ఆంధ్రప్రదేశ్‌

పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఆర్ధిక అసమానతలను రూపుమాపే దిశగా ప్రభుత్వ కార్యకలాపాలు ముందుకు సాగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే అగ్రవర్ణాల్లో కూడా వున్న పేదలకు తగిన న్యాయం చేసేందుకు యోచిస్తున్నామన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, తెలగ, ఒంటరి, బలిజలకు జీవనోపాధి నిమిత్తం రుణమేళాలను పశ్చిమలో ప్రారంభించామని, అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. వచ్చే ఏడాది నుంచి కాపు విద్యార్దినీ విద్యార్ధులకు ఉపకార వేతనాలు అందించాలని నిర్ణయించామన్నారు. వచ్చే ఏడాది నుంచి కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు తగ్గకుండా కేటాయింపులు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో బిసి వర్గాలకు ఎటువంటి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కరెంటు కొరతను అధిగమించామని, మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్లు అందజేస్తామని చెప్పారు. పేదల సంక్షేమం కోసం అవసరమైతే మరింతగా కష్టపడి తెలివిగా పధకాలను అమలు చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో చంద్రన్న స్వయం ఉపాధి పధకంలో భాగంగా కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగలకు రుణమేళాను ముఖ్యమంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇదొక చరిత్ర అని, కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ఎన్నో అడుగులు వేస్తున్నామని చెప్పారు. బిసిలకు అన్యాయం జరగకుండా కాపులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఎంతోమంది కాపు నేతలను టిడిపి హయాంలోనే గౌరవించామని, వారికి సముచిత స్థానాలు కల్పించడం కూడా తెలిసిందేనంటూ పలువురు నేతల పేర్లు చెప్పారు. అన్ని వర్గాల్లోనూ పేదలున్నారని, అయితే వీరి సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమాజంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.192 కోట్ల రుణాలను అందిస్తున్నామని, దీనిలో రూ.96 కోట్ల మేర సబ్సిడీని కూడా అందిస్తున్నామన్నారు. ఇప్పటికే రిజర్వేషన్లపై కమిషన్‌ను ఏర్పాటుచేశామని, తొమ్మిది నెలల్లో ఈ నివేదిక రాగానే అనంతర చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా రెండు కులాలే ఉంటాయని, వారు ధనికులు, పేదలని, తమ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందన్నారు. సమాజంలో అసమానతలను తగ్గించడానికి పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా ఎన్నో సమస్యలు వచ్చాయని, అయినప్పటికీ పేదరిక నిర్మూలన కోసం తాను మరింత కష్టపడతానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపులు, మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామన్నారు. కొంతమంది ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అధిగమించి మరీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. కొత్త రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తు ఉండేదని, దాన్ని అధిగమించి ప్రస్తుతం మిగులు విద్యుత్ స్థాయికి చేరుకున్నామన్నారు. ఇక నుంచి కరెంటు కొరత వుండదని, మార్చిలోగా అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తామన్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో ఘర్షణలకు తావుండదని, అయినప్పటికీ ఇక్కడే కొంతమంది విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని, 2029 నాటికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎపి నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా అడ్డగోలుగా డిపాజిట్లు సేకరించి, మోసం చేసే పరిస్థితి తీసుకువచ్చారని, ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఇసుక విషయంలోనూ త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కొల్లు రవీంద్ర, టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎంపి మాగంటి బాబు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మండలి విప్ అంగర రామ్మోహన్, శాసనసభ విప్ చింతమనేని ప్రభాకర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ఎమ్మెల్సీ ఆర్ సూర్యారావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చిత్రం... కాపు రుణామేళాలో లబ్ధిదారులకు ఉపకరణాలు పంపిణీచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు