారు. విభజన చట్టంలో చెప్పిన ఉక్కు ఫ్యాక్టరీ గానీ, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన మన్నవరం ప్లాంట్ గానీ, నందలూరు రైల్వే లోకోషెడ్, కర్నూలులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, అనంతపురం జిల్లాకు రైల్వేజోన్ రాయలసీమవాసుల తీరని కోర్కెలుగా మిగిలాయన్నారు. ఒక్కటంటే ఒక్క కోర్కెను ఈ ప్రభుత్వాలు తీర్చలేకపోయాయన్నారు. ఈ ప్రభుత్వాలపై నమ్మకం పోయిందని, రాయలసీమ రాష్టమ్రే తమకు శరణ్యమని రాయలసీమవాసులు భావించే పరిస్థితి వచ్చిందన్నారు. అనేకమంది సాహితీ మూర్తులు అవతరించిన రాయలసీమ భాష, యాసలను అవమాన పరిచే పరిస్థితి నడుస్తోందని వారు తీవ్రంగా ఆక్షేపించారు. గతంలో రాయలసీమ అభివృద్ధి కోసం ఉద్యమాలు చేసిన వివిధ పార్టీల నాయకులు కూడా రాయలసీమపై ప్రభుత్వాల చులకన భావాన్ని సహించలేకపోతున్నారని, అప్పుడు అభివృద్ధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ప్రత్యేక రాష్టమ్రే శరణ్యమనే పరిస్థితికి వస్తున్నారన్నారు. అలాంటి నేతలందర్నీ కలుపుకుని రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం దిశగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమిస్తోందని, ప్రజలంతా కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు.

చిత్రం..రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్లీనంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి