రాష్ట్రీయం

ఆఖరి అస్త్రం.. ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, మే 20: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ఆఖరి అస్త్రంగా ఆమరణ దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన ప్రజా పోరాట యాత్రను ఆదివారం ఇచ్చాపురం నుంచి శ్రీకారం చుట్టిన ఆయన ఉదయం కవిటి మండలం కపాసుకుద్దిలో గంగమ్మపూజ చేశారు. మధ్యాహ్నం ఇచ్ఛాపురంలో నిరసన కవాతు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై కేంద్రం తీరుకు నిరసనగా 175 నియోజకవర్గాల్లో పోరాటయాత్ర జరుపుతానని, అప్పటికీ కేంద్రం స్పందించకపోతే ఆమరణ దీక్ష చేపడతానని చెప్పారు. 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోను జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ భయపడేదిలేదని చెప్పారు. 2019లో జనసేనకు అధికారమిస్తే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దాడులు, కేసులతో జనసేన కార్యకర్తలను బెదిరించాలని చూస్తే మరింత మొండిగా ముందుకెళ్తామని, సునామీలా ముంచేస్తామని హెచ్చరించారు. ఆంధ్ర ప్రజలను మోసం చేసిన బీజేపీ, టీడీపీలను రెండేళ్ళుగా ప్రశ్నిస్తున్నది తామేనని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు నిర్వహించటాన్ని పవన్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా పోరాటంపై బహిరంగ చర్చ జరిపేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిలో దేశంలోనే
రెండో స్థానంలో ఉందని, చంద్రబాబు హెరిటేజ్ కోసం విజయ డెయిరీని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ళ అనుభవం ఇందుకేనా అని ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంస్థలను పరిరక్షిస్తుందని చెప్పారు. చంద్రబాబు కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారో తెలియదన్నారు. ఓటుకు నోటు కేసా...? మరోటా అన్నది లోగుట్టు పెరుమాళ్లకెరుకని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యారని విమర్శించారు. జనసేనకు కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండి ఉంటే అసెంబ్లీని స్తంభింపజేసి ప్రజలకు న్యాయం చేసేవాడినని చెప్పారు. ప్రతిపక్ష నేత ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లనీయకపోతే ప్రజలకు ఎలా మేలు జరుగుతుందని ప్రశ్నించారు. కష్టపడి నటన నేర్చుకున్నట్టే రాజకీయాలు నేర్చుకుంటున్నానని తెలిపారు.
డబ్బు, అధికారం, పదవులకన్నా నీతి నిజాయితీలే తనకు ప్రధానమని పవన్ వివరించారు. డబ్బు సంపాదించటానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. సంపాదన వదులుకుని వచ్చానని చెప్పారు. తాము నోట్లతో ఓట్లను కొనబోమని, జన హృదయాలను గెలుస్తామన్నారు. జనసేన రాకతో యువత మేల్కొందని, ఇకపై అవినీతిపరుల ఆటలు సాగవని హెచ్చరించారు. మిగతా పార్టీలు కులాలను విడదీసి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తాము కులాల ఐక్యత కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర, వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.
చిత్రం..బహిరంగ సభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్