రాష్ట్రీయం

నవలా రచయిత్రి సులోచనారాణి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: ప్రఖ్యాత నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలోని కాలిఫోర్నియాలో తన కుమార్తె నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఆమె నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు అక్కడే జరుగుతాయని కుమార్తె శైలజ వెల్లడించారు.
సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజ గ్రామంలో జన్మించారు. ప్రఖ్యాత నవలల ద్వారా ఆమె విశేష పాఠకాదరణ పొందారు. 2015లో ప్రభుత్వం ఉగాది ఉత్సవాల్లో ఆమెను ‘హంస’ అవార్డుతో సత్కరించింది. సులోచనారాణి తొలిసారిగా ‘చదువుకున్న అమ్మాయిలు’ చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు-మమతలు సినిమాకు కథ అందించారు. మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారు కలలు నవలలు సినీ తెరపైకి ఎక్కినప్పటికీ సెక్రటరీ మాత్రం ఓ లెజండ్‌గా మిగిలిపోయింది. ఆమె నవలల ప్రభావంతో ఆ రోజుల్లో ప్రతి యువతి ఆత్మాభిమానంతో ఉండాలనుకునేవారు. ‘మీనా’ నవల పత్రికలో ధారావాహికంగా వచ్చింది. ఆ నవల పేరును పాఠకులే నిర్ణయించటం ఇక్కడ విశేషం. మీనా నవలను విజయా సంస్థ 1973లో సినిమాగా తీసింది. సినిమాలుగా వచ్చిన ఆమె నవలల్లో అక్కినేని, శోభన్‌బాబులు హీరోలుగా నటించినవే ఎక్కువ. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండా తనదైన శైలిలో ఆమె అరుదైన రచనలు
చేశారు. 1970 దశకంలో ఆమె నవలలు సినీ ప్రపంచాన్ని కూడా ఒక ఊపు ఊపాయి. మహిళలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలోనే ఆమె తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు. సులోచనారాణి ఎక్కువగా ప్రేమ కథలు రాసినప్పటికీ ఆత్మాభిమానమున్న ఆడపిల్లలనే కథానాయికలుగా ఎంచుకునేవారు. అదే సమయంలో ధనవంతులైన యువకులను నాయకునిగా చూపేవారు. ఆమె రచనలు నేటికీ వివిధ ప్రసార మాధ్యమాల్లో ధారావాహికలుగా వస్తూనే ఉన్నాయి. చాలామంది పాఠకులు నేటికీ సులోచనారాణి రచనలను విస్తృతంగా చదువుతూ ఆస్వాదిస్తూనే ఉన్నారు.
తెలుగు రచయితల సంఘం కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ సులోచనారాణి రచనలు తమ సంఘం తొలి అధ్యక్షులు ముక్కామల నాగభూషణం నేతృత్వంలో వెలువడే ‘ప్రగతి’ పత్రిక ద్వారా 1960 దశకంలో వెలుగు చూశాయని గుర్తుచేశారు. తమ హయాంలో ఆధునిక తెలుగు సాహిత్యం ద్వారా తెలుగు పాఠకుల్లో ఆమె పఠనాసక్తిని పెంచారని చెప్పారు. ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ తెలుగు రచయిత్రుల్లో సులోచనారాణి, తెనే్నటి హేమలత, రంగనాయకమ్మ ముందు వరుసలో ఉంటారన్నారు. వీరిలో సులోచనారాణి తన రచనలతో తెలుగు పాఠలోకాన్ని బాగా పెంచుకున్నారని తెలిపారు. తన రచనల ద్వారా యువతుల్లో చైతన్యం రగిల్చి సామాజిక దృష్టిని ప్రేరేపించారన్నారు. దెయ్యాల సాహిత్యం, విష సంస్కృతికి దూరంగా యువతను జాగృతపరిచారని పూర్ణచంద్ పేర్కొన్నారు. ఎమెస్కో పబ్లిషర్ విజయకుమార్ మాట్లాడుతూ సులోచనారాణి నవలల్లో అత్యధికం తాము ప్రచురించామని చెప్పారు. ఆమె మృతి తెలుగు పాఠకులకు తీరని లోటన్నారు. స్ర్తిల ఆత్మాభిమానం గురించి ఆమె రచనల్లో పెద్దపీట వేసేవారని గుర్తుచేశారు. సులోచనారాణి రాసిన సెక్రటరీ నవల ఇప్పటికీ ఆదరణ పొందడం ఇందుకు ప్రబల నిదర్శనమన్నారు.