రాష్ట్రీయం

స్వామి ఆభరణాలు భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 20: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని ఆభరణాల భద్రతకు భయం లేదని, స్వామివారికి నిర్వహించే కైంకర్యాల్లో కొరత లేదని, వైఖానస ఆగమోక్తంగానే శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు జరుగుతున్నాయని టీటీడీ ఇఓ అనిల్‌కుమార్ సింఘాల అన్నారు. ఆలయంలో తవ్వకాల మాట అవాస్తవమన్నారు. విరిగిపోయిన కెంపు ధర 50 రూపాయలుగా నాటి రిజిస్టర్‌లో నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓల ప్రకారమే వయోపరిమితి నిర్ధారించి అమలు చేస్తున్నామన్నారు. ఎవరిపైనా కక్ష సాధించాల్సిన అవసరం లేదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి శ్రీవారి ఆలయ చారిత్రక వారసత్వాన్ని కాపాడడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించి 50 నిమిషాలపాటు అన్ని అంశాలపై ఇఓ విశదీకరించారు. 1952 నుండి శ్రీవారి ఆభరణాలు టీటీడీ పరిధిలోకి రావడం జరిగిందని, వీటిని శ్రీవారి ఆలయంలో ఉన్న తిరువాభరణం రిజిస్టర్‌లో నమోదు చేయడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి అప్పట్లో వచ్చిన అనుమానాలు నివృత్తి చేయడం కోసం జస్టిస్ వాద్వా, జస్టిస్ ఎన్.జగన్నాథరావు కమిటీలను వేసిందన్నారు. వారు పరిశీలించి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని నివేదిక ఇచ్చిందన్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలను ఆయన విలేఖరులకు చూపించారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో అరకొర సమాచారాన్ని పోస్ట్‌చేస్తూ భక్తుల్లో అనుమానాలు పెంపొందించడం బాధాకరమన్నారు. అందుకే భక్తుల అనుమానాలను నివృత్తి చేయడం కోసమే తాము ఈ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆగమ సలహామండలితోనే కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తోందన్నారు. ఇక 1971 మార్చి1న న్యూ మేనేజ్‌మెంట్ కమిటీ సలహాలు, సూచనలు మేరకే 1971 చట్టం ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు స్వామివారికి నిర్వహించే కైంకర్యాల సమయ నిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఆగమాలకు సంబంధించి అధికారులకు తెలిసి ఉన్నా, ఎవరూ జోక్యం చేసుకోరన్నారు. ఎందుకంటే ఆగమాల ప్రకారం స్వామికి కైంకర్యాలు నిర్వహించే బాధ్యత అర్చకులదని, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించే పాలనాపరమైన అంశాలు చూసేది ఐఎఎస్‌లని అన్నారు. ఇక పోటు మరమ్మతులకు సంబంధించి 2001లో 20 రోజులపాటు, 2007లో 20 రోజులు పాటు మహాసంప్రోక్షణ నిర్వహించి అర్చకులు, ఆగమ సలహాదారుల సలహా మేరకే మహాపోటు నుండి పడిపోటుకు మార్చడం జరిగిందన్నారు. ఈ నిర్ణయానికి ఆగమ సలహాదారుడు ఎన్‌వికె సుందరవదన, పెద్దజీయర్, రమణదీక్షితులు కూడా సంతకాలు చేశారని ఆయన చూపించారు. తాజాగా జరిగిన పోటు మరమ్మతులకు సంబంధించి రమణదీక్షితులు తనను సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఆయన పోటులో తవ్వకాలు తవ్వుతున్నారని నాతో అన్నారని, ఆ విషయం తనకు తెలియదని, తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదని చెప్పానన్నారు. వాస్తవానికి ఆయన సలహాతోనే ఎల్ అండ్ టి ప్రతినిధిని తీసుకెళ్లి పనులు నిర్వహించామన్నారు. రమణదీక్షితులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు ఈఓ స్పందిస్తూ డిఎ సెక్షన్‌లో ఆయనపై ఉన్న అభియోగాలకు సంబంధించి చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందన్నారు. గతంలో ఉన్న అధికారులు ఏం చేశారన్నది తనకు సంబంధం లేదన్నారు. శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలను కరిగించారా? అన్న ప్రశ్నకు ఆ విషయం తనకు తెలియదన్నారు. శ్రీవారి కైంకర్యాలను ఆగమ శాస్తబ్రద్ధంగా నిర్వహించడం, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే పరమావధిగా విధులు నిర్వహిస్తున్నామని ఈఓ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో అందరి సలహాలు తీసుకుని ఆలయ ప్రతిష్టను, పవిత్రతను మరింత పెంచుతామన్నారు. ఇంకా ఈ సమావేశంలో జేఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.