రాష్ట్రీయం

మాకొద్దు మొర్రో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక పరిస్థితి రానురాను దయనీయంగా మారుతుంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతభత్యాలు, కంటింజెంట్, ఇతరత్రా బిల్లుల చెల్లింపులకు సంబంధించి లక్ష కోట్ల రూపాయలతో కూడిన బడ్జెట్‌ను దేశంలోనే తొలిసారిగా కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్)పేరిట రాష్ట్ర ప్రభుత్వం జపాన్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ‘శాప్’కు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంస్థకు పాలకులకు సంబంధించిన ఓ వ్యక్తి బాధ్యునిగా వ్యవహరిస్తున్నారు. తొలుత నెలకు 50వేల ఆర్థిక లావాదేవీలున్నాయని ఈ సంస్థ భావించగా ప్రస్తుతం లక్ష దాటుతుండటంతో అయోమయానికి గురవుతున్నారని తెలిసింది. ఈ నూతన విధానానికి గత నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఏఒక్కరూ బిల్లులు చేతబట్టుకుని ట్రెజరీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇందుకోసం దాదాపు ఏడాదికాలంగా వివిధ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా 250 సబ్, 13 జిల్లా ట్రెజరీ కార్యాలయాలున్నాయి. వీటిద్వారా బిల్లులు నేరుగా ఆన్‌లైన్‌లో గొల్లపూడిలోని సీఎఫ్‌ఎంఎస్ కార్యాలయానికి వెళ్లి క్షణాల్లో సంబంధిత సంస్థలు లేదా వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు నగదు వెళ్లే ఏర్పాటు చేశారు. అయితే వందకు పైగా సబ్ ట్రెజరీల్లో నేటికీ కాలంచెల్లిన కంప్యూటర్లున్నాయి. వైర్ కనెక్షన్ ద్వారా నెట్ కనెక్షన్‌లు ఇచ్చారు. ఏ క్షణాన ఎక్కడ వైర్లు తెగిపోయినా ఆరోజు లావాదేవీలు
నిలిచిపోతున్నాయి. కలెక్టర్, ఇతర రెవెన్యూ ముఖ్య కార్యాలయాల ప్రాంగణాల్లో ఇవి కొనసాగుతున్నాయి. ఇక్కడ అనునిత్యం జరిగే వీడియా కాన్ఫరెన్స్‌ల వల్ల కూడా సబ్ ట్రెజరీల్లోని నెట్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందంటున్నారు. అందుకే ప్రత్యేకంగా ఎక్కడికక్కడ తక్కువ ఎత్తులో టవర్లు ఏర్పాటు చేయాలంటున్నారు. ఇక తొలుత బిల్లులపై డ్రాయింగ్ అధికారుల సంతకాలు కాకుండా వేలిముద్రలు చాలన్నారు. అయితే అత్యధిక కార్యాలయాలకు సంబంధిత యంత్రాలు పనిచేయకపోవటంతో జీతాల బిల్లులు ఆలస్యం కారాదని భావించి సంతకాలు, వేలిముద్రలు లేకపోయినా బిల్లులు ఆమోదించండంటూ వౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఏదిఏమైనా జీతాలు, పింఛన్ల చెల్లింపుల్లో గత నెల, ఈ నెలలో కూడా అంతులేని జాప్యం జరిగింది.
ఇదిలావుంటే కాకినాడ టౌన్‌ప్లానింగ్ శాఖలో ఓ ఉద్యోగికి చెందిన 8నెలల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లు సొమ్ము మరొకరి ఖాతాలో జమ అయింది. గొల్లపూడిలోని సీఎఫ్‌ఎంఎస్ కార్యాలయంలో 20 మంది కంటింజెంట్ ఉద్యోగులుంటే వీరందరి జీతాల బిల్లులు ఒకరి ఖాతాలో జమ అయ్యాయి. ఇలాంటి పొరబాట్లు అనేకం. ఎయిడెడ్ టీచర్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, సిబ్బందికి ఈ నూతన విధానంలో చెల్లింపులు జరగక రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేకుండానే రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా జమచేశారు. కొన్ని ప్రభుత్వ శాఖలకు జిల్లా కేంద్రాల్లో డ్రాయింగ్ అధికారులు, సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధుల్లో డిస్పర్సింగ్ అధికారులు ఉండగా అలాంటి శాఖల్లో బిల్లులు నిలిచాయి. తమకు జీతాలు రాలేదని ఎవరైనా రోడ్డెక్కితే చాలు సంస్థ అధికారులు భయపడి వారికి అడ్వాన్స్‌లు జమ చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ నెలాఖరు నుంచి వేల సంఖ్యలో అద్దెలు, విద్యుత్, పెట్రోలు, డైట్, తదితర బిల్లులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడనున్నాయి. వీటిని ఏ కారణం చేతనైనా తిప్పి పంపితే మళ్లీ స్కాన్ చేసి పంపించాల్సి వస్తోంది. ఇదిలావుంటే ట్రెజరీలతో నిమిత్తం లేకుండానే డ్రాయింగ్ అధికారులు నేరుగా సీఎఫ్‌ఎంఎస్‌కు బిల్లులు పంపుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాష్ట్రంలో చెక్‌పవర్ కలిగిన సర్పంచ్‌లకు నేటివరకు కోడ్ నెంబర్ కేటాయించలేదు. దీనివల్ల చెక్కులు చెల్లటం లేదు. దీనికి ప్రతిగా గ్రామ కార్యదర్శులతో చెక్కులు తెప్పించుకుని పాస్ చేస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. సర్పంచ్‌లకు ఉన్న ఏకైక చెక్ పవర్ ఈ నూతన విధానం ద్వారా కోల్పోవాల్సి వస్తోంది. నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభమై ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాలేదు. అప్పుడే పలు శాఖల్లో ఖజానా నిండుకుందని, ప్రభుత్వం ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పతాయేమోనన్న భయాందోళనలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.